Rajinikanth: ఎన్నిక‌ల వేళ.. తలైవా సేవ‌ల‌ను చిన్న‌బుచ్చిన అవార్డు

Rajani Kanth dadasaheb Phalke Award
x

Rajani Kanth 

Highlights

Rajinikanth: రజనీకి అవార్డు దక్కడంపై పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం వివాదంగా మారుతోంది.

Rajinikanth: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. రజనీకి అవార్డు దక్కడంపై పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డు ఇచ్చిన వేళా విశేషం మాత్రం రాజ‌కీయ దుమారాన్ని రేపుతూ ఉంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం వివాదాస్పదంగా మారుతోంది.

త‌మిళ‌నాడు శాసనసభకు ఎన్నిక‌ల మరికొద్దిరోజుల్లో ఉండగా.. ర‌జ‌నీకాంత్ కు ఈ అవార్డును ప్ర‌క‌టించ‌డం పలు విమర్శలకు తావిస్తోంది. కమలం పార్టీ త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్ అభిమానులను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఈ అవార్డును ఉప‌యోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో రజ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చీ రాన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ఓ ప్రకటన కూడా చేశారు. రజనీ ప్రకటనతో అభిమానుల్లో పూన‌కం వ‌చ్చింది. ఆరోగ్యం క్షిణించడంతో మరోసటి రోజే ర‌జ‌నీకాంత్ పాలిటిక్స్ కు నో చెప్పారు.

భార‌త‌దేశంలో సినీన‌టులు రాజ‌కీయాల్లో త‌ల దూర్చిన ద‌గ్గ‌ర నుంచి అవార్డుల విష‌యంలో జ‌నాల‌కు న‌మ్మ‌కాలు స‌న్న‌గిల్లాయి. 1988లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంజీఆర్ కి భారతరత్న ప్రకటించిదని .. కానీ అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చిందేమీ లేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో బీజేపీ వ్యవహరించిందన్న వాదన వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి అవార్డులు బిరుదులు దక్కలేదు.

కొన్ని ఏళ్లుగా సినీ అవార్డులు పూర్తిగా రాజ‌కీయ‌మ‌యం అయ్యాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వాల అవార్డుల విషయంలోనే గతంలో విమర్శలు వచ్చేవి. అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులపైనా విమర్శలు వస్తున్నాయి. అలాగే కొందరు తమిళ నటులకు కూడా జాతీయ సినిమా అవార్డులను ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ అవార్డులను ప్రకటించిందంటూ ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. రజనీకి ఇప్పుడు దాదా ఫాల్కే అవార్డు ప్రకటించడం వెనుక ఓ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది.

రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే..అల్లుడు ధనుష్ కి జాతీయ ఉత్తమ నటుని పురస్కారం.. రాజు సుందరానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు. అలాగే విజయ్ సేతుపతి.. పార్తీబన్.. రసూల్ కుట్టి.. డీ.ఇమామ్.. నాగ విశాల్ ఇలా తమిళనాడుకు చెందిన ఎందరో కళాకారులకు కేంద్రం ఇటీవలే జాతీయ పురస్కారాలను ప్రకటించింది. అలాగే ఇప్పుడు సూపర్ స్ఠార్ రజనీకాంత్ కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

రజనీకాంత్ కు ఈ పురస్కారం లభిచడం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రజనీ వ్యక్తిత్వం.. నడక, నడత ఎంతో గొప్పవంటి ప్రధాని ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డులలో తమిళనాడుకు చెందిన వారికి ప్రాముఖ్యతను కల్పించడంపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ అవార్డులను ప్రకటించిందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ త‌రుణంలో ఎన్నిక‌ల వేళ ర‌జ‌నీకాంత్ త‌న అభిమానుల‌కు ఓటు విష‌యంలో ఏం పిలుపులు ఇస్తారో, పురస్కారం అడ్డుపెట్టుకొని బీజేపీ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ కు గ‌ట్టిగానే గేలం వేసింది.

కేవలం తమిళనాడునే కాక కేరళను కూడా దృష్టిలో పెట్టుకుని పురస్కారాలు ప్రకటించారన్న అపవాదులను కేంద్రం మూటగట్టుకుంటోంది. ఇంకా విడుదల కాని ఓ సినిమాకు పురస్కారాన్ని ప్రకటించి కేరళలో విమర్శలను ఎదుర్కొంటోంది. మోహన్ లాల్ నటించిన మరక్కార్‌ అనే సినిమాకు జాతీయ అవార్డ్ ప్రకటించడం పై అక్కడ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రజనీ గానీ మోహన్ లాల్ గానీ గొప్ప నటులే .. ఇంతకు ముందు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న వారే. ఇప్పుడు ప్రకటించిన పురస్కారాలకు వారు నూటికి నూరు పాళ్ళు అర్హులే కానీ.. ఎన్నికల సమయంలో ప్రకటించడమే వివాదంగా మారుతోంది. విమర్శలను రాజేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories