మధుర స్వరాల మహరాణి సుశీలమ్మ

మధుర స్వరాల మహరాణి సుశీలమ్మ
x
Highlights

తెలుగు సీనీ రంగంలో 50 వేలకు పైగా పాటలు పాడి అందరినీ అలరించిన సంగీత సరస్వతి పి.సుశీల. ఈ గానకోకిల జన్మించి నేటికి 84 సంవత్సరాలు. మధురమైన తన స్వరంతో...

తెలుగు సీనీ రంగంలో 50 వేలకు పైగా పాటలు పాడి అందరినీ అలరించిన సంగీత సరస్వతి పి.సుశీల. ఈ గానకోకిల జన్మించి నేటికి 84 సంవత్సరాలు. మధురమైన తన స్వరంతో ఎన్నో వేల పాటలు పాడిన సుశీలమ్మ జీవిత విశేశాల గురించి తెలుసుకుందాం.

ఆమె పాటలతో ఎంతో మంది శ్రోతల మనసును గెలుచుకుంది. గాన సరస్వతి, కన్నడ కోగిలె అనే పేర్లను బిరుదుగా తీసుకున్న సుశీలమ్మ తన గాత్ర మాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో పాటలు పాడింది. ఆమె పాడిన ఆ పాత మధురాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గానే అందరి మదిలో నిలిచిపోయాయి. " అల్లూరి సీతారామరాజు సినిమాలో వస్తాడు నా రాజు ఈ రోజు " అనే పాట ఇప్పటికీ చాలా మంది పాడుకుంటుంటారు.

సుశీలమ్మ జననం

ఇన్ని సూపర్ హిట్స్ పాటలను తన మధురమైన కంఠస్వరంతో పాడి అందరినీ అలరించిన ప్రముఖ గయకురాలు సుశీలమ్మ విజయనగరంలో ప్రముఖ క్రిమినల్ లాయరుగా పనిచేసే పి.ముకుందరావు, శేషావతారం దంపతులకు 1935 నవంబరు 13 జన్మించింది.

తొలిపాట

1950 సంత్సంరంలో ప్రముఖ సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీల పాల్గొన్నారు. ఆ పోటీలో ఆమె పాడిన పాటకు ముగ్ధులైన దర్శకుడు ఆమెను ఎంపిక చేశారు. దాంతో సుశీలమ్మ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను ఆమె మొదటిసారిగా పాడింది. ఈ పాటతో తన మధురమైన కంఠస్వరాన్ని అందరికీ వినిపించింది. దీంతో సుశీలమ్మకు ఎన్నో సినిమాలలో నేపధ్య గాయనిగా అవకాశాలు తరలివచ్చాయి.

శ్రీ లక్ష్మమ్మ కథ, పెళ్ళి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, బాలనాగమ్మ, ఇల్లరికం, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, శభాష్ రాముడు, భూకైలాస్, మాంగల్యబలం, ముందడుగు, సువర్ణ సుందరి, మాయా బజార్, లాంటి సినిమాలలో ఆ పాత మధురాలను తనదైన శైలిలో పాడింది.

అవార్డులు

ఇలా ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సుశీలమ్మను భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయని అవార్డు వరించింది. ఒకటీ రెండు సార్లు కాదు ఐదు సార్లు ఈ గౌరవాన్ని సుశీలమ్మ తన సొంతం చేసుకుంది.

1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం, 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు సినిమాలలో పాడిన పాటలకు ఈ అవార్డులను అందుకుంది. అంతే కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రఖ్యాతి గాంచిన రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో అందుకున్నారు.

2004లో 'గాన సరస్వతీ' బిరుదును కర్ణాటకలో అందుకున్నారు. 2005లో స్వరాలయ ఏసుదాస్ పురస్కారాన్ని, అదే విధంగా 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పద్మభూషణ్ పురస్కారంతో సుశీలమ్మని ప్రభుత్వం పురస్కరించింది. భారత ప్రభుత్వం అందించే పురస్కారాలు కాకుండా బంగారు నంది, రఘుపతి వెంకయ్య అవార్డును, ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు, బీ.ఎన్.రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇన్ని పాటలు పాడి అందరినీ అలరించి, శ్రోతల మనసులో నిలిచిన సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని కోరుకుందాం..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories