Top
logo

భారత చలన చిత్ర గాయనీ మహారాణి లతా మంగేష్కర్

భారత చలన చిత్ర గాయనీ మహారాణి లతా మంగేష్కర్
X
Highlights

ఆమె గానానికి అన్ని పురస్కారాలు వరించి ముంగిట నిలిచాయి. ఆమె గాత్రానికి గిన్నిస్ బుక్ రికార్డు తలవంచింది. ఏడు దశాబ్దాలకు పైగా భారత సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలకు.. చిత్ర సీమలోని వంచనలను తట్టుకుని నిల్చిన ధీరత్వానికి యావత్ భారతమూ ఆమెను హృదయాల్లో ప్రతిష్టించుకుంది. ఆమె.. గాన కోకిల లతా మంగేష్కర్.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా జేజేలు చెబుతూ.. మీకోసం..

తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో.. ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తరానికి అసలు తెలిసే అవకాశం ఉండదు. మొదటి పాట 1955 వ సంవత్సరంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో సంతానం అనే సినిమాకు 'నిదుర పోరా తమ్ముడా.. అంటూ పాడారు. ఆ పాట చాలాకాలం టాప్ తెలుగు పాటగా నిలిచింది. ఇప్పటికీ ఆపాటను వింటే ఆ గాత్రంలోని మాధుర్యానికి మనకీ హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఇక రెండో పాట దొరికితే దొంగలు అనే సినిమా లో శ్రీ వేంకటేశా ఈశా అనే పాట.. ఇది ఇప్పటికీ భక్తీ పాటల్లో.. ముఖ్యంగా వేంకటేశ్వరుని పాటల్లో టాప్ లోనే వినిపిస్తుంది. ఇంత చెప్పిన తరువాత ఆ గాయని ఎవరో మీకు తెలిసి ఉండాలే.. సరే మేమే చెబుతాము. ఆమె గానకోకిల లతామంగేష్కర్. భారత సినీ గాయనులలో ఆమె తరువాతే ఎవరైనా.. ఆమె ముందూ ఎవరూ లేరు. ఎందుకంటే ఆ గొంతు పలికింది వేలాది పాటలు.. ఆ మహాగాయని గొంతు సవరించుకుంటే కోకిల కూడా మౌనాన్ని ఆశ్రయించి తదేకంగా ఆమె పాటనే వింటుంది. దశాబ్దాలుగా ఆమె పాడుతూనే ఉన్నారు. తరాలు మారాయి.. అభిరుచులు మారాయి.. కానీ లతా గొంతులో తీయదనం మారలేదు. ఆమె పాటల్ని అభిమానించే వారి అభిమానమూ తరగలేదు.

అవార్డుల రాణి!

- భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ప్రముఖ శాస్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.

- దాదా సాహెబ్ ఫాల్కే (1989), మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997), ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999), శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, రాజాలక్ష్మీ అవార్డు (1990), ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009), అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్ సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు

- సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు లే కాకుండా.. పద్మభూషణ్, పద్మ విభూషణ్, ఇక అత్యున్నత పురస్కారం భారతరత్న ఆమెను వరించి మురిసిపోయాయి. అవార్డులతో కొలవలేని సంపద లతా మంగేష్కర్ గానం. ఆమె పాట కోసమే పుట్టారు. పాట కోసమే జీవిస్తున్నారు. ఇంతకూ మించి ఆమె గురించి చెప్పుకోవడానికి పదాలూ దొరకవు.

- ఎప్పుడో 1942 లో సవరించుకున్న ఆమె గొంతు ఇప్పటికీ అదే తాజాతనంతో ఉంది. ఆమె ఈ మధ్య సినిమాలకు పాటలు పాడకపోయినా అప్పుడప్పుడు భజన గీతాలు పాడి ఆధ్యాత్మిక పరిమళాలని పాటల రూపంలో ప్రపంచానికి పంచుతూనే ఉన్నారు.

- ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి.. లతా తన కెరీర్లో ఎన్నో పాటలు పడినా, సంగీత దర్శకురాలిగా కేవలం నాలుగు సినిమాలకే వ్యవహరించారు. 1963-మరాఠా టితుక మెల్వవా, 1963-మోహిత్యంచి మంజుల, 1965-సాధి మనసే, 1969-తుంబడి మత ఇవన్నే మరాఠీ సినిమాలే. అయితే, వీటిలో ఒక సినిమాకి సాధి మనసే గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా ఈ ఘనత ఒక్క లతా కి మాత్రమె దక్కింది.

ఒక గ్రంధం కూడా సరిపోని ఆణిముత్యాలు ఆమె పాటలు!

- 1942 నుంచి 2011 వరకూ అంటే ఏడు దశాబ్దాలకు పైగానే ఆమె పాటల మాధుర్యాన్ని పంచుతూనే వచ్చారు. వీటిలో ఆమె పాటల గురించి రాయాలంటే ఒక గ్రంధం కూడా సరిపోదంటే అతిశయోక్తి కాదు. ఆమె పాడిన పాటల్లో కొన్ని పాటలు ఉదాహరించగలం అంతే..

- ఆమె కెరీర్ ఒక వైఫల్యంతో మొదలైంది అంటే నమ్మగలరా.. నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ (1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్ (1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచీ నవలాయీ పాట కూడా పాడారు ఈ సినిమాలో. మరాఠీ సినిమా గజబాహు (1943) లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాటగా నిలిచింది.

- సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించిన తరువాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లత. ఆమె జీవితంలో భారత స్వాతంత్ర్యం.. దేశ విభజన అన్నీ కీలక పాత్రలు పోషించాయి. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు ఆమె కూడా ముంబాయి మకాం మార్చారు. ఆమె తొలి గురువు ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ దేశ విభజనతో పాకిస్తాన్ వెళ్ళిపోయారు. తరువాత ఆమె అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు అటు తరువాత అయన శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా సంగీత సాధన చేశారామె. ఈ నిబద్ధతే.. ఆమెను సినిమా స్వరాలకు మహారాణిని చేసింది.

-మొఘల్-ఎ-అజమ్ (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట.

- 1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3నెలలూ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ ఆమెను కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతీరోజూ సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతీ వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాకా ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తరువాత ఆ వంటవాడు చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలో పనిచేశాడట.

- 1963 జనవరి 27లో చీనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

- సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్ లతో 1963లో మొదలైన్ భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన పరస్మిని (1963), మిస్టర్. ఎక్స్ ఇన్ బాంబే (1964), ఆయే దిన్ బాహర్ కే (1966), మిలన్ (1967), అనిత (1967), షగిర్ద్ (1968), మేరే హమ్ దమ్ మే దోస్త్ (1968), ఇంతకం (1969), దో రాస్తే (1969), జీనే జీ రాహ్ (1969) వంటి సినిమాలలో పాటలు పాడారు లతా. జీనేకీ రాహ్ సినిమాకి లత మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

- 1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తిగీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. ఈ ఆల్బమ్లలో సాన్ వారే రంగ్ రాచీ, ఉద్ జా రే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు.

- 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

- 1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్ (రోహన్ కుమారుడు), అను మాలిక్ (సర్దార్ మాలిక్ కొడుకు), ఆనంద్‌-మిలింద్ (చిత్రగుప్త్ కుమారులు) లతో పనిచేశారు ఆమె. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భుపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్ లో ఆమె పాడిన దిల్ హూం హూం కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది.

- ఏక్ ధుజే కే లియే, సిల్ సిలా, కార్జ్, ప్రేమ్ రోగీ, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగ మిలీ, హీరో, నాగిన, చాందినీ, రామ్ లఖన్, ఇలా ఎన్నో సినిమాలు.. మరెన్నో పాటలు ఆమె గాత్రంతో జీవం పోసుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

రాజకీయాల్లో ఇటువంటి వారుంటారా?

1999 లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు వచ్చేవి. ఆమె అనారోగ్యంతోనే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందుకు జీతం కానీ దిల్లీలో ప్రభుత్వ వసతిగృహం కానీ తీసుకోలేదు.

ఇవి లతాకు మాత్రమే సాధ్యం!

- ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది.

- ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకొంది.

- 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది.

ఈ రికార్డులు ఎప్పటికీ బద్దలు కావు.

ఈరోజు (సెప్టెంబర్ 28) పుట్టినరోజు జరుపుకుంటున్న లతా మంగేష్కర్ ఆయురారోగ్యాలతో మరింత కాలం తన భజనలతో భారతావనిని ఆధ్యాత్మిక భారతంగా తీర్చిదిద్దాలని కోరుకుందాం.


Next Story