Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

All Set for First Phase Polling of Gujarat Assembly
x

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం 

Highlights

Gujarat Polls: ఉ.8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ముగింపు

Gujarat polls: గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లో పాగా వేసేందుకు అధికార బీజేపీతోపాటు, బహుజన్ సమాస్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీలతోపాటు ఈ పర్యాయం ఆమ్‌ ఆద్మీపార్టీ బరిలో దిగింది. గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలుండగా..తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 718 మంది పురుషులు, 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాలు, కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై..సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా..BSP-57, BTP-14, SP-12, వామపక్షాలు 6 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. 339 మంది స్వతంత్రులు బరిలోకి దిగారు. మొదటి దశ ఎన్నికల్లో 25వేల, 434 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 2లక్షల, 20వేల, 288 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సీఈసీ వెల్లడించింది.

తొలిదశ పోలింగ్‌లో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియా నుంచి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పరుషోత్తం సోలంకి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బవలియా..కాంతిలాల్ అమృతయా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల్లో పటేల్, గిరిజన వర్గాల ఓట్లే కీలకం కానున్నాయి. దక్షిణ గుజరాత్‌లో ఉన్న 35 సీట్లలో 14 గిరిజన స్థానాలే ఉన్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. సూరత్ ‌రూరల్‌, బర్డోలీ, మండ్వీ, మహువా, అల్పడ్, కమ్రేజ్, మంగ్రోల్ స్థానాల్లో పటేల్ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories