Chiranjeevi Birthday Special: బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు రీ-రిలీజ్

Chiranjeevi Birthday Special Gharana Mogudu Re-Release
x

Chiranjeevi Birthday Special: బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు రీ-రిలీజ్

Highlights

Chiranjeevi Birthday Special: 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు

Chiranjeevi Birthday Special: తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన ఆర్టిస్టులు ఎవరు అన్న ప్రశ్న తలెత్తితే.. ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు మెగాస్టార్. ఆయన డైలాగ్ డెలివరీ, ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్.. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే.. చిరంజీవి ఇంట్రడ్యూస్ చేసిన స్టెప్స్.. తెలుగు ఇండస్ట్రీలో నూతనాధ్యాయం లిఖించాయి. 66 ఏళ్ల వయసులోనూ కుర్రకారుకు సైతం జోష్ తెప్పించే ఎనర్జీ లెవల్స్ ఉన్న అరుదైన స్టార్ ఆయన. చిరు ఫ్యాన్స్ అందరూ మెగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న శుభ సందర్భంలో ఓ స్పెషల్ స్టోరీ.

చిరు.. అలవోకగా ఓ చూపు చూస్తే స్టైల్. ఒదులొదులుగా ఓ లెగ్ షేక్ చేస్తే అది ట్రెండ్. కొంటెగా కన్ను గీటితే ఇంకో స్టైల్. ప్రేయసిని బులిపించే తీరులో మహిళా లోకాన్ని మైమరపింపజేస్తే మరో స్టైల్. కరుడుగట్టిన కిరాయి రౌడీలను ఒంటిచెత్తే రఫ్ఫాడించే వీర నాటు స్టైల్. పేరు మోసిన విలన్ల ముందు గుండెధైర్యాన్ని దట్టించే ఒక్క డైలాగ్ పేలిస్తే.. ఫ్యాన్స్ అంతా దశాబ్దాలపాటు ఫిదా అయిపోయే స్టైల్. ఇలా ఒక్క చిరులో మెగా క్లాసిఫికేషన్స్ ఎన్నో కనిపిస్తాయి.

ఎత్తయిన భవనానికి కింద ఉండే పునాది రాయి ఎవరికీ కనిపించదు. కానీ ఆ పునాది రాయే లేకపోతే.. భవనానికి చాన్స్ ఎక్కడిది? పునాదిరాళ్లు సినిమాతో కెమెరా ముందు ‌ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న చిరు.. దాదాపు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఒక్కొక్క ఇటుకే పేర్చుకుంటూ.. అనితర సాధ్యమైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఆయనకు అనుభవ జ్ఞానం ఎంతుందో.. అంతకు మించి ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులంతా సమ్మోహితులయ్యే అణకువను అలవరచుకున్నారు. ఆ అణకువనే.. ఆయన మెగా క్యారెక్టర్ కు గొప్ప అలంకరణగా భాసిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఆయన్ని క్లోజ్ గా చూస్తున్నవారు చెప్పేదేమంటే.. ఆయన సక్సెస్‎కు కారణం.. ఎక్కడైనా తగ్గి ఉండడమేనంటారు. తగ్గి ఉండడం తలవంపు కాదనేది చిరు సూత్రీకరణ. అందుకు అనేక దృష్టాంతాలను మనం చూడవచ్చు.

1955 ఆగస్టు 22న కొణిదెల వారింట శివశంకర వరప్రసాద్ గా జన్మించిన చిరంజీవి.. కొణిదెల కుటుంబంలో ఎవరూ ఎంచుకోని డిఫరెంట్ ఫీల్డ్‎ను ఎంచుకున్నారు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోతే గట్టెక్కడం కష్టమనే అభిప్రాయాన్ని తన కఠోర శ్రమ ద్వారా.. తాను అందుకున్న అందలాల ద్వారా పటాపంచలు చేసి చూపించారు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఏ రంగంలోనూ ఓడిపోడని స్వీయ చరిత్ర ద్వారా నిరూపించారు చిరు. ఆయన కష్టం ఒక్కటే కాదు.. ఫ్యాన్ ఫాలోయింగ్.. ప్రజాక్షేత్రంలో సేవా కార్యక్రమాలు.. ఇలా బహుముఖీన అంశాల్లో ఆయన అనుసరిస్తున్న కార్యక్రమాల ద్వారా.. అనేక అవార్డులు ఆయన్ని వరించాయి. అంతేకాదు.. రాజకీయంగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వంలో 2012 నుంచి 2014 దాకా పర్యాటక శాఖా మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. పదవీకాలంలోనే గాక... పదవీకాలం పూర్తయినా కూడా రాజకీయ వాసనలేవీ తన క్యారెక్టర్ కు అంటకుండా చూసుకోగలగడం చిరుకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరు.. అత్యధికంగా తెలుగులో, ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య పురస్కారం, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను 2006లో ఆయన్ని పద్మభూషణ్ వరించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించింది. దేశం మొత్తమ్మీద చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.

ప్రతి బర్త్ డే ను మెగా ఫ్యాన్స్ దేనికదే నభూతో అన్నట్టుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. 22వ తేదీన చిరు బర్త్ డే పురస్కరించుకొని తెలుగు చిత్రసీమలో గుర్తుండిపోయే ఓ ఈవెంట్‎కు ప్లాన్ చేశారు. అదేంటంటే.. చిరుకు భారీ గుర్తింపు తీసుకొచ్చిన ఘరానా మొగుడు సినిమాను రీ-రిలీజ్ చేయడం. చిరు సినీ కెరీర్లో మేలిమలుపులు ఎన్నో ఉన్నా.. ఘరానా మొగుడును రీ-రిలీజ్‎కు ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి సరసన నగ్మా హీరోయిన్ గా, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలో, డిస్కో శాంతి స్పెషల్ సాంగ్ తో రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం వంటి టాప్ యాక్టర్స్ నటించారు. 1992లో విడుదలైన ఆ సినిమా భారీ విజయం సాధించింది. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా 10 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఘరానా మొగుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు తెలుగులో 10 కోట్ల కలెక్షన్ నమోదు కాలేదు. ఆ సరికొత్త రికార్డు తరువాత చిరు తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇండియాలో అమితాబ్ తర్వాత, సౌత్ లో మొట్టమొదటిసారిగా కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవే. ఆ తీపి అనుభూతిని ఇండస్ట్రీలో శాశ్వతం చేస్తూ ఘరానా మొగుడు సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించడం విశేషం.

చిరుకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా.. ఇవాళ తన పేరే చాలా మందికి గాడ్ ఫాదర్ గా మారిందంటే అతిశయోక్తి కాదు. 66 ఏళ్ల వయసులోనూ సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న చిరు.. ఆచార్య తరువాత చాలా బిజీగా మారిపోయారు. గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు టేకప్ చేసి కుర్ర హీరోలకు సవాళ్లు విసురుతున్నారు. మరిన్ని ప్రాజెక్టులకు సైతం సై అంటూ తొడ గొడుతున్నారు. 22న చిరు బర్త్ డే సందర్భంగా బోళా శంకర్ రిలీజ్ డేని కూడా అనౌన్స్ చేయడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న బోళా శంకర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. పునాదిరాయిగా ప్రస్థానం మొదలుపెట్టిన చిరు.. గాడ్ ఫాదర్ రేంజ్ కి ఎదిగిపోయిన వైనం.. ఎందరో అప్‎కమింగ్ హీరోలకు స్ఫూర్తిదాయకం.

Show Full Article
Print Article
Next Story
More Stories