'త్రివిక్రమ్' సంభాషణల బ్రాండ్.. వెండితెర మీద 'శ్రీనివాస' సంతకం చేస్తోంది!

త్రివిక్రమ్ సంభాషణల బ్రాండ్.. వెండితెర మీద శ్రీనివాస సంతకం చేస్తోంది!
x
Highlights

ఆ మాటలో పంచ్ ఉంటుంది.. ఆ డైలాగ్ లో పవర్ ఉంటుంది.. అన్నిటికీ మించి మనిషి జీవితపు లోతుల్ని తట్టి లేపే ఆర్ద్రత ఉంటుంది.. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ బలం.. అదే ప్రేక్షకులకు దగ్గర చేసింది.. అదే అభిమానులకు 'గురూజీ' అని పిలుచుకునేలా చేసింది. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు అయన ముత్యాల నుంచి ఏరినవే!

Birthday Wishes to Trivikram Srinivas : ఒక సినిమా చూస్తే అందులో ఎన్ని మాటలు మనకి సినిమా అయిపోయాకా గుర్తుంటాయి? ఒక సూపర్ హిట్ మూవీ లో ఎన్ని సంభాషణలు తరచు మనల్ని వెంటాడతాయి? ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అని ముద్ర వేసుకున్న సినిమాలో ఎన్ని సీన్లు మన మదిలో ముద్ర వేస్తాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే..సాధారణంగా సినిమా చూసిన తరువాత గంటలోనే ఆ సినిమా మన మదిలోంచి పారిపోతుంది. సూపర్ హిట్ మూవీ అయితే కనుక మహా అంటే రెండురోజులు దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఇక నచ్చని సినిమా అంటే దానిని నిమిషాల్లోనే మర్చిపోతాం. కానీ.. తెలుగు సినిమా ప్రపంచంలో ఒక్కడి మాటలకు మాత్రం మరుపు లేదు. ఒక్కడి కలం నుంచి వచ్చిన సన్నివేశాలకు జీవం ఎప్పటికీ.. ఎక్కడికీ పోదు. ఎన్నిసార్లు విన్నా.. ఎక్కడ ఏ సందర్భం అయినా. ఆయన పేర్చిన మాటల ముత్యాలు వున్న సినిమా హిట్టూ ఫట్టూతో సంబంధం లేకుండా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మాటల మేజిక్ పేరు' త్రివిక్రమ్ శ్రీనివాస్.'

త్రివిక్రమ్ ఈ పేరులోనే ఎదో తెలీని పంచ్ ఉంది అని అభిమానులు అంటారు. త్రివిక్రమ్ పేరు ఉంటె చాలు ఆ సినిమాలో హీరో తోపనిలేదు అంటారు సాధారణ ప్రేక్షకులు. అవును.. త్రివిక్రమ్ మాయాజాలానికి హీరో ఎవరైనా ఒక్కటే. ఆ మాటల చెణుకులకు నటుడెవరైనా సరే అది పేలాల్సిందే.

రచయితగా మెరిపించిన మెరుపులు.. దర్శకుడిగా కురిపించిన పంచ్ లు నిత్యం ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి.

''పెళ్లి ఎంతో అపురూపంగా ఉండే ఒక ప్రేయసిని మామూలు ఆడదాన్ని చేసేస్తుంది.. ప్రేమలో విరహం, వేదన, నిరీక్షణ ఉంది. కానీ, వివాహంలో ఇవేవీ ఉండవు.. విడాకులే!'' ఇంత పెద్ద డైలాగ్ అయినా.. ''నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది'' ఇంత చిన్న పొదుపైన మాటల్లో అయినా త్రివిక్రమ్ కలం చేసే మ్యాజిక్.. సూటిగా విషయాన్ని మనసులోకి దించేయడమే. దానికే 'పంచ్' అని పేరుపెట్టుకున్నారు ప్రేక్షకులు.

''మనిషికీ మనిషికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం 'అవసరం' మాత్రమే'' అని చెప్పినా.. ''తండ్రికీ, భవిష్యత్ కీ భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు'' అని కుండ బద్దలు కొట్టినా అది త్రివిక్రమ్ మాటల తూటా అయి తీరుతుంది.

''పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించడం ఒక లెక్కా'' ''మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం.. బలంగా కోరుకునేది భవిష్యత్'' ''మనం నమ్మగలిగేవి మాత్రమే నిజాలు.. భరించలేనివి అన్నీ అబద్ధాలు అయితే బావుండును'' '' నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలిసినపుడు..ఎలా వెళ్ళాలో చెప్పడానికి నేనెవరిని'' ఇటువంటి మాటల మతాబులు పేల్చే ఫిరంగి త్రివిక్రమ్ కలం మాత్రమే.

ఎవరైనా సినిమా సినిమాకి ఆరితేరతారు.. లేదా మొదటి సినిమాలో చూపించిన వేడి తగ్గి ఆరిపోతారు..కానీ, మాటల రచయితగా మొదటి సినిమా స్వయంవరం లో ఎలాంటి మాటలు రాశారో.. ఇటీవల వచ్చిన ఆలా వైకుంఠపురములో సినిమాలోనూ అదే మాటల మంత్రం వేశారు. నిజానికి దర్శకుడు అవుదామని భీమవరం నుంచి వచ్చిన ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ.. అనుకోకుండా మాటల రచయితగా మారిపోయారు. అయితే, తరువాత ఆయన తన కిష్టమైన దర్శకత్వ శాఖలోకి కూడా వచ్చి చేరారు. త్రివిక్రమ్ సినిమాలకు ఆయన మాటలు బలమా.. స్క్రీన్ ప్లే బలమా అనేది ప్రేక్షకులు ఇప్పటికీ తేల్చుకోలేరు అంటే అతి శయోక్తి కాదు.

అప్పటివరకూ సినిమా మాటలు వేరే రకంగా ఉండేవి.. కానీ త్రివిక్రమ్ దానిని మార్చేశారు. జీవితంలో మనం మాట్లాడుకునే మాటలే వెండి తెర మీద హీరో మాట్లాడితే.. ఎలా ఉంటుందో తెలుగు సినీ ప్రేక్షకులకు రుచి చూపించారు. ఇంకేముంది. ఇప్పుడు అంతా అదే స్టైల్.

అతడు సినిమాలో తనికెళ్ళ భరణి అంటారు..''ఎవడైనా కోపంగా కొడతాడు.. లేదంటే బలంగా కొడతాడు.. వీడేంట్రా చాలా శ్రద్ధగా.. ఒక గోడ కడుతున్నట్టు..గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు.. చాలా పద్ధతిగా.. జాగ్రత్తగా కొట్టాడు.. ఆడు మగాడురా బుజ్జీ..!'' అని.

అదే మాటలు త్రివిక్రమ్ గురించి చెప్పుకోవాలి అంటే ''ఎవరైనా పెన్ను తో రాస్తారు.. తన మనసులో ఏముందో చెబుతారు.. ఈయనేంటండీ బాబూ..మనుషుల మనసులలోకి.. కథలోని పాత్రల మెదడులోకి దూరిపోయి రాస్తారు. ఆయన సూపర్ అండీ బాబూ!'' అని అనుకోవాలి.

అతడు అంటే గుర్తొచ్చింది. ఎన్ని సార్లు.. ఎన్ని రకాలుగా విరిచేసి.. తుంచేసి..పంచేసి చూపించినా సరే త్రివిక్రమ్ సినిమా టీవీ లో వస్తే చాలు దానిని తెలుగు ప్రేక్షకులు వదిలి పెట్టరు. అదీకాకుండా త్రివిక్రమ్ సినిమాల్లోని ఇమేజి లేకుండా ఒక్క మీమ్ కూడా పుట్టదు. ఎవరినైనా వ్యంగ్యంగా ట్రోల్ చేయాలంటే కచ్చితంగా త్రివిక్రమ్ సినిమాలోని పాత్రలను వాడుకోవాల్సిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తరానికి ఓ అద్భుతం .. ఈ తరానికి ఓ సుందర స్వప్నం.. మధుర సంభాషణలు.. మృదు సంభాషణలు.. ఇలా సంభాషణలకు ఎప్పటినుంచో కొన్ని పేర్లు ఆయా సందర్భాలను బట్టి వాడుతుంటారు. కానీ, త్రివిక్రమ్ సంభాషణ అనేది ఒక బ్రాండ్ గా తెలుగు తెర మీద శ్రీనివాస సంతకం చేస్తోంది..

ఈరోజు (నవంబర్ 7) త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతోంది హెచ్ఎంటీవీ.

Show Full Article
Print Article
Next Story
More Stories