Post Mortem: కీలక నిర్ణయం.. ఇక రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం!

Central Ministry of Health has Decided to Conduct Post Mortem for 24 hours a day in Hospitals with all the Facilities
x

ఇక రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం(ఫైల్ ఫోటో)

Highlights

* బ్రిటీష్‌ వ్యవస్థకు స్వస్తి పలికామన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

Post Mortem: ఎవరైనా వ్యక్తి చనిపోయిన సందర్భంలో మెడికోలీగల్ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే, అలాంటి మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటలతరబడి ఆస్పత్రుల్లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో 24గంటలూ చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

బ్రిటీష్‌ వ్యవస్థకు స్వస్తి పలికాం. 24 గంటలూ పోస్టుమార్టం చేయవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకు సుపరిపాలన అందించడంలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ మరో నిర్ణయం తీసుకుంది. రాత్రివేళల్లో పోస్టుమార్టం చేసేందుకు సౌకర్యాలున్న ప్రభుత్వ ఆస్ప్రతుల్లో ఇక నుంచి సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, మెడికో లీగల్‌ కేసుల్లోని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ విభాగంలోని సాంకేతిక కమిటీ పరిశీలించింది.

అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, ముఖ్యంగా రాత్రివేళల్లో పోస్టుమార్టానికి అవసరమైన లైటింగ్‌తోపాటు మౌలిక సదుపాయాలను ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనని అభిప్రాయపడింది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు రాత్రివేళ పోస్టుమార్టం చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ అన్ని వేళలా పోస్టుమార్టం చేయడం సాధ్యమేనని పేర్కొంది.

అయితే, హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలతో పాటు అనుమానాస్పద కేసులకు మాత్రం రాత్రిపూట పోస్టుమార్టం చేయరాదని నిర్ణయించినట్లు సమాచారం. ఇక రాత్రిపూట చేసే పోస్టుమార్టాలకు తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories