Top
logo

పవన్‌-రేణులపై వ్యూహాత్మక రచ్చ?

పవన్‌-రేణులపై వ్యూహాత్మక రచ్చ?పవన్‌-రేణులపై వ్యూహాత్మక రచ్చ?
Highlights

ఔను. వాళ్లిద్దరూ విడిపోయారు. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కానీ కొందరు పదేపదే వాళ్లిద్దరి గురించి రచ్చ...

ఔను. వాళ్లిద్దరూ విడిపోయారు. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కానీ కొందరు పదేపదే వాళ్లిద్దరి గురించి రచ్చ రాజేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులైతే, ఏకంగా మూడు వివాహాల అంశాన్ని, రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. వాళ్లిద్దరూ ఎవరో మీకిప్పటికే అర్థమై వుంటుంది. అవును. పవన్ కల్యాణ్-రేణూ దేశాయ్.

విడాకులతో విడివిడిగా వుంటున్నా రచ్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో గిఫ్టెడ్‌ హోమ్ అంటూ గోల. పవన్‌-రేణూ దేశాయ్‌లపై పదేపదే ఎందుకీ రచ్చ? రాజకీయాల్లోనూ ప్రత్యర్థులు ఆమెనెందుకు అస్త్రంగా సంధిస్తున్నారు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌లకు సంబంధించి, పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతున్నాయి. విడాకులు తీసుకుని, ఎవరి జీవితం వారు గడుపుతున్నా, అటు అభిమానులు, ఇటు రాజకీయంగా పవన్ ప్రత్యర్థులు మాత్రం, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తాజాగా మరో అంశం, రేణూ దేశాయ్‌ ఆగ్రహానికి కారణమైంది.

ప్రస్తుతం అనేక కార్యక్రమాలకు సంబంధించి రేణూ దేశాయ్‌ తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో వుంటున్నారట. ఆమె వుంటున్న ఇల్లు పవన్ కల్యాణ్‌ కొనిచ్చినదని, సోషల్ మీడియాలో పవన్‌ అభిమానులమని చెప్పుకుంటున్న కొందరు వైరల్ చేస్తున్నారు. నష్టపరిహారంలో భాగంగా, కోట్లాది రూపాయల విలువైన ఇంటిని పవన్‌, రేణూ దేశాయ్‌కు ఇచ్చారని చెబుతున్నారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం జరుగుతోంది. అయితే, ఇన్నాళ్లు ఓపిక పట్టిన రేణూ దేశాయ్‌, ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం తాను వుంటున్న ఇల్లు తన కష్టార్జితమని, పవన్ ఇవ్వలేదని తన ఫేస్‌బుక్‌ పేజీలో సీరియస్‌గా రియాక్టయ్యారు.

తన ఇద్దరి పిల్లలతో తన బ్రతుకేదో తాను బ్రతుకుతుంటే, సోషల్ మీడియాలో అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ఫైరయ్యారు రేణూ దేశాయ్. ఎందుకు అకారణంగా అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ''నా జీవిత మనుగడ కోసం ఎంతగానో శ్రమిస్తూ, ఒంటరి పోరాటం చేస్తున్నాను. నేనిప్పటి వరకూ నా తండ్రి నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయమూ ఆశించలేదు. అలాగే నా మాజీ భర్త నుంచి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అదీ నా వ్యక్తిత్వం! అయినప్పటికీ నా గురించి అన్యాయంగా, అసత్య వార్తలను ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసం'' అని రేణూ దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

''మీరంతా అనుకుంటున్నట్లు హైదరాబాద్‌లో నాకున్న ఫ్లాట్‌ నాకెవ్వరూ కొనివ్వలేదు. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా సొంత ఇల్లు అది. నా మాజీ భర్త కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయతీకీ, ఆత్మగౌరవానికీ భంగం కలుగుతుందనే ఆలోచన మీకెవ్వరికీ రాదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధమూ ఉండి ఉండదు. కనీసం ఈ విషయం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. ఒక వార్త నిజమో, కాదో నిర్ధారించుకోకుండానే తొందరపాటుతో ప్రచురించి ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి వార్తలను ప్రజలు నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం చెదిరిపోదా? అసత్య కథనాల వల్ల నా మనసు ఎంతగానో ఘోషిస్తోందన్నారు రేణూ దేశాయ్.

పవన్‌, రేణూ దేశాయ్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక అంశం హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ఇద్దరి ప్రమేయం లేకపోయినా, ఎవరో ఒకరు వివాదం రాజేస్తున్నారు. పవన్‌ అభిమానుల అత్యుత్సాహం, రేణూపై వ్యతిరేకతతో కొందరు కావాలనే బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పవన్‌‌ మూడు వివాహాలు, రాజకీయంగానూ, కొందరు ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. అదే పనిగా మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ, పవన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదేపదే తన మూడు వివాహాల గురించి మాట్లాడటంపై, పవన్‌ కూడా సీరియస్‌గా రియాక్టయ్యారు.

మొత్తానికి పవన్‌ వివాహాలు, రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారుతున్నాయన్న చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం సరికాదని అంటున్నా, పవన్‌ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకునే నేతలు మాత్రం, పదేపదే ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక, వ్యక్తిగత విషయాలు కూడా అవతలివారికి ఆయుధాలవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాలిటిక్స్‌లో వ్యక్తిగతం అన్నదానికి చోటే లేకుండాపోతోంది. ఇప్పుడు పవన్‌‌పై వ్యూహాత్మకంగా మూడు పెళ్లిళ్ల దాడి చేస్తున్నారని, కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మ్యారేజెస్‌ను పదేపదే ప్రస్తావించడం వలన, మహిళల్లో పవన్‌ పట్ల వ్యతిరేకత పెంచాలన్న స్ట్రాటజీ ప్రత్యర్థులదని అంటున్నారు. వ్యూహాత్మకంగానే ఎప్పటికప్పుడు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి, అటు పవన్‌ నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు, జనానికి ఎఫ్పటికప్పుడు గుర్తు చెస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలో, లేదంటే పవన్‌ అంటే ఏమాత్రం పడనివారో, అప్పుడప్పడు సోషల్ మీడియాలో రేణూ దేశాయ్‌‌‌‌‌-పవన్‌లపై ఏదోక కామెంట్ చేస్తూ, రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి.

ఇదేకాదు, ఎన్నికల టైంలో రేణూ దేశాయ్‌కు సంబంధించి ఒక పుకారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రేణూ రాజకీయాల్లోకి వస్తున్నారన్నదే ఆ పుకారు. ప్రత్యర్థి పార్టీలో ఆమె చేరుతారని, పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారన్న మాటలూ వినపడ్డాయి. పవన్‌ పర్సనల్ విషయాలన్నీ ఆమె బయటపెట్టి, జనసేనను దెబ్బతీసేందుకు, రేణూ దేశాయ్‌ను ఒక అస్త్రంగా ప్రయోగిస్తారన్న ప్రచారమూ సాగింది. కానీ ఇవన్నీ పుకార్లేనని రేణూ ఖండించారు. కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ, ఇంటికి సంబంధించిన అంశాన్ని, కొందరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండటంతో, మరోసారి వీరిద్దరిపై చర్చ మొదలైంది. చూడాలి, ఇలాంటి పుకార్లకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో.Web TitleRumors and speculation on social media regarding Pawan Kalyan and his ex-wife Renu Desai
Next Story


లైవ్ టీవి