కృష్ణా, గోదావరి నదులకు కొనసాగుతోన్న వరద.. శ్రీశైలం నిండింది..

కృష్ణా, గోదావరి నదులకు కొనసాగుతోన్న వరద.. శ్రీశైలం నిండింది..
x
Highlights

గత కొద్దిరోజులుగా తూర్పు , పడమర కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి..

గత కొద్దిరోజులుగా తూర్పు , పడమర కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లు పూర్తిస్థాయిలో నిండాయి. దాంతో దిగువకు నీరు వదులుతున్నారు. ఈ క్రమంలో గత నెలరోజులుగా కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 68,731 క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది. దాంతో కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 17,808 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది. 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు సామర్ధ్యం కూడా ఇంతే కావడం విశేషం.

నాగార్జున సాగర్ లోకి శ్రీశైలం జలాశయం నుంచి 17,808 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.. దీంతో అదే సంఖ్యలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు, అలాగే విద్యుత్‌ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక గోదావరి నది కూడా స్థిరంగా పారుతోంది. దాంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,96,413 క్యూసెక్కులు వరదనీరు చేరుతుండటంతో.. గోదావరి డెల్టా కాలువలకు 12,900 క్యూసెక్కులు పంపిస్తున్నారు, 2,83,513 క్యూసెక్కుల నీరును సముద్రంలోకి వదులుతున్నారు. కాగా వరుసగా రెండో ఏడాది కూడా కృష్ణా, గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండటం రైతులకు ఆనందం కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories