Thalapathy Vijay : గోల్డ్ రింగ్ నుంచి గ్యాస్ దాకా.. తమిళనాట విజయ్ వరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Thalapathy Vijay
x

Thalapathy Vijay

Highlights

Thalapathy Vijay : తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ మహిళల కోసం రూ. 2500 భృతి, ఉచిత గ్యాస్, బంగారం వంటి భారీ హామీలు ప్రకటించారు. అవినీతిని అరికట్టి ఈ పథకాలను అమలు చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. ఎన్నికల మేనిఫెస్టోను తలపించేలా మహిళల కోసం వరాల జల్లు కురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాము అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా, పక్కా పథకాలు, వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రసంగం ద్వారా అర్థమవుతోంది.

మహిళలకు ఆర్థిక భరోసా - సంక్షేమ పథకాలు

విజయ్ ప్రకటించిన పథకాల్లో అత్యంత ఆకర్షణీయమైనది మహిళా యజమానులకు ఇచ్చే నెలవారీ భృతి. 60 ఏళ్ల లోపు ఉండి, ప్రభుత్వ ఉద్యోగులు కాని కుటుంబాల్లోని మహిళా హెడ్స్‌కు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏటా ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఎనిమిది గ్రాముల బంగారం, పట్టుచీరను అందించే అన్నాన్ సీర్ పథకాన్ని, అలాగే నవజాత శిశువుల కోసం బంగారు ఉంగరంతో కూడిన థాయ్ మా వెల్కమ్ కిట్‌ను కూడా విజయ్ ప్రకటించారు. విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేయకుండా ఉండేందుకు 9 నుంచి 12 తరగతుల వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు.

భద్రతకు పెద్దపీట - రాణి వేలు నాచియార్ టీమ్స్

మహిళా భద్రత విషయంలో విజయ్ కీలకమైన ప్రతిపాదనలు చేశారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీని కోసం బాడీ కెమెరాలతో కూడిన 500 రాణి వేలు నాచియార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పానిక్ బటన్లు, చీకటి ప్రాంతాల్లో సీసీటీవీల నిఘా పెంచుతామని హామీ ఇచ్చారు. నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా అంజలి అమ్మాళ్ పేరుతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆయనకున్న సామాజిక అవగాహనను తెలియజేస్తోంది.

అవినీతిపై యుద్ధం - నిధుల సమీకరణ

రాష్ట్రంపై ఇప్పటికే భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో ఇన్ని పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నకు విజయ్ సూటిగా సమాధానమిచ్చారు. సమస్య డబ్బు కొరత కాదని, అవినీతి అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై 30% స్టాలిన్ టాక్స్(అవినీతి) నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. ఈ అవినీతిని అరికడితే సంక్షేమ పథకాలను అమలు చేయడం అసాధ్యమేమీ కాదని ఆయన విశ్లేషించారు. రాజకీయంగా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విజయ్ ఈ అవినీతి అస్త్రాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

వ్యక్తిగత జీవితంపై క్లారిటీ

ఇక గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై జరుగుతున్న ప్రచారంపై కూడా విజయ్ స్పందించారు. "నా గురించి వచ్చే వార్తలు చూసి అభిమానులు బాధపడటం నాకు బాధగా ఉంది. నా వ్యక్తిగత విషయాలను నేను చూసుకోగలను, మీరు అధైర్యపడకండి. మనమంతా కలిసి ప్రజల సమస్యలపై దృష్టి పెడదాం" అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. ఈ ప్రకటన ద్వారా తన వ్యక్తిగత జీవితం రాజకీయాలకు అడ్డంకి కాదని ఆయన సంకేతాలిచ్చారు. మొత్తానికి విజయ్ ప్రకటనలు తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories