
Upcoming Movies: ఇటీవల కాలంలో పార్ట్2 చిత్రాల హంగామా రెట్టింపయింది. శుభం కార్డు వేసేముందు కొనసాగింపు ఉందన్న హింట్ ఇచ్చి రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నారు.
Upcoming Movies: ఇటీవల కాలంలో పార్ట్2 చిత్రాల హంగామా రెట్టింపయింది. శుభం కార్డు వేసేముందు కొనసాగింపు ఉందన్న హింట్ ఇచ్చి రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు కొనసాగింపు కథలంటే సీక్వెల్ చిత్రాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ప్రీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. తొలి భాగంలో చెప్పిన కథకు ముందు జరిగిన కథను చూపించడమే ఈ ప్రీక్వెల్ చిత్రాల లక్ష్యం. ఇప్పుడిలా కథలో ముందుకు తీసుకెళ్లి సినీ ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నారు.
మంచి కథలున్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కథలో కొత్తదనం తెలిసేలా చేసే ప్రయత్నాలతో వచ్చే సినిమాలను అభినందిస్తుంటారు. ఆదరణ పొందిన కథను అనేక పార్టులుగా తీయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పాత కథకే కొత్తరూపాన్ని జోడించి పాత, కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాలే ప్రీక్వెల్స్, సీక్వెల్స్. గతంలో ఉన్న కథకు ముందురూపమే ప్రీక్వెల్. దానికి కొనసాగింపుగా ఒకటి, రెండు, మూడు అంటూ ఇలా తీసే చిత్రాలే సీక్వెల్స్.
ఒక సినిమా ఎక్కడ మొదలైందో అంతకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్స్‌గా తెరకెక్కించేందుకు కొందరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. వీటిలో కొన్ని ఇప్పటికే సెట్స్‌పైకి రాగా.. మరికొన్ని త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి.
మలయాళ హీరో మోహన్ లాల్ సినిమా లూసిఫర్ విజయవంతమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేసి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఎల్2:ఎంపురాన్‌ను పృథ్వీరాజ్ సిద్ధం చేశారు. ఇది లూసిఫర్‌కు ప్రీక్వెల్‌గా ఉంటుంది. లూసిఫర్ క్లైమాక్స్ మోహన్ లాల్‌ను అబ్రహమ్ ఖురేషి అనే శక్తివంతమైన డాన్‌గా చూపించినప్పటికీ, ఆ పాత్ర గతమేంటి? దుబాయ్‌లో ఏం చేశాడు. డాన్‌గా ఎలా ఎదిగాడు? అన్నది చూపించలేదు. ఇప్పడు ఈ కోణంలోనే ఎల్2 కథ కొనసాగనుంది.
కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం భారతీయుడు. దీనికి కొనసాగింపుగా ఇప్పటికే భారతీయుడు2 తెరపైకి వచ్చింది. ఇప్పుడు భారతీయుడు 3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది భారతీయుడు సినిమాకు ప్రీక్వెల్‌గా ఉండనుంది. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి తండ్రి వీరశేఖరన్ సేనాపతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి? స్వాతంత్ర్య ఉద్యమంలో తను పోషించిన పాత్రేంటి? ఆ స్ఫూర్తితో సేనాపతి బ్రిటీష్ వారిపై ఎలా తిరుగుబాటు చేశారు? అన్నది మూడో భాగంలో చూపించనున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు హీరో యశ్. ఇది కేజీఎఫ్2 సినిమాకు ప్రీక్వెల్‌గా ఉండనుంది. ఈ చిత్రం రెండో భాగంలో చూపించని 1978-81 మధ్య కాలం నాటి రాకీ జీవితాన్ని తెలియజేయనున్నారు. ఇది వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. యశ్.. ఇప్పుడు టాక్సిక్, రామాయణ చిత్రాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ఈ రెండు పూర్తయిన వెంటనే కేజీఎఫ్3 కోసం మరోసారి రాకీ భాయ్‌గా మారనున్నారు.
హీరో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ చిత్రం బింబిసార. దీనికి కొనసాగింపుగా బింబిసార2 రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిల్ పాదూరి దర్శకత్వంలో సిద్దం కానున్న ఈ సినిమా బింబిసారకు ప్రీక్వెల్‌గా ఉండనుంది. తొలి భాగంలో బింబిసారుడు భవిష్యత్తులోకి వస్తే ఏం జరుగుతున్నది చూపించారు. కానీ, రెండో భాగంలో తను గతంలోకి వెళ్తే ఏమిటన్నది చూపించనున్నట్టు తెలుస్తోంది. బింబిసారకు పూర్వం నాటి త్రిగర్తల పాలనను.. దానికోసం జరిగిన యుద్దాల్ని ఇందులో ప్రధానంగా చూపించనున్నట్టు సమాచారం.
సంక్రాంతికి డాకు మహారాజ్‌తో బాలకృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ వచ్చే అవకాశముంది. డాకు మహారాజ్ సినిమాలో గుర్రంపై ఉన్న ఆ తల లేని మనిషి ఎవరు? అతని కథేంటి? అనే నేపథ్యంలో ప్రీక్వెల్ చేసే ప్రయత్నం చేస్తామని చిత్ర నిర్మాత నాగవంశీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
గతేడాది క సినిమాతో బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆ చిత్రం ముగింపులో క2 ఉంటుందని చెప్పారు. ఇది కూడా ప్రీక్వెల్‌గా ఉండనుంది. క సినిమాలో క్రిష్ణగిరి ఊరు గురించి.. ఆ ఊళ్లో అమ్మవారు.. ఆ అమ్మవారు ఆశీస్సులతో పుట్టిన ఆడపిల్లల గురించి ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి కథను క్రిష్ణగిరి ఊరు విశిష్టతను క2లో చూపించనున్నారు.
రిషబ్ శెట్టి.. కాంతార సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కాంతార కథ ఎక్కడ మొదలైందో.. దానికి ముందు జరిగిన కథను ఇందులో చూపించనున్నారు. కాదంబుల కాల నేపథ్యంలో పంజుర్లి దైవం మూలాల్ని అన్వేషిస్తూ దాని మూల కథను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది.
కార్తి, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం ఖైదీ. లోకేశ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో కూలీ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఖైదీ2 సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇది కూడా తొలి భాగానికి ముందు జరిగిన కథలోనే ముస్తాబు కానుంది. ఖైదీలో కార్తి పదేళ్లు జైల్లో ఉండి విడుదలైనట్టు చూపించారు. కానీ ఎందుకు జైలుకెళ్లాడు? భార్యను ఎలా కోల్పోయాడు? ఆది శంకరానికి తనకు ఉన్న మధ్య విరోధమేంటి? అన్నవి చూపించలేదు. ఖైదీ2లో ఈ విషయాలన్నీ చూపించనున్నారు లోకేశ్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




