JINN Telugu Movie Review: జిన్ మూవీ రివ్యూ... నవ్విస్తూనే భయపెట్టే హారర్–కామెడీ థ్రిల్లర్

JINN Telugu Movie Review
x

JINN Telugu Movie Review: జిన్ మూవీ రివ్యూ... నవ్విస్తూనే భయపెట్టే హారర్–కామెడీ థ్రిల్లర్

Highlights

JINN Telugu Movie Review: హారర్‌తో పాటు హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘జిన్’ ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తుంది. నవ్విస్తూనే భయపెట్టడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

JINN Telugu Movie Review: సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన తాజా చిత్రం ‘జిన్’ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

ఓ కాలేజీ భవనం, అందులోని లైబ్రరీలో ఓ యువకుడికి ఎదురయ్యే వింత అనుభవాలతో కథ ప్రారంభమవుతుంది. రాత్రి వేళ ఒంటరిగా ఉన్న అతడికి అనూహ్య ఘటనలు ఎదురవుతాయి. ఇదే సమయంలో నలుగురు యువకులు పరీక్ష రాయడానికి భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజ్‌కి చేరుకుంటారు. అక్కడ వారికి ఎదురైన భయానక సంఘటనలు ఏమిటి? ఆ భవనంలో వారు ఎలా చిక్కుకుపోతారు? చివరకు బయటపడతారా? జిన్ పాత్ర ఇందులో ఏం చేస్తుంది? సమస్యను పరిష్కరించేందుకు వచ్చే వ్యక్తి ఎవరు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ మొత్తం నలుగురు యువకుల అల్లరి, కాలేజ్‌కి చేరుకోవడం వంటి సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ వరకు కథ భయానక మలుపు తీసుకుని ఆసక్తిని రేకెత్తిస్తుంది. నవ్వులు, భయాలను సమతూకంగా చూపడంలో దర్శకుడు చిన్మయ్ రామ్ ఫస్ట్ హాఫ్ వరకు విజయవంతమయ్యారు.

సెకండాఫ్‌లో జిన్ ఎంట్రీ, పోలీస్ దర్యాప్తు, కాలేజీ భవనం వెనుక ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రీ–క్లైమాక్స్ వరకు కథ పట్టు సడలకుండా సాగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు సెకండ్ పార్ట్‌కు సూచన ఇచ్చేలా ముగింపు ఉండటం విశేషం.

నటీనటులు:

అమ్మిత్ రావ్ తన నటనతో ప్రత్యేకంగా మెప్పించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ, కంటి చూపుతో చేసిన నటన ఆకట్టుకుంటుంది. పర్వేజ్ సింబా కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త ముఖాలైనా, వారి పర్ఫామెన్స్‌తో గుర్తుండిపోతారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్, పోలీస్ పాత్రలు కూడా తమ పరిధిలో మెప్పించాయి.

సాంకేతిక అంశాలు:

సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలాలు. హారర్, మిస్టరీ థ్రిల్లర్ వాతావరణాన్ని టెక్నికల్‌గా బాగా ఎలివేట్ చేశారు. లొకేషన్లు, సెట్లపై నిర్మాత నిఖిల్ ఖర్చు పెట్టిన తీరు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

మొత్తంగా:

హారర్‌తో పాటు హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘జిన్’ ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తుంది. నవ్విస్తూనే భయపెట్టడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

రేటింగ్: (3/5)

Show Full Article
Print Article
Next Story
More Stories