
20 ఏళ్ల ఎదురుచూపు.. ప్రత్యూష హత్య కేసులో నేడే సుప్రీంకోర్టు తుది తీర్పు
Prathyusha Death Case : రెండు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు సమాజాన్ని కుదిపేసిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ప్రత్యూష మరణం వెనుక ఉన్న అసలు నిజాలు తేలాలని ఆమె తల్లి సరోజినీదేవి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి విధించిన శిక్షపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ క్లైమాక్స్‌కు చేరింది. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రేమ.. విషాదం.. సంచలనం
హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకోగా, సిద్ధార్థ రెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆసుపత్రిలో చేరడం సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూయగా, సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని, అత్యంత క్రూరంగా జరిగిన హత్య అని ప్రత్యూష తల్లి మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రుల కుమారుల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది.
ఏళ్ల తరబడి సాగిన న్యాయపోరాటం
ఈ కేసులో సిద్ధార్థ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సీబీఐ, ఆత్మహత్యకు ఉసిగొల్పినందుకు (సెక్షన్ 306) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2004లో హైదరాబాద్ సెషన్స్ కోర్టు అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 2011లో హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. తన కూతురిని చంపిన సిద్ధార్థ రెడ్డికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు విధించాలని ప్రత్యూష తల్లి, తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి 2012లో సుప్రీంకోర్టు మెట్లెక్కారు.
సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు
సుమారు 14 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ అప్పీళ్లపై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఇది స్పష్టంగా ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసేనని, నిందితుడికి గరిష్ఠ శిక్ష పడాలని కోరారు. మరోవైపు ఇద్దరూ కలిసి విషం తాగినప్పుడు ఒకరిని మరొకరు ఉసిగొల్పారని అనలేమని సిద్ధార్థ తరఫు లాయర్లు వాదించారు. వైద్య నివేదికలో లైంగిక దాడి జరగలేదని ఉందని వారు గుర్తుచేశారు. అయితే ప్రత్యూష తల్లి మాత్రం ఇది వ్యవస్థలే కలిసి చేసిన కుట్రగా భావిస్తున్నారు.
తీర్పు రిజర్వ్.. ఉత్కంఠలో సినీ లోకం
బుధవారం జరిగిన విచారణలో అన్ని ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం లేదా బుధవారం తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తగ్గించిన రెండేళ్ల శిక్షను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? లేక ప్రత్యూష తల్లి కోరుతున్నట్లుగా శిక్షను పెంచి నిందితుడికి గట్టి బుద్ధి చెబుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు దశాబ్దాల తర్వాత అయినా ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరేలా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




