చంద్రయాన్ 2: విక్రం ఆచూకీ పద్నాలుగు రోజుల్లో పట్టుకుంటాం : ఇస్రో ఛైర్మన్ కే.శివన్

చంద్రయాన్ 2: విక్రం ఆచూకీ పద్నాలుగు రోజుల్లో పట్టుకుంటాం : ఇస్రో ఛైర్మన్ కే.శివన్
x
Highlights

విజయానికి ఒక్క నిమిషం ముందు సమాచారం కోల్పోయినా విక్రం ఇప్పటికీ జాబిలిపై దొరికే అవకాశం ఉందని ఇస్రో నమ్ముతోంది. ఈ విషయంపై ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ మరో పద్నాలుగు రోజుల పాటు విక్రం ఆచూకీ గురించిన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఆలోగా విక్రం దొరికే అవకాశాలున్నాయన్నారు.

చివరి మెట్టుపై సమాచార పట్టు తప్పినా.. విక్రం ఆచూకీ కచ్చితంగా పట్టుకుంటామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇస్రో ఛైర్మన్ కే. శివన్. చంద్రయాన్ 2 లో భాగంగా జాబిలిపై కాలిడాల్సిన లాండర్ విక్రం తన ప్రయాణంలో శనివారం చంద్రుని అతి దగ్గరలోకి వచ్చిన తరువాత ఇస్రోతో సమాచారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల తమ శ్రమ విఫలం అయిందని ఇస్రో శాస్త్రవేత్తలు కలత చెందారు. ఛైర్మన్ శివన్ అయితే తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో ప్రధాని మోడీ ఆయనను ఊరడించారు.

ఇదిలా ఉండగా.. లాండర్ ఆచూకీ విషయమై ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ విక్రం ఆచూకీ కనుక్కోవడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ఆ ప్రయత్నాలను ఆప్బోవడం లేదనీ, మరో పద్నాలుగు రోజుల పాటు ఇవి కొనసాగుతాయన్నారు. ఈలోపు విక్రం జాడను పట్టుకునే అవకాశం ఉందనే నమ్మకాన్ని వ్యక్త్రం చేశారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 2 గురించి మరిన్ని వివరాలు తెలిపారు. చంద్రయాన్-2 యాత్ర చివర్లో నిర్వహించిన 'పవర్‌ డిసెంట్‌' అంచెలో నాలుగు దశలు ఉన్నాయని, మొదటి మూడు అద్భుతంగా సాగాయన్నారు. చివరిది మాత్రం సాఫీగా జరగకపోవడం వల్లే లాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని శివన్ వివరించారు.

ఇక లాండర్, రోవర్ విఫలం అయినా ఈ ప్రయోగం మన సాంకేతిక సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో ముఖ్యమైనది ఆర్బిటార్ అనీ, అది సక్రమంగానే ఉందనీ చెప్పారు. ఆర్బిటర్‌లోని డ్యూయెల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడర్‌ (సార్‌)కు చంద్రుడి ఉపరితలానికి దిగువన 10 కిలోమీటర్ల లోతులోని అంశాలనూ పరిశోధించే సామర్థ్యం ఉందని తెలిపారు. దాని సాయంతో చంద్రుడి ఉపరితలం కింద ఘనమంచు రూపంలో ఉన్న నీటి వనరులను గుర్తించవచ్చని తెలియజేశారు. అంతేకాకుండా, ప్రపంచంలోనే మొదటిది.. అత్యంత శక్తివంతమైనదీ అయిన కెమెరా ఈ ఆర్బిటార్ కు అమర్చినట్టు చెప్పారు. ఆర్బిటర్‌లోని ఈ హై రిజల్యూషన్‌ కెమెరాకు 30 సెంటీమీటర్ల వరకూ జూమ్‌ అయ్యే సామర్థ్యం ఉందన్నారు. ఇక దానిలోని ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ చాలా శక్తివంతమైందని చెప్పిన శివన్.. ఆర్బిటార్ జీవితకాలం ఐదేళ్లనీ కానీ దీనిలో ఇంధనం పుష్కలంగా ఉండడం వలన అది ఎదున్నరేళ్ళు పనిచేయగలదనీ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories