Go First: తీవ్ర నిధుల కొరత కారణంగా... దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్ లైన్స్

Bankrupt Go First Airlines
x

Go First: తీవ్ర నిధుల కొరత కారణంగా... దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్ లైన్స్

Highlights

Go First: ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు సర్వీసుల రద్దు

Go First: వాడియా గ్రూప్‌నకు చెందిన చౌక విమానయాన సేవల సంస్థ గో ఫస్ట్ దివాలా ప్రకటించింది. తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఎయిర్‌లైన్స్‌ స్వచ్ఛందంగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఢిల్లీ బెంచ్‌ను ఆశ్రయించింది. తీవ్ర నిధుల కొరత కారణంగా ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గో ఫస్ట్‌ వెల్లడించింది. సర్వీసులను రద్దు చేసినందుకు ప్రయాణికులకు క్షమాపణలు తెలిపిన ఎయిర్‌లైన్స్‌.. ఈ నెల 3,4,5 తేదీల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం సంస్థ రోజుకు 180 నుంచి 185 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిర్‌లైన్స్‌ సర్వీసుల రద్దుతో దాదాపు 90 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడవచ్చని అంచనాలున్నాయి. అయితే, మూడ్రోజుల తర్వాతైనా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయా..? అన్న సందేహాలున్నాయి. సర్వీసుల రద్దును మరికొన్ని రోజులు పొడిగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

17 ఏళ‌్ల నుంచి నుంచి నడుస్తున్న గో ఫస్ట్‌లో ఇప్పటివరకూ ప్రమోటర్‌ వాడియా గ్రూప్‌ 6 వేల 500 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టింది. గత మూడేళ్ల ప్రమోటర్లు 3 వేల 200 కోట్లు నిధులు అందించారని గో ఫస్ట్‌ తెలిపింది. పీ అండ్‌ డబ్ల్యూ సరఫరా చేసిన ఇంజిన్లలో పదేపదే సమస్యలు రావడం, సర్వీసు ఒప్పందాల ప్రకారం వాటిని మరమ్మత్తు చేయకపోవడం, విడిభాగాలు ఇవ్వకపోవడంతో తమ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్నదని కంపెనీ వివరించింది. తొలి విడత ఇంజిన్‌ విడిభాగాల్ని ఏప్రిల్‌ 27కల్లా సరఫరా చేయమంటూ పీ అండ్‌ డబ్ల్యూను ఆదేశిస్తూ సింగపూర్‌లోని అంతర్జాతీయ వివాద పరిష్కారాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిందని, అయినా అవి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్టు గో ఫస్ట్‌ వెల్లడించింది.

సింగపూర్‌ కోర్టు ఉత్తర్వుల ప్రకారం మలి విడతగా 2023 డిసెంబర్‌లోపుగా ప్రాట్‌ అండ్‌ విట్నీ విడిభాగాలు ఇవ్వాల్సి ఉంటుందని, కోర్టు ఆదేశాలను ఇంజిన్ల సంస్థ పాటిస్తే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌కల్లా పూర్తిస్థాయి కార్యకలాపాల్ని ప్రారంభించగలుగుతామని గో ఫస్ట్‌ వివరించింది.

మూడు రోజులు విమానాల్ని రద్దు చేయాలని నిర్ణయించిన గో ఫస్ట్‌కు ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏ షోకాజ్‌ నోటీసు జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించినందున, ఎందుకు చర్య తీసుకోకూడదో తెలియచేయాలంటూ గో ఫస్ట్‌కు షోకాజ్‌ ఇచ్చినట్టు డీజీసీఏ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories