చిన్న వయసులోనే రాలిపోయిన తెలుగు సినీ సుమాలు...

చిన్న వయసులోనే రాలిపోయిన తెలుగు సినీ సుమాలు...
x
Highlights

ప్రతిభతో సినీవినీలాకాశాన్ని ఏలిన తారలు వారు.. తమ పేరున తెలుగు చిత్రసీమలో ఒక పేజీ నిర్మించుకున్న కృషీవలురు వారు.. అభిమాన జన సమూహ మదిలో కొలువుతీరి.. చిరుప్రాయంలోనే చరిత్రలో కలిసిపోయిన తెలుగు సినిమా ముద్దు బిడ్డలు వీరే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు. ఒక్కోరిది ఒక్కో శైలి. కథానాయికగా చెరగని ముద్ర వేసిన వారు కొందరైతే, తాము లేకపోతె సినిమాలో నవ్వు లేదనే స్థాయిలో గిలిగింతలు పెట్టిన నటీనటులు మరికొందరు. క్యారెక్టర్ ఏదైనా సరే దానిలో ఎ భావం పలికించాల్సి వచ్చినా సరే సై అంటూ తిరుగులేని నటనతో జీవించిన వారు కొందరు. వారు సినిమాల్లోకి అడుగుపెడుతూనే తమ ప్రత్యేకతలతో అలరించి మెప్పించారు. వారిలో చాలామంది తమ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశారు.

అయితే, అంత పెద్ద పేరుని మోస్తూ వారు ఇక్కడ ఉండడం దేవునికి ఇష్టం లేకో.. తనకు వినోదాన్ని పంచాల్సింది వాళ్ళే అనే భగవంతుని స్వార్ధమో వారిలో చాలా మందిని చిన్న వయసులోనే తన దగ్గరకి తీసుకుపోయాడు. అభిమానుల హృదయాల్లో ఆకాశమంత ఎత్తు ఎదిగి ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయారు వారంతా. కారణాలేవైనా కానీయండి ప్రతిభ కలవారిగా ముద్రపడిన చాల మంది తెలుగు సినీ తారలు తక్కువ వయసులోనే మరణానికి సలాం చేస్తూ వెళ్ళిపోయారు. తన నవ్వులతో తెలుగు సినిమా తెర మీద నవ్వుల పువ్వుల్ని పూయించిన వేణుమాధవ్ తన చిన్న వయసులోనే తనువు చాలించిన సందర్భంలో చిన్న వయసులోనే అభిమానుల అభిమాన ధనాన్ని సంపాదించుకుని.. అందనంతా దూరం తరలి వెళ్ళిపోయిన కొందరు తారల విశేషాలు మీకోసం..

సావిత్రి :

కేవలం కళ్ళతోనే అద్భుతమైన నటనని కనబరిచే మహానటి సావిత్రి.. పాతాళభైరవి, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్ ,గుండమ్మ కథ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఆమె కేవలం 46 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. సావిత్రి 1935లో జన్మించగా 1981లో కన్నుమూశారు.

సౌందర్య :

అందంతోనే కాదు చక్కని అభినయంతో ఆకట్టుకుంది సౌందర్య.. చాలా తక్కువ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సౌందర్య.. కానీ తన 32 ఏళ్ల వయసులోనే సౌందర్య కన్నుమూశారు. 2004లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించారమె.

ఆర్తి అగర్వాల్ ;

నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఆర్తి అగర్వాల్ .. చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి. బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఆర్తి 31 ఏళ్ల వయసులో చనిపోయింది.

ఉదయ్ కిరణ్ :

చిత్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఉదయ్ వరుస హిట్లతో స్టార్ హీరో స్టేటస్ ని చూసాడు. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గుతూ రావడంతో తన నివాసంలో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. 34 ఏళ్ల వయసులోనే ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.

శ్రీహరి :

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,హీరోగా , విలన్ గా ఇలా ఏదైనా పాత్రను చేయగలిగే నటుడుగా శ్రీహరి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శ్రీహరి 49 ఏళ్ల వయసులో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడే అనారోగ్యం పాలయ్యారు. చికిత్స పొందుతూ లీలావతి హాస్పిటల్లో కన్నుమూసాడు.

చక్రి:

తన మధురమైన సంగీతంతో శ్రోతలను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు చక్రి కూడా అతి చిన్న వయసులో మరణించాడు. ఆయన 40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.

వేణుమాధవ్ :

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు వేణుమాధవ్ .. అయన అనారోగ్య సమస్యతో ఈరోజు మరణించారు. వేణుమాధవ్ వయసు 49 ఏళ్ళు ... అయన 1969లో జన్మించి 2019లో మరణించారు. అతి చిన్న వయసులో వేణుమాధవ్ చనిపోవడంపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వీరు మాత్రమే కాదు ... దివ్యభారతి, ప్రత్యూష, అష్టచమ్మా భార్గవి, రాజబాబు, సుత్తి వీరభద్రరావు, ఐరన్ లేగ్ శాస్త్రి, యశో సాగర్, అచ్చుత్ లాంటి సినీ తారలు కూడా అతి తక్కువ వయసులో చనిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories