Tamil Nadu: తమిళనాడులో అన్నా డీఎంకేలో ఆధిపత్యపోరు

AIADMK in Tamil Nadu | Tamil Nadu News
x

Tamil Nadu: తమిళనాడులో అన్నా డీఎంకేలో ఆధిపత్యపోరు

Highlights

Tamil Nadu: ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని.. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న పళనిస్వామి

Tamil Nadu: తమిళనాట ప్రబల శక్తిగా ఉన్న అన్నాడీఎంకేలో వర్గపోరు రచ్చకెక్కింది. క్రమశిక్షణకు మారుపేరైన అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు కోర్టుకెక్కింది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎంజీ రామచంద్రన్‌ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత.. ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకేకు బలమైన పునాదులు వేశారు. రెండాకుల గుర్తుకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ముగ్గురు నేతలు మూడు ముక్కలాట ఆడుతున్నారు. జయలలిత మరణంతో ప్రధాన కార్యదర్శి పదవి కోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని పూర్తి తన చేతుల్లోకి తీసుకునేందుకు యత్నిస్తున్న ఈపీఎస్‌కు ముకుతాడు వేసేందుకు ఓపీఎస్‌ కోర్టుకెక్కారు. సందట్లో సడేమియా అన్నట్టుగా.. వారి మధ్య పార్టీ మాదంటూ శశికల రంగంలోకి దిగారు.

జయలలిత మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం పళని, పన్నీరు, శశికళ పోటీ పడ్డారు. అయితే అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలవడంతో.. పళని, పన్నీరు జంట చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడంతో.. నాటి నుంచి పార్టీపై పట్టుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. పార్టీలోనూ ఓపీఎస్‌, ఈపీఎస్‌ మధ్య విభేదాల కారణంగా అధికారంలో ఉన్నా.. పార్టీ ఓటమి పాలయ్యింది. ఆ తరువాత పార్టీపై పట్టు కోసం ఏక నాయకత్వం నినాదాన్ని పళనిస్వామి ఎత్తుకున్నారు. తనే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పళని స్వామి తన మద్దతుదారులతో ఈనెల 11న సర్వసభ్య సమావేశం నిర్వహించి.. తననే పార్టీ చీఫ్‌గా ఎన్నుకునేలా ఎత్తుగడ వేశారు.

అయితే పళని స్వామి ప్రయత్నాలకు పన్నీరు సెల్వం బ్రేక్‌ వేశారు. 11న నిర్వహించే సర్వ సభ్య సమావేశం నిర్వహణను ఆపాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని పన్నీరు కోరారు. అందుకు మద్రాసు హైకోర్టు అంగీకరించింది. ఆమేరకు తాజాగా మొదటికేసుగా విచారణ చేపట్టింది. అయితే పన్నీరుసెల్వం తరఫున న్యాయవాదులు రాలేదు. పళనిస్వామి తరఫున మాత్రం న్యావాదులు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. పార్టీ పగ్గాల కోసం శశికళ కూడా రంగంలోకి దిగారు. మాజీ మంత్రి జయకుమార్‌ను ముందు పెట్టి.. సర్వసభ్య సమావేశానికి శశికళ శ్రీకారం చుట్టారు. ఆమేరకు తమ సమావేశానికి బందోబస్తు కల్పించాలని.. జయకుమార్‌ డీజీపీని కోరారు. జనరల్‌ బాడీ సమావేశానికి పన్నీరుకు కూడా ఆహ్వానం పంపారు. సెల్వంను తమవైపు తిప్పుకునేందుకు శశికళ యత్నిస్తున్నారు. ఈ మూడు ముక్కలాటతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీని అందరూ కలిసి నాశనం చేస్తున్నారని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories