కర్ణాటక రాజకీయాల్లో కొత్త వివాదం

కర్ణాటక రాజకీయాల్లో కొత్త వివాదం
x
Highlights

నిన్నటి వరకు అసెంబ్లీలో బలాబలాల చుట్టూ తిరిగిన కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రూటు మార్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే యడియూరప్ప తీసుకున్న నిర్ణయం...

నిన్నటి వరకు అసెంబ్లీలో బలాబలాల చుట్టూ తిరిగిన కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రూటు మార్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే యడియూరప్ప తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాలకు కారణమైంది. దీంతో కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇంతకీ యడియూరప్ప తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏమిటి..? దీనిపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి..?

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న రెండోరోజే అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం వివాదాలకు కారణమైంది.

ఏటా నవంబర్ లో కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత ఏర్పాటైన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి సర్కార్ ఈ ఆనవాయితీని కొనసాగించాయి. అయితే టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. మైసూరును పరిపాలించిన వడయార్ రాజవంశీయులపై దండెత్తిన టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్సవాలను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీని కోసం వారు ఆందోళనలను కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి.

బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ దాన్ని లెక్క చేయలేదు గత ప్రభుత్వాలు. బ్రిటీషర్లను గడగడలాడించిన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ఎందుకు నిర్వహించకూడదనేది బీజేపీయేతర పార్టీల ప్రశ్న. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో యడియూరప్ప సుల్తాన్ జయంత్యుత్సవాలను రద్దు చేశారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ మండిపడుతోంది.

రాష్ట్రంలో నివసిస్తోన్న లక్షలాది మంది మైనారిటీల మనోభావాలను కించపరిచిందని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీపై ధ్వజమెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories