Kartik Aaryan: బాడీ ఫ్యాట్‌ను 7 శాతానికి తగ్గించుకున్న బాలీవుడ్ హీరో.. మరీ పడిపోతే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందా?

Kartik Aaryan Body Fat Drops From 39 Percent  to 7 Percent
x

Kartik Aaryan: బాడీ ఫ్యాట్‌ను 7 శాతానికి తగ్గించుకున్న బాలీవుడ్ హీరో.. మరీ పడిపోతే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందా?

Highlights

Kartik Aaryan: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా ‘చందు ఛాంపియన్’కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

Kartik Aaryan: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా ‘‘చందు ఛాంపియన్’’ కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. దీనిలో కార్తీక్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తున్నారు. పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అథ్లెట్‌లా కనిపించేందుకు కార్తీక్ చాలా కసరత్తులు చేశారు.

తన బాడీ ఫ్యాట్‌ను కార్తీక్ 37 శాతం నుంచి 7 శాతానికి తగ్గించుకున్నారు. దీని కోసం ఆయన ఏడాదిన్నర కష్టపడ్డారని, స్టెరాయిడ్లు కూడా ఏమీ తీసుకోలేదని సినిమా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. అయితే, అసలు బాడీ ఫ్యాట్ అంటే ఏమిటి, దాన్ని తగ్గించుకుంటే ఏం అవుతుంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ బాడీ ఫ్యాట్?

బాడీ ఫ్యాట్‌నే ‘అడిపోస్ టిష్యూ’ అని కూడా పిలుస్తారు. మన శరీరంలో దీనికి చాలా ముఖ్యమైన విధులు ఉన్నాయి. మన శరీరం ఎనర్జీని వీటిలో నిల్వ చేసుకుంటంది. శరీరానికి అవసరమైనప్పుడు దీని నుంచి ఆ ఎనర్జీని తీసుకుంటుంది. ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చినప్పుడు మన శరీరాన్ని ఇది రక్షిస్తుంది. అంతేకాదు, అంతర్గత అవయవాలనూ ఇది కాపాడుతుంది. హార్మోన్లను నియంత్రించడంలోనూ బాడీ ఫ్యాట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎండోక్రైన్ వ్యవస్థనూ ఇది నియంత్రిస్తుంది.

రెండు రకాలు..

బాడీ ఫ్యాట్‌లో రెండు రకాలు ఉంటాయి. వీటిలో మొదటిది ఎసంట్షియల్ ఫ్యాట్, రెండోది స్టోరేజీ ఫ్యాట్. శరీరం రోజువారీ పనితీరులో ఎసంట్షియల్ ఫ్యాట్ చాలా ముఖ్యమైనది. ఇది బోన్ మ్యారో, ఇతర అవయవవాలు, నాడీ వ్యవస్థలో కనిపిస్తుంది. పురుషుల్లో ఈ ఫ్యాట్ మొత్తం శరీర బరువులో 3 శాతానికిపైగా ఉంటుంది. మహిళల్లో ఇది 12 శాతం వరకూ ఉంటుంది. ప్రత్యుత్పత్తి అవసరాల కోసమే మహిళల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టోరేజీ ఫ్యాట్ మాత్రం అడిపోస్ కణజాలంలో పేరుకుంటుంది. ఇది చర్మం కింద లేదా అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుంటుంది.

ఫ్యాట్ ఎంత వరకూ ఉండొచ్చు?

శరీరంలో బాడీ ఫ్యాట్ అనేది వయసు, జెండర్, ఫిట్‌నెస్ స్థాయిల బట్టీ ఆధారపడి ఉంటుంది. పురుషుల్లో అయితే, సాధారణంగా ఇది 8 నుంచి 19 శాతం వరకూ ఉండొచ్చు. అదే మహిళల్లో అయితే, 21 నుంచి 33 శాతం వరకూ ఉండొచ్చు. అయితే, అథ్లెట్లలో ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది. పురుష అథ్లెట్లలో అయితే, 6 నుంచి 13 శాతం, మహిళా అథ్లెట్లలో అయితే, 14 నుంచి 20 శాతం మధ్య ఉంటుంది. ముఖ్యంగా ఎసంట్షియల్ బాడీ ఫ్యాట్ పురుషుల్లో 3 నుంచి 5 శాతం, మహిళల్లో 10 నుంచి 13 శాతం వరకూ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.

ఫ్యాట్ తగ్గించుకుంటే ఏం జరుగుతుంది?

బాడీ ఫ్యాట్‌ను కొంతవరకు తగ్గించుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఫ్యాట్ స్థాయిలు తగ్గడంతో గుండె, రక్త నాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మొత్తంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఫ్యాట్ తగ్గించుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగామన శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలను మెరుగ్గా నియంత్రించుకోవచ్చు. దీంతో టైప్-2 మధుమేహం ముప్పు కూడా తగ్గుతుంది.

ఫ్యాట్ తగ్గితే శరీరం బరువు కూడా తగ్గుతుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కీళ్లపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కీళ్ల వ్యాధులు వస్తుంటాయి. అదే ఫ్యాట్ తగ్గితే కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఫ్యాట్ ఒక మోస్తరు వరకు తగ్గితే మానసిక ఆరోగ్యం కూడా మెరుగపడుతుంది.

పూర్తిగా పడిపోతే..

బాడీ ఫ్యాట్ 5 శాతానికి మించి తగ్గిపోతే కొంచెం అప్రమత్తం కావాల్సి ఉంటుందని దిల్లీలోని లంగ్ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణుడు డాక్టర్ సాయిబాబా నాయుడు చెప్పారు. ‘‘అథ్లెట్లైనా 5 శాతానికి మించి ఫ్యాట్ తగ్గిపోతే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇది అనారోగ్యానికి సూచిక’’ అని ఆయన చెప్పారు.

‘‘బాగా ఫ్యాట్ పడిపోతే, గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. మన ఎనర్జీ స్థాయిలు కూడా పడిపోతుంటాయి. అంటే మనం సాధారణంగా పనిచేయడం కూడా కష్టం అవుతుంది’’ అని ఆయన తెలిపారు.

చలి కాస్త ఎక్కువగా ఉన్నట్లు కూడా అనిపిస్తుందని ఆయన చెప్పారు. ‘‘చలి నుంచి ఈ ఫ్యాట్ మనకు రక్షణ కల్పిస్తుంది. ఫ్యాట్ లేనప్పుడు చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని ఆయన వివరించారు. థైరాయిడ్ సమస్యలు కూడా రావచ్చని ఆయన చెప్పారు.

ఆకలి కూడా ఎక్కువైనట్లు అనిపిస్తుందని ఆయన తెలిపారు. ‘‘అంతేకాదు, మీ కండరాలు కూడా బలహీనమైనట్లు అనిపిస్తాయి. దీనికి టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా తగ్గిపోవడమే కారణం’’ అని ఆయన అన్నారు.

బాడీ ఫ్యాట్ బాగా పడిపోతే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయే ప్రమాదముందని ఆయన చెప్పారు. ‘‘ఎందుకంటే అసలు మనుగడకే కష్టమయ్యేటప్పుడు ప్రత్యుత్పత్తి గురించి శరీరం ఆలోచించదు’’ అని ఆయన వివరించారు.

‘‘ఎక్కువగా జబ్బు పడటం, ఎముకలు బలహీనపడటం ఇలా చాలా సమస్యలు రావచ్చు. అందుకే ఫ్యాట్ స్థాయిలు తగినంత ఉండేలా చూసుకోవాలి. సెలబ్రిటీలను చూసి మనం కూడా ఫ్యాట్ తగ్గించుకోవాలని ప్రయత్నించకూడదు. వారికి చాలా మంది నిపుణులు అందుబాటులో ఉంటారు. మనకు అన్ని సదుపాయాలు ఉండవనే సంగతి మనం గుర్తుంచుకోవాలి’’ అని ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories