Top
logo

Makar Sankranti 2021: కళ తప్పిన తెలుగు సినిమా!

Tollywood Missed the joy of the Makar Sankranti Festival
X

సంక్రాంతి తెలుగు సినిమా

Highlights

సంక్రాతికి తెలుగు సినిమాకు విడదీయరాని బంధం. పట్నం నుంచి పల్లెకు వెళ్లినా.. పల్లె నుంచి పట్నం సూడ వచ్చినా.. సంక్రాంతి సహజ సందడికి కచ్చితంగా సినిమా సొగసు అద్దాల్సిందే.

తెలుగు ప్రజలకు సంక్రాంతి ఓ వినోదాల వేడుక. ఆధ్యాత్మికత కన్నా.. వినోదానికే పెద్ద పీట సంక్రాంతి పండుగకు. హరిదాసులు ఉదయాన్నే ఆధ్యాత్మిక రాగాలను పలికి పొతే.. పట్టు పరికిణీల్లో పల్లె పడుచులు రంగవల్లికల సరాగాలు వల్లిస్తుంటే.. డూడూ బసవన్నలు గొబ్బెమ్మల దగ్గర తలలు ఊపుతుంటే.. ఒక పక్క భోగి మంటలు.. మరో పక్క కోడిపందాల జోరులో పెరిగిన వేడి.. పిండివంటలు గుబాళింపు ఒకవైపు.. ఉరుకులాడుతున్న పిల్లగాళ్ళ సందడి మరో వైపు.. ఇలా పెద్ద పండుగకు ఎన్నో కోణాలు. మరెన్నో వర్ణాలు. నాలుగు రోజుల పాటు పండగ ఉత్సాహం ఊరకే గోదారిలా తుళ్ళి పడుతూనే ఉంటుంది.

ఇదంతా సంక్రాంతికి ఒక వైపు. మరో వైపు అతి పెద్ద వినోదాల పందిరి సినిమా హాలు. అవును. సంక్రాతికి.. తెలుగు సినిమాకు విడదీయరాని బంధం. పట్నం నుంచి పల్లెకు వెళ్లినా.. పల్లె నుంచి పట్నం సూడ వచ్చినా.. సంక్రాంతి సహజ సందడికి కచ్చితంగా సినిమా సొగసు అద్దాల్సిందే. తెలుగు తెర నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు.. నిర్మాతలకు.. ఎగ్జిబిటర్లకు సంక్రాతి మీద ఉన్న మమకారం మామూలుగా ఉండదు. సంక్రాతి బరిలో సినిమా నిలపడానికి ఆరాటపడని హీరో ఉండరు. తపన పడని దర్శకుడూ ఉండరు.

ఒక ఎన్టీవోడు.. ఒక ఏఎన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు.. ఆతరం నుంచి చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్.. బాలకృష్ణ తో పాటు ఈతరం ప్రభాస్.. నానీ.. నాగ చైతన్య.. ఇలా ఎవరిని తీసుకున్నా సంక్రాతి సినిమా కోసం ఎదురుచూస్తారు.

సంక్రాంతి రోజున ఒక్కోసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. పక్క పక్క థియేటర్లలో కృష్ణ, శోభన్ బాబు సినిమాలు విడుదలైన రోజులు ఉన్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. సంక్రాతికి కాసుల పంట గ్యారెంటీ. ఇంటిల్లిపాదీ హీరోతో సంబంధం లేకుండా సంక్రాంతికి వచ్చిన సినిమాలు చూడటానికి క్యూ కట్టేవారు. ఇవన్నీ గత వైభవంగా మిగిలిపోయాయి. సినిమా తీయాలంటే కోట్లు ఖర్చవుతున్న పరిస్థితి.. టీవీలో వస్తున్న కార్యక్రమాలు వినోదాన్ని నట్టింటికి తీసుకురావడంతో కంటెంట్ లేని సినిమాను సంక్రాతి కూడా ఆదుకోలేని పరిస్థితి వచ్చేసింది. దీంతో క్రమేపీ సంక్రాంతి బరిలో నిలవాలనుకునే సినిమాలు డిసెంబర్ చివరి వారం నుంచే వారానికి ఒకటి చొప్పున తేదీలు పంచుకుని విడుదల అయ్యే రోజులు వచ్చేశాయి. అలా కూడా సంక్రాంతి సినిమాలు తమ ప్రత్యేకత నిలబెట్టుకుంటూనే వచ్చాయి. ప్రేక్షకులు కూడా సంక్రాంతి సినిమాకు ఇచ్చే విలువ ఇస్తూనే ఉన్నారు. కంటెంట్ బావుంటే చాలు నెత్తిన పెట్టుకున్నారు.

ఈ సంవత్సరం ఆ సంబరం పూర్తిగా పోయింది. కరోనా కాటుతో విలవిలలాడిన జనానికి సంక్రాంతి వినోదం కరువైపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కావాల్సిన సినిమాలు డజన్ల లెక్కన ఉన్నాయి. అయినా కూడా సంక్రాంతికి థియేటర్ల లో వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కరోనా దెబ్బకు పదినెలలు మూత పడిన సినిమాహాళ్లు ఇటీవల తెరుచుకున్నప్పటికీ అన్ని సినిమాలు విడుదల బాట పట్టలేదు. ప్రేక్షకులు సినిమాలను థియేటర్లకు వచ్చి ఎంతవరకూ చూస్తారని అనుమానంతో విడుదల ఆపుకున్నారు చాలా మంది నిర్మాతలు . కొన్ని పెద్ద సినిమాలు వేసవి బరిలోకి వెళ్లాలని రూటు మార్చుకున్నాయి. మొత్తమ్మీద ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఇప్పటికే విడుదలైన సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్.. రవితేజ క్రాక్ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక ఎనర్జీ స్టార్ రామ్ సినిమా రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ రేపు (జనవరి 14) విడుదలకు సిద్ధంగా ఉంది. అయినాగానీ.. సంక్రాంతి సినిమా సందడి ఏమాత్రం లేదు. తక్కువ స్క్రీన్లు ఓపెన్ కావడం.. 50 శాతం సీట్లకె అనుమతి ఉండటం.. కరోనా పీడ పూర్తిగా పోకపోవడం వంటి కారణాలతో సంక్రాతి సినిమా కళ తప్పింది. ఆనాటి రోజులతో పోలిస్తే పూర్తిగా నిస్తేజంగా ఉందనే చెప్పాలి.

తెలుగు వారి పెద్ద పండగ రోజుల్లో సినిమా సందడి లేకపోవడం ఇదే మొదటిసారి. విచిత్రం ఏమిటంటే.. సినిమాలు ఉన్నాయి.. కానీ.. ప్రేక్షకుల కళే కరువయ్యింది. మరి ఎప్పటికి తెలుగు సినిమాకి గత వైభవం వస్తుందనేది పెద్ద ప్రశ్న

Web TitleTollywood Missed the joy of the Makar Sankranti Festival
Next Story