Love Story Movie Review: "లవ్ స్టోరీ" సినిమా రివ్యూ

Naga Chaitanya and Sai Pallavi Love Story Movie Review | Telugu Movie Review Today
x

లవ్ స్టోరీ మూవీ రివ్యూ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* చీకటి కోణాలని బయటకు తెచ్చే ధైర్యం చేసినందుకు చిత్ర బృందాన్ని అభినందించాల్సిందే

Love Story Movie Review: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మొట్టమొదటిసారిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టోరీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు రేకెత్తించింది. ట్రైలర్ మరియు పాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఒక మనసుకి హత్తుకునే ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"ప్రేమమ్" తరువాత నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇక ఈ సినిమా ఇవాళ అనగా సెప్టెంబర్ 24, 2021 థియేటర్లలో విడుదలైంది. మరి ఈ "లవ్ స్టోరీ" చై మరియు సాయి పల్లవి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించారో చూసేద్దామా.

చిత్రం: లవ్ స్టొరీ

నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, దేవయాని, రాజీవ్ కనకాల తదితరులు

సంగీతం: పవన్ సిహెచ్

సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్

నిర్మాత: నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్

దర్శకత్వం: శేఖర్ కమ్ముల

బ్యానర్: అమిగో క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్

విడుదల తేదీ: 24/09/2021

కథ:

రేవంత్ (నాగ చైతన్య) మరియు మౌనిక (సాయి పల్లవి) నిజామాబాద్ లోని ఆర్మూర్ నుంచి తమ కలలను నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ కి వస్తారు. మౌనిక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే తన డాన్స్ చాలా బాగా నచ్చిన రేవంత్ ఆమెకి జుంబా డాన్స్ అకాడమీ లో డాన్స్ ట్రైనర్ గా ఉద్యోగం ఇస్తాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. రేవంత్ ఒక దళిత వర్గానికి చెందిన క్రిస్టియన్.

మరోవైపు మౌనిక ఒక పటేల్. ఇద్దరు వేరే వేరే కులాలు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ససేమిరా ఒప్పుకోలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. చివరికి ఏమైంది? వారిద్దరూ తమ కలలు నెరవేర్చుకున్నారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

రేవంత్ పాత్రలో నాగచైతన్య చాలా బాగా నటించారు. సినిమా మొత్తాన్ని తన నటన తో ముందుకు తీసుకు వెళ్లారు. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో డాన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించారు నాగచైతన్య. సాయి పల్లవి ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు.

ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో సాయిపల్లవి చాలా బాగా నటించింది. ఈశ్వరి రావు మరియు దేవయాని తమ తల్లి పాత్రలలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. రాజీవ్ కనకాల కూడా ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారు. ఉత్తేజ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ తన నటనతో ఆ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

సాంకేతికవర్గం:

దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఒక కాంప్లెక్స్ కథని ఎంచుకున్నప్పటికి దానిని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో 2 సామాజిక సమస్యలను చూపించారు. కులాలు అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల బోల్డ్ వే లో చాలా బాగా హ్యాండిల్ చేశారు.

పవన్ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ఏవేవో కలలే, విన్నర్ విన్నర్ బ్రో, పాటలు చాలా బాగున్నాయి. ఇక నీ చిత్రం చూసి, సారంగదరియా పాటలు ఇప్పటికే హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ కూడా సినిమా కి చాలా బాగా ప్లస్ అయ్యాయి.

బలాలు:

  • నాగచైతన్య సాయి పల్లవి ల అద్భుతమైన నటన
  • పాటలు
  • శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ డైలాగులు
  • ఎంటర్టైన్మెంట్

బలహీనతలు:

  • కొన్ని స్లో సన్నివేశాలు
  • సినిమాలో చూపించిన చీకటి కోణాలు

చివరి మాట:

అయితే ఈ సినిమా అనుకున్న విధంగా ఒక రొటీన్ ప్రేమ కథ అయితే మాత్రం కాదు. సమాజంలో ఉన్న కొన్ని చీకటి కోణాలను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ఈ సినిమా. మొదటి హాఫ్ మొత్తం సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ నుంచి కథ మొత్తం మారిపోతుంది. హీరోయిన్ పాత్ర మనసుకి హత్తుకునేలా ఉంటుంది. కానీ కమర్షియల్ ఆడియన్స్ కి ఈ సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశం ఉంది.

ఇలాంటి చీకటి కోణాలని బయటకు తెచ్చే ధైర్యం చేసినందుకు చిత్ర బృందాన్ని అభినందించాల్సిందే. సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల తన వంతుగా చాలా బాగా నెరేట్ చేశారు. సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా పండాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు.

బటన్ లైన్:

చీకటి కోణాలని వెలుగులోకి తెచ్చిన "లవ్ స్టోరీ"

Show Full Article
Print Article
Next Story
More Stories