Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Waltair Veerayya Movie Review
x

Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Highlights

Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

చిత్రం: వాల్తేరు వీరయ్య

నటీనటులు: చిరంజీవి, శృతిహాసన్, రవి తేజ, క్యాథరిన్ తెరెసా, బేబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఊర్వశి రౌతెల తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్

దర్శకత్వం: కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ

బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్

విడుదల తేది: 13/01/2023

ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "వెంకీ మామ" ఫేమ్ డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ మరియు యాక్షన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా జనవరి 13 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..

కథ:

వాల్తేరు వీరయ్య (చిరంజీవి) వైజాగ్ పోర్ట్ ప్రాంతంలో ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉంటాడు. అక్కడున్న నేవీ వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఒక మలేషియన్ డ్రగ్స్ మాఫియా కి అధిపతి అయిన సాల్మన్ సీజర్ (బాబి సింహ) వల్ల సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) అనే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు. దీంతో సీతాపతి ఎలాగైనా సాల్మాన్ ను ఇండియా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక సరైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా వీరయ్య పరిచయం అవుతాడు. సాల్మన్ ని ఇండియాకి తీసుకురావడం కోసం సీతాపతి వాల్తేరు వీరయ్య 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంటారు. మరి వీరయ్య సాల్మన్ ను ఇండియాకి తీసుకురాగలిగాడా? సాల్మన్ సోదరుడు మైకేల్ సీజర్ (ప్రకాష్ రాజ్) కి వీరయ్య కి ఏంటి సంబంధం? మైకేల్ ను పట్టుకోవాలని వీరయ్య ఎందుకు అనుకుంటాడు? వీరయ్య కథలోకి ఏసిపి విక్రమ్ సాగర్ (రవితేజ) ఎందుకు వచ్చాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించే చిరంజీవి ఈ సినిమాలో కూడా తన పర్ఫామెన్స్, డాన్స్, యాక్షన్ మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను చాలా బాగా అలరించారు. శృతిహాసన్ కి ఈ సినిమాలో కూడా పెద్ద చెప్పుకోదక్క పాత్ర ఏమి దొరకలేదు. ఈ సినిమాలో కూడా చాలా వరకు డాన్స్ లకు మాత్రమే శృతిహాసన్ పరిమితమైంది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ చాలా బాగా నటించారు. తెలంగాణ యాస తనకి అంతగా సెట్ అవ్వకపోయినప్పటికీ నటనపరంగా రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. బాబీ సింహ మరియు ప్రకాష్ రాజ్ కూడా విలన్ పాత్రలలో చాలా బాగా నటించారు. రాజేంద్రప్రసాద్ నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ కామెడీ బాగానే పండింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలో పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

స్క్రీన్ ప్లే చాలా అనీవెన్ గా ఉండటం సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కథ చాలా సీరియస్ గా మొదలవుతుంది కానీ వెంటనే హీరో యాక్షన్ సన్నివేశాలు మరియు కామెడీ వంటి సన్నివేశాలు పెట్టడం తో స్క్రీన్ ప్లే కొంత దెబ్బతింది. చిరంజీవి ఎంట్రీ సన్నివేశం మాత్రం మెగా అభిమానులకు చాలా బాగా నచ్చుతుంది. డైరెక్టర్ బాబి కథ ను బాగానే నెరేట్ చేశారు కానీ కొన్ని సన్నివేశాలకు లాజిక్ లేనట్లు అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఒకటి రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే అనిపిస్తుంది. ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ అన్నీ గ్రాండ్ గా కలర్ ఫుల్ గా కనిపించాయి. ఎడిటింగ్ చాలా వరకు పర్లేదు కానీ కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

బలాలు:

చిరంజీవి

సెకండ్ హాఫ్

పాటలు

ఫైట్ సీన్స్

ఎంటర్టైన్మెంట్

బలహీనతలు:

కొన్ని కామెడీ సన్నివేశాలు

స్క్రీన్ ప్లే

ఎమోషనల్ సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగానే మొదలవుతుంది కానీ చాలా వరకు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కే సరిపోతుంది. అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు కొన్ని బాగానే అనిపించినప్పటికీ మరికొన్ని మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. రవితేజ ఎంట్రీ నుంచి ఈ సినిమా ఇంకొంత ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రవితేజ మరియు చిరంజీవిల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి. వింటేజ్ చిరంజీవి మానరిజమ్స్ ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయి. ఎమోషనల్ సన్నివేశాలను కూడా బాగానే రాసుకున్నారు కానీ కొన్ని ఎమోషన్స్ కి ఫ్యాన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. ఓవర్ ఆల్ గా "వాల్తేరు వీరయ్య" మెగాస్టార్ అభిమానులకు ఒక మాస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories