సాదా సీదా NGK

సాదా సీదా NGK
x
Highlights

సూర్య కు నటుడిగా దక్షిణాదిలో మంచి పేరుంది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. వీరి ముగ్గురి...

సూర్య కు నటుడిగా దక్షిణాదిలో మంచి పేరుంది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ అనగానే, తప్పనిసరిగా ఓ మంచి సినిమా అని అనిపించక మానదు. ఇక దర్శకుడు సెల్వరాఘవన్ 7జీ బృందావన కాలనీ, ఆడవారికి అర్ధాలే వేరులే సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. వీరందరి కలయికలో NGK సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి. దానికి తోడు సినిమా తీజర్లు, ట్రైలర్లు సినిమా పై ఎంతో హైప్ ను సృష్టించాయి.

ఇప్పుడు NGK మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరి అంచనాలు అందుకుందా, లేదా? సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.

సినిమా కథ ఇలా ఉంది..

NGK అంటే నంద గోపాల కృష్ణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వ్యవసాయం అంటే వల్లమాలిన అభిమానం. దాంతో ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరికి వచ్చేస్తాడు. అక్కడ భార్య (సాయిపల్లవి) తో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అదేవిధంగా ప్రజలను చైతన్య పరిచే దిశలో కృషి చేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఈ NGK గ్రామ రాజకీయాల్లో ప్రవేశిస్తాడు. ఈ కమంలో అధికార పార్టీ పీఆర్వో వనిత (రకుల్) తో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా గ్రామ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి ఎదుగుతాడు. ఈ ఎదుగుదలను చూడలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కడతాయి. ఇక సినిమా అంతా రాజకీయ జీవితంలో ఎత్తులు పై ఎత్తులతో సాగుతుంది. ఇందులో ఎలా పై చేయి సాధించాడు.. విజయం ఎలా సంపాదించాడు అన్నది మిగతా కథ.

ఎమోషనల్ గా చెప్పాల్సిన విషయాన్ని సాదాసీదాగా చెప్పడం తోనే సినిమా గతి తప్పింది. మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి పల్లెకు రావాలనుకుని ఒక యువకుడు ఎందుకు బలంగా కోరుకున్నాడు అనే పాయింట్ ని సింపుల్ గా చెప్పేయడంతో సినిమా మీద ఇంట్రస్ట్ తగ్గించేస్తుంది. భావోద్వేగాలు పందిచాల్సిన కథలో సదా సీదా సన్నివేశాలతో సినిమాని చుట్టేయడం పెద్ద మైనస్ పాయింట్. రాజకీయాల్లో కి కథానాయకుడు ప్రవేశించడం మొదలుకుని ఎమ్మెల్యే వద్ద చేసే పనుల వరకూ చాలా పేలవంగా ఉన్నాయి. మొదటి భాగం సోసోగా నడుస్తూ.. ఓ ఎమోషనల్ పాయింట్ తో ఇంటర్వెల్ కి వస్తుంది. ఇక రెండో భాగంలో కథ, కథనం రకరకాల ఊగిసలాటకు గురై.. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. ఇక హీరోయిన్ లలో సాయిపల్లవి పాత్రకు కొంత ఎమోషన్స్ ఉండడంతో కొద్దిగా బావుంటుంది. సినిమా ఏ దశలోనూ ప్రేక్షకుడ్ని తనలో లీనమయ్యే అవకాశం ఇవ్వలేదు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అంటే బలమైన సీన్లు, ఎమోషనల్ కంటెంట్‌ను ఉంటాయనే భావించిన వారికి నిరాశే మిగులుతుంది.

ఎవరెలా చేశారంటే..

కథ.. కథనాలు బాగోని సినిమాలో ఎవరెలా చేశారన్న చర్చ అనవసరమే. అయినా, చెప్పుకోవాలి కాబట్టి.. ఇది సూర్యకు తగ్గ పాత్ర.. సినిమా కాదు. సూర్య పాత్రలో క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. NGK మూవీలో కొంతలో కొంతగా చెప్పుకోవాలంటే సాయిపల్లవి పాత్ర కొంత బెటర్‌గా ఉంటుంది. తొలి భాగంలో గృహిణిగా భర్త ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకొనే పాత్రలో బాగా రాణించారు. ఇక రెండో భాగంలో తాను కాకుండా తన భర్త జీవితంలో మరో మహిళ ఉన్నారనే అంశాన్ని తట్టుకోలేని భార్యగా తన పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. తనకు లభించిన నాలుగు సీన్లతో తన ప్రతిభను పూర్తిగా రుచిచూపించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో పెద్దగా రకుల్ గురించి చెప్పుకోవడానికి స్కోప్ ఉండదు. ప్రథమార్థంలో కొన్ని సీన్లు, రెండో భాగంలో మరో రెండు, మూడు సీన్లకు పరిమితమైన పాత్ర. చివర్లో నామమాత్రంగా తెరపైన కనిపించింది. మిగిలిన పాత్రల్లో దేవరాజ్, నిళగల్ రవి, ఇలవరసు తదితరులు నటించారు. ఇవన్నీ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సినిమాకు సంబంధించిన వరకు కొంతలో కొంత సినిమాటోగ్రఫి బాగుంటుంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు శివకుమార్. నిర్మాణ విలువలు ఫర్యాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.

చివరగా.. కథలో బలం లేకుండా కథనంలో పస లేకుండా వండి వార్చిన వంటకం ఈ సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories