Chandrayaan 2: ధైర్యంగా ఉండండి.. ఇస్రో శాస్త్రవేత్తలతో మోదీ

Chandrayaan 2: ధైర్యంగా ఉండండి.. ఇస్రో శాస్త్రవేత్తలతో మోదీ
x
Highlights

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి దశలో సమస్య తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది.

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి దశలో సమస్య తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది. ముందు నుంచి ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. ఈ 15 నిమిషాల్లో 14 నిమిషాలు ఎంతో సాఫీగానే సాగిపోయాయి. ప్రతి అంచెనూ విజయవంతంగా అధిగమిస్తున్నప్పుడల్లా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఇక జాబిల్లిపై కాలుమోపడమే తరువాయి అనుకున్న దశలో ఊహించని అవాంతరం తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. జాబిల్లి దిశగా 48 రోజుల అద్భుత ప్రయాణం తర్వాత ఈ వ్యోమనౌకకు ఈ పరిస్థితి ఎదురైంది.

తుది ఘట్టం కోసం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ లోని మిషన్‌ కంట్రోల్‌ కాంప్లెక్స్‌ లో నిన్న సాయంత్రం నుంచి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి దాటాక 1.38 గంటలకు ల్యాండింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ దశలో భూకేంద్రం నుంచి మార్గనిర్దేశం లేని పరిస్థితుల్లో ల్యాండర్‌లోని సొంత మేధస్సు బాగానే పనిచేసింది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న విక్రమ్‌ ల్యాండర్‌ జోరుకు మొదట్లో అనుకున్న రీతిలోనే ముకుతాడు వేసింది. రఫ్‌ బ్రేకింగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 10 నిమిషాల తర్వాత ఫైన్‌ బ్రేకింగ్‌ అంచె ఆరంభమైంది. అనుకున్న విధంగానే వేగం తగ్గుతూ వచ్చింది. జాబిల్లి ఉపరితలం చేరుకోవడానికి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా అకస్మాత్తుగా ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో అయోమయం నెలకొంది.

సంకేతం కోసం కొద్దిసేపు ఎదురూచూశారు. ఫలితం లేకపోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ కె.శివన్‌ క్లుప్తంగా ఒక ప్రకటన వెలువరించారు. 2.1 కిలోమీటర్ల వరకూ అంతా బాగానే సాగిందని.. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి భూ కేంద్రానికి సంకేతాలు స్తంభించాయని తెలిపారు. సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని అన్నారు. ల్యాండర్‌ నుంచి సంకేతాలు అందడం లేదని ప్రకటించినప్పుడు ఇస్రో ఛైర్మన్ శివన్‌ ఒకింత ఉద్విగ్నానికి లోనయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేమీ కాదని మోదీ అన్నారు. భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంలో ముందకు సాగుదామని శాస్త్రవేత్తలకు సూచించారు. భవిష్యత్‌లో విజయాన్ని అందుకుంటారన్న విశ్వాం తనకుందన్నారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని ధైర్యం చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories