India: ఏపీ, తెలంగాణకు వరుస షాక్‌లు ఇస్తోన్న కేంద్రం

Central Government Shock to Andhra Pradesh and Telangana
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

India: విభజన హామీలకు కేంద్రం తిలోదకాలు * ఒక్కొక్కటిగా హామీలను తుంగలో తొక్కుతోన్న కేంద్రం

India: విభజన హామీలు ఒక్కొక్కటిగా అడుగున పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఆశలు ఆవిరవుతున్నాయి. రెండు రాష్ట్రాల నోట్లో మట్టి కొడుతూ. విభజన హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర వైఖరి ఇందుకు కారణమవుతోంది. ఇటు తెలంగాణ.. అటు ఏపీకి వరుస షాక్‌లు ఇస్తోంది కేంద్రం.

తెలుగురాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా? విభజన హామీలను తుంగలో తొక్కుతోందా..? కేంద్రం వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇప్పటికే పోలవరం, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏపీకి షాక్‌లు ఇచ్చిన కేంద్రం.. రామాయపట్నంపై కూడా కీలక ప్రకటన చేసింది. పోర్టుకు సాయం చేయలేమని తేల్చి చెప్పేసింది.

విభజన చట్టం ప్రకారం పెద్దపోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిదని తెలిపారు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని.. నాన్‌ మేజర్‌ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు.పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాల్సి ఉందన్నారు.

ఇటు తెలంగాణలో కూడా ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది కేంద్రం. కాజీపేట రైల్వే కోచ్ ఏర్పాటు అనవసరం అని స్పష్టం చేయడంతో.. ఆశలు ఆవిరయ్యాయి. ఇక విభజన హామీల్లో ఉన్న మరో అంశం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ ఏడేళ్లు పూర్తవుతున్నా ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. ఇక గిరిజన వర్శిటీ, ఐఐఎం, ఐఐటీలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. ప్రతీ విషయంలో కేంద్రం మొండిచేయి చూపుతోందన్నారు.

ఒక్కటి కాదు రెండు కాదు.. ఎన్నో విభజన హామీలను కేంద్రం పక్కనబెట్టింది. ఇప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. పోలవరం నిధులపై క్లారిటీ లేదు. తెలంగాణకి ఇస్తామన్న జాతీయ హోదా ప్రాజెక్టు ఊసేలేదు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు. ఇలా కాలం గడిచే కొద్దీ ఒక్కో హామీ మరుగన పడే అవకాశాలు కనిపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీల సాధనకు ఎలాంటి అడుగులు వేస్తాయో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories