అట్టుడుకుతున్న బెంగాల్‌..రాష్ట్రపతి పాలన తప్పదా..?

అట్టుడుకుతున్న బెంగాల్‌..రాష్ట్రపతి పాలన తప్పదా..?
x
Highlights

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా..? నిత్యం జరుగుతున్న గొడవలు ఎక్కడికి దారి తీస్తున్నాయి..? తాజాగా అఖిలపక్షం భేటీకి గవర్నర్‌ త్రిపాఠి...

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా..? నిత్యం జరుగుతున్న గొడవలు ఎక్కడికి దారి తీస్తున్నాయి..? తాజాగా అఖిలపక్షం భేటీకి గవర్నర్‌ త్రిపాఠి పిలుపునివ్వడం అమిత్ షాతో భేటీ కావడంతో రాష్ట్రపతి పాలన తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం జరిగిన ఆందోళనలతో బెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మొదలైన హింస బెంగాల్‌లో ఇంకా రగులుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న రాజకీయ హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో బీజేపీ కార్యకర్త హత్యతో రాష్ట్రం రావణకాష్టంలా మారింది. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆశిష్‌ సింగ్‌ అనే బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మాల్దాలోని ఓ ప్రాంతంలో శవమై కనిపించాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గత సోమవారం 'బ్లాక్ డే' నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 18 మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు తరలి వచ్చారు.

కోల్‌కతాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించడానికి యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు. దీనికి ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నీళ్ల బాటిళ్లు విసిరారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి మమత సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టడంలో మమతా సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ టీఎంసీ ఆరోపిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజా పరిస్థితిపై గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు హాజరవుతున్నట్లు రాజ్‌ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇదే సమయంలో గవర్నర్‌ త్రిపాఠి, హోంమంత్రి అమిత్‌ షా మధ్య కీలక చర్చలు జరిగాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories