Tollywood: విడుదలకు మోక్షమెప్పుడో..!

Upcoming Telugu Movies
x

విడుదలకు మోక్షమెప్పుడో..!

Highlights

సినిమా షూటింగ్ మొదలవ్వగానే పలానా తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు. అయితే తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల తేదీని ప్రకటించగానే అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంటుంది.

Tollywood: సినిమా షూటింగ్ మొదలవ్వగానే పలానా తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు. అయితే తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల తేదీని ప్రకటించగానే అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంటుంది. ఇక విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చిత్రీకరణలో ఆలస్యం, రకరకాల సాంకేతిక కారణాల వల్ల అనుకున్న తేదీకి రాకపోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగులో పలువురు అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇలాంటి సందిగ్ధతే కొనసాగుతోంది. చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నా.. బాక్సాఫీస్ ముందుకొచ్చేది ఎప్పుడన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. దీంతో వీళ్లెప్పుడు తెరపై సందడి చేస్తారన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ సినిమాలేంటో చూద్దాం.

చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబోలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. 2023లో లాంఛనంగా మొదలైన ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఆరంభించిన రోజే 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల వాయిదా వేశారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర 2025 సమ్మర్ బరిలో నిలువనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

విశ్వంభర సినిమాను చిరంజీవి సెంటిమెంట్ డేట్ అయిన మే 9న విడుదల చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం మే 9న సైతం సినిమా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే విశ్వంభర సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయలేకపోవచ్చు అంటున్నారు. అయితే జూన్ లేదా జులై లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ముస్తాబవుతున్న రొమాంటిక్ హరర్ థ్రిల్లర్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యంకావడం వల్ల వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడన్నది అందరిలోనూ ఆసక్తిలేపుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

రవి తేజ కథానాయకుడిగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ జాతర. గతేడాదే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉంది. రవితేజ సెట్లో ప్రమాదానికి గురికావడం, దాని వల్ల చిత్రీకరణ ఆలస్యం కావడం వల్ల ఈ మే 9కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన గ్లింప్స్ లో విడుదల తేదీ వేయకపోవడం వాయిదా వార్తలకు బలం చేకూరింది. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా మే9కి విడుదల అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రెండు సినిమాలు రానున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్1 ను మార్చి 28న థియేటర్లలోకి తీసుకురానున్నట్టు నిర్మాతలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కానీ పవన్ పాత్రకు సంబంధించి మరో నాలుగు రోజులు చిత్రీకరణ మిగిలి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చెప్పిన తేదీకి వస్తుందా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పవన్, సుజీత్ ల నుంచి రానున్న యాక్షన్ సినిమా ఓజీ. ఇది కూడా ఇప్పటికే ముగింపు దశ చిత్రీకరణకు చేరుకున్నప్పటికీ విడుదల ఎప్పుడన్నది ఇంకా తెలియదు. పవన్ పాత్రకు సంబంధించి మిగిలిన చిత్రీకరణ పూర్తి చేశాక దీనిపై స్పష్టత ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది గతేడాది చివరి నాటికే ముగింపుకు చేరుకుంది. ఈ వేసవిలో తెరపైకి రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ విడుదల తేదీపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇది ఈ వేసవిలో వస్తుందా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌తో పాటు విడుదల తేదీపై స్పష్టత రానున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories