Thandel Review: సముద్రంలో చిక్కిన ప్రేమ తీరానికి చేరిందా.?


Thandel Review: సముద్రంలో చిక్కిన ప్రేమ తీరానికి చేరిందా.?
Thandel Review: నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తండేల్ సినిమా రూపొందించారు. నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించారు.
Thandel Review: నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తండేల్ సినిమా రూపొందించారు. నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించారు.. అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో మత్స్యకార కుటుంబంలో పుట్టిన రాజు (నాగచైతన్య) చిన్నప్పటి నుంచి తన తండ్రి బాటలో నడవాలని అనుకుంటూ ఉంటారు. తండేల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోపక్క తన పక్కింట్లోనే ఉన్న సత్య(సాయి పల్లవి) తో ప్రేమలో పడతారు. అయితే ముందు బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ సత్యలో మార్పు మొదలవుతుంది. రాజు తండేల్ అయ్యాక ఇక వేటకు వెళ్ళవద్దని కోరుతుంది. అయితే ఆమె మాటలను సీరియస్ గా తీసుకోకుండా రాజు మళ్లీ వేట కోసం గుజరాత్ వెళ్లేందుకు సిద్దమవుతారు. ఈ క్రమంలో ఇక ఇదే మన ఆఖరి కలయిక ఇక ముందు మనం కలిసి ఉండలేమని తెగేసి చెబుతుంది సత్య. అలా వేటకుగుజరాత్ వెళ్లిన రాజు అనూహ్యంగా పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కి జైల్లో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక రాజుతో ఎలాంటి సంబంధం లేదు అనుకున్న సత్య ఎలా అతడిని తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. మరి రాజు కోసం సత్య చేసిన ప్రయత్నం ఫలించిందా? రాజు సహా ఊరి వారందరినీ సత్య వెనక్కి తీసుకు రాగలిగిందా? చివరికి ఏమైంది రాజు, సత్యా కలిశారా లేదా అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా కథ చెప్పేసి థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టడం చాలా కష్టమైన విషయం. కానీ ఇలాంటి నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేసినప్పుడు అది మరింత కష్టం. అసలు కథ ఏమిటో సినిమా టీం ముందే చెప్పేసింది.కథ ముందే చెబితే అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. కానీ ఈరోజు తండేల్ బుకింగ్స్ చూస్తే ఆ అనుమానాలు అవసరం లేదని అర్థమవుతుంది. ఈ సినిమాలో పాకిస్తాన్ ఎపిసోడ్ కంటే సత్య, రాజు ప్రేమ కథతోనే సినిమా నడిపించే ప్రయత్నం చేశారు.
చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలోనే పెరిగిన రాజు, సత్య ప్రేమించుకున్నారు. అయితే పరిస్థితులు వారి ప్రేమకు ఎలా అడ్డు నిలిచాయి? సత్య, రాజుని వదిలేసుకున్న తర్వాత కూడా జైల్లో చిక్కిన క్రమంలో అతని కోసం ఎలా పోరాడింది? రాజుతో పాటు చిక్కుకున్న మరో 21 మంది జాలర్లను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి సత్య పడిన కష్టాలు ఏమిటి వంటి విషయాలను ఎంగేజింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే ఇది ముందు ఒక లవ్ స్టోరీ. ఆ తర్వాత మిగతా లేయర్స్ ని అల్లుకున్నట్టే అనిపించింది. మనం ఎంత కాదనుకున్నా ప్రేమించిన వారిని వదులుకోలేము అనే పాయింట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమికులకు మాత్రం ఒక మరుపురాని అనుభూతి ఇస్తుంది. అలాగే దేశభక్తి భావం ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా బాగా కనెక్ట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సినిమా అక్కినేని అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చినట్టు ఉంటుంది.
అయితే సగటు ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక యావరేజ్ సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిజజీవిత ఘటనలను సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఎంత చూపించినా సరే ఎందుకో పూర్తిస్థాయిలో ఒక డాక్యుమెంటరీ లాగానే తీసిన ఫీలింగ్ కలిగింది.
నటీనటుల విషయానికి వస్తే నాగచైతన్య నటన 2.0 అన్నట్టుగా సాగింది. ఇప్పుడు వరకు ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. కానీ ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ సహా ఎన్నో అంశాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. నటనలో సాయి పల్లవి, నాగ చైతన్య పోటీపడ్డారు.
ఇక కల్పలత, నరేన్, కరుణాకరన్ వంటి వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ పనితనం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. నిజానికి కొన్ని మైన్యూట్ విషయాలను చూపించిన విధానం సినీ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ వర్క్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా మత్స్యకార గ్రామంతో పాటు జైల్ సెట్, లైట్ హౌస్ సెట్స్ చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ఇప్పటికే మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నవీన్ నులి ఎడిటింగ్ చాలా బాగుంది. గీత ఆర్ట్స్ నిర్మాణం విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



