Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో వెండితెర వెలుగులు

Cinema Theaters to open in Kashmir After 30 Years
x

Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో వెండితెర వెలుగులు

Highlights

Kashmir: మూడు దశాబ్దాల అనంతరం పునఃప్రారంభమైన సినిమాహాళ్లు

Kashmir: కాశ్మీర్‌లో మూడు దశాబ్దాల అనంతరం సినిమాహాళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉగ్రవాదం కారణంగా అక్కడ థియేటర్లన్నీ మూతపడడంతో.. వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీఫ్లెక్స్‌లు నిర్మించింది. దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను నిన్న జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, మరోదాంట్లో భాగ్‌ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు.

నూతనంగా నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్ లను త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభించనున్నారు. 1980 వరకు కశ్మీర్‌లోయలో సినిమాహాళ్లు ఉండేవి. రెండు ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికల కారణంగా యజమానులు వాటిని మూసివేశారు. పదేళ్ల అనంతరం వాటిని తెరవడానికి ప్రయత్నాలు జరిగినా.. మళ్లీ బెదిరింపులు వచ్చాయి. 1999లో శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లోని రీగల్‌ థియేటర్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. అనంతరం నీలం, బ్రాడ్వే థియేటర్లను ప్రారంభించినా ప్రేక్షకులు ఎవరూ రాకపోవడంతో వాటిని మూసివేయాల్సి వచ్చింది. మళ్లీ ఇంతకాలానికి అక్కడ వెండతెర వెలుగులు అందుబాటులోకి వచ్చాయి.

శ్రీనగర్‌లోని సోంవార్‌ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ రేపు ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్‌ సింగ్‌ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories