K. Viswanath: వెండితెరపై ఎన్నో కళాఖండాలు ఆవిష్కరించిన కె. విశ్వనాథ్

Director K. Viswanath Passed Away
x

K. Viswanath: వెండితెరపై ఎన్నో కళాఖండాలు ఆవిష్కరించిన కె. విశ్వనాథ్

Highlights

K. Viswanath: తనకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఫిబ్రవరి 2 అంటే ఆయనకు చాలా ఇష్టం

K. Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణ కమలం వంటి ఎన్నో కళాఖాండాలను ఆయన ఆవిష్కరించారు. సినిమా అంటే వ్యాపారం కాదు.. సినిమా అంటే ఓ కళ అని నమ్మిన కె.విశ్వనాథ్.... చివరి వరకూ కళాతపస్సే చేశారు. ఆయనకు ఫిబ్రవరి రెండో తేదీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 1980 ఫిబ్రవరి 2న ఆయన కెరీర్‌ని అద్భుతమైన స్టేజీకి తీసుకెళ్లిన శంకరాభరణం రిలీజ్ అయింది. అదే ఫిబ్రవరి 2న ఆయన తుది శ్వాస విడిచారు.

ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా కోసమే తపిస్తూ బతికారు. ఫిబ్రవరి 2వ తేదీ తనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన శంకరాభరణం రిలీజ్ కావడంతో ఆయన రోజంతా ఉత్సాహంగా ఉన్నారు. విశ్వనాథ్ మరణించే చివరి క్షణం వరకు పాటను రాస్తూ ఉన్నారు. ఆయన రాయలేని పరిస్థితుల్లో తన పెద్ద కుమారుడికి తన నోటి మాటలతో చెబుతూ పాటను రాయించారు.

శంకరాభరణం తెలుగు సమాజంపై పెద్ద ప్రభావమే చూపించిందని చెప్పవచ్చు. శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తరువాత చాలా అమ్మాయిలు, అబ్బాయిలు సంగీత పాఠశాల్లలో చేరారంటే ఆశ్చర్యం కాదు. పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర శంకరాభరణం సొంతం. అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, 1981లో ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది. అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది.

సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలోనూ.. చరిత్రలో నిలిచిపోయే మేలిముత్యాల్లాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో. దర్శకుడు అంటే ఏమిటో, ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో ప్రాక్టికల్ గా నిరూపించారు కే.విశ్వనాథ్. నిజానికి దర్శకుడికి గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చింది కేవిశ్వనాథేనని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories