Bharat Jodo Yatra: నేటితో 100 రోజులకు చేరిన భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra Reached 100 Days Today
x

నేటితో 100 రోజులకు చేరిన భారత్ జోడో యాత్ర

Highlights

Bharat Jodo Yatra: ఇప్పటికే 8 రాష్ట్రాల్లో పూర్తయిన రాహుల్ యాత్ర.. మొత్తం 3,500 కి.మీ.ల లక్ష్యం

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వంద రోజులకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌వరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోన్న ఈ యాత్ర ఇవాళ్టితో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. జోడో యాత్రలో భాగంగా గత మూడు నెలలకుపైగా పలు రాష్ట్రాల్లో అన్ని వర్గాల వారిని పలుకరిస్తూ, సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాల్లో కొనసాగింది. తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో జోడో యాత్ర పూర్తయ్యింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈనెల 24న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చివరకు జమ్మూ, కశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర లక్ష్యం మొత్తం 3వేల 500 కిలో మీటర్లు కాగా అందులో ఇప్పటికే 2వేల 800కిలో మీటర్లులు పూర్తి చేసుకుంది.

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే తన ప్రయత్నమని రాహుల్‌ చెబుతుండగా.. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ నేతపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. పాదయాత్ర ప్రారంభంలో రాహుల్‌ ధరించిన టీ-షర్టు అత్యంత ఖరీదైందంటూ విమర్శించింది. అనంతరం ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ మాదిరిగా రాహుల్‌ గాంధీ కనిపిస్తున్నారంటూ బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. మరోవైపు ఈ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోన్న సమయంలో మిత్ర పక్షాలైన శివసేన, కాంగ్రెస్‌ల మధ్య సావర్కర్‌ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో పాటు మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర జరుగుతోన్న సమయంలో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. అయినా రాహుల్ మాత్రం తన ఈ విమర్శలకు సమాధానలిస్తూ పార్టీలోని సమస్యలను పరిష్కరించుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.

సుదీర్ఘ పాదయాత్ర చేస్తోన్న రాహుల్‌ గాంధీకి పార్టీ కార్యకర్తలు, సామాన్య పౌరులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటివరకు పూజా భట్‌, రియా సేన్‌, స్వరభాస్కర్‌, రష్మీ దేశాయ్‌ లాంటి బాలీవుడ్‌ నటులు యాత్రలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ ఎల్‌ రాందాస్‌, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘరాం రాజన్‌ లాంటి ప్రముఖులు సైతం ఈ యాత్రలో రాహుల్‌తో అడుగేసి మద్దతును తెలిపారు.

భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తున్నప్పటికీ ఎన్నికల్లో అది ఏ మేరకు ఫలితాలు ఇస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అవసరమైన మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయలేదనే వాదన వినపడింది. అయినప్పటికీ హిమాచల్‌లో స్పష్టమైన మెజారిటీతో పార్టీ విజయం సాధించగా గుజరాత్‌లో మాత్రం ఘోర పరాజయం పాలయ్యింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లల్లోని కాంగ్రెస్ నేతల్లో జోడో యాత్ర ఉత్సహాన్ని నింపుతోంది.

రాహుల్‌ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘ కాలంలో గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించే సత్తా ఉందనడానికి హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శని లెక్కలేస్తున్నారు. రాహుల్‌ యాత్ర పార్టీ శ్రేణులకు కొత్త ఆశలు కలిగిస్తున్నప్పటికీ అవి ఓట్లుగా ఏ మేరకు మారుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories