Director Shankar: దర్శకుడు శంకర్ పై కాపీ రైట్ కేసు.. ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ED Attaches Rs 10 Crore Assets of Director Shankar in Copyright Case
x

దర్శకుడు శంకర్ పై కాపీ రైట్ కేసు.. ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

Highlights

దర్శకుడు శంకర్‌ చిక్కుల్లో పడ్డారు. రోబో సినిమా విషయంలో శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.10 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది.

Director Shankar: దర్శకుడు శంకర్‌ చిక్కుల్లో పడ్డారు. రోబో సినిమా విషయంలో శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.10 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈ నెల 17న శంకర్ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే రోబో సినిమాను శంకర్ తన కథ జిగుబాను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. మరోవైపు ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. కాపీ రైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించారంటూ ఆ నివేదిక ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది.

రోబో సినిమా 2010లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం శంకర్ రూ.11.5 కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో దర్శకుడు శంకర్ కు పాన్ ఇండియా రేంజ్‌లో గౌరవం రెట్టింపు అయింది.

శంకర్ తమిళ దర్శకుడే అయినా దేశం మొత్తం అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. కొంతకాలంగా హిట్ లేకపోవడంతో పాటు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో డిజాస్టర్‌లుగా నిలిచాయి. ఇండియన్ 2, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. శంకర్‌తో సినిమా అంటే ఒకప్పుడు లాభాల పంట పండేది. అలాంటిది ఇప్పుడు వందల కోట్లు నష్టాలు మిగులుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

తాను తీసిన సినిమాలు సరైన సక్సెస్ సాధించకపోవడంతో సతమతమవుతున్న శంకర్‌కు ఇప్పుడు ఈడీ కూడా షాక్ ఇచ్చింది. అనూహ్యంగా ఈడీ ఆయన రూ.10 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ వార్త ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories