కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం

CM KCR Expressed Deep Condolences to K Viswanath
x

కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం

Highlights

*విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

CM KCR: తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచే ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ‍యన ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని ఆయన కేసీఆర్‌ కొనియాడారు.

సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె. విశ్వనాథ్ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిగా నిలిచాయన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందన్నారు. కవి పండితులకు జనన, మరణాల భయం ఉండదని, వారి కీర్తి అజరామరమని సీఎం పేర్కొన్నారు. విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories