భారత్‌లో వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు రికార్డు

459 Omicron Variant Cases Recorded in India Today 26 12 2021 | Omicron Live Updates
x

భారత్‌లో వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు రికార్డు

Highlights

Omicron Cases in India: దేశంలో 459కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 459 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదవుతుండగా.. తెలంగాణలో కొత్త వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో.. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాల ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా నిబంధనలు ప్రకటిస్తున్నాయి. తాజాగా.. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో జనవరి 2వరకు పలు కోవిడ్‌ నిబంధనలు ప్రకటించింది.

అటు.. హరియాణాలో నైట్‌ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. బహిరంగ కార్యక్రమాలు, వేడుకలకు 2వందల మంది మించరాదని నిబంధన విధించినట్టు తెలిపారు. మరోవైపు.. యూపీ ప్రభుత్వం కూడా నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. వివాహాలు, వేడుకలకు 2వందల మందిని మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక.. ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. యూకే నుంచి అనంతపురం వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా.. సౌతాఫ్రికా నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 6కు చేరింది. అటు.. పశ్చిమ బెంగాల్‌లో ఓ జూనియర్‌ డాక్టర్‌ ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. బాధితుడిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4కి చేరింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గ్రాఫ్‌ పెరుగుతోంది. ఢిల్లీలో కొత్తగా 249 కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో ఇవే అత్యధిక కేసులని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 9వందల 34కు చేరింది. ఇటు.. మహారాష్ట్రలోను రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిన్న 7వందల 57 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ముంబైలో 3వేల 7వందల 3 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కోవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉండి.. వ్యాక్సినేషన్‌ తక్కువగా జరుగుతున్న పలు రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పది రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్‌, మిజోరం, కర్ణాటకతో పాటు.. బిహార్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, యూపీ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి. 3 నుంచి 5 రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories