టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.... సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..!!

Superstar Krishna is no more
x

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..!!

Highlights

* దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా బహుముఖ కృషి

Telugu Film Industry: సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు. క‌ృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కృష్ణ.

కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది మూడో విషాదం. జనవరిలో కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించారు. సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు. వరుస విషాదాలతో మహేష్ బాబు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఆయనకు సినీ ప్రముఖలంతా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు.

ఘట్టమనేని కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1942 మే 31 గుంటూరు జిల్లా, తెనాలి బుర్రిపాలెంలో జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఇప్పటి వరకు 350కి పైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116తో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు.

కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబారు చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్‌ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70MM సినిమా 'సింహాసనం', తొలి R.O.W రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు'.. ఇలా ఎన్నో విభిన్న చిత్రాలతో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన కేరీర్‌లో ఉన్నాయి. 1976- 1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు చేశారు. రోజుకు మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవారు కృష్ణ. 2009లో పద్మ భూషణ్‌తో భారత ప్రభుత్వం కృష్ణను సత్కరించింది. 1989లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా ఏలూరు నుంచి ఎన్నిక అయ్యారు. అలాగే 2008లో ఆంధ్రా యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు.

కృష్ణకు రికార్డు స్థాయిలో వేలల్లో అభిమాన సంఘాలు ఉండేవి. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకున్నారు. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం , 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories