Akhanda 2 Review : బాలయ్య-బోయపాటి తాండవం.. మాస్ ఫ్యాన్స్‌కి పూనకాలే

Akhanda 2 Review
x

Akhanda 2 Review

Highlights

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా అఖండ 2. నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

Akhanda 2 Review : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా అఖండ 2. నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

నటీనటులు : బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు.

దర్శకుడు : బోయపాటి శ్రీను

నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట

సంగీత దర్శకుడు : థమన్ ఎస్

సినిమాటోగ్రాఫర్ : సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకే

ఎడిటర్ : తమ్మిరాజు

కథేంటంటే

భారతదేశం మూలాలను దెబ్బతీయడానికి, ముఖ్యంగా కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని శత్రుదేశమైన చైనా ఆర్మీ అధికారులు బయో-వార్‌కి దిగుతారు. ఈ కుట్ర కారణంగా పవిత్ర స్నానం చేసిన చాలా మంది అపస్మారక స్థితికి చేరుకుంటారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు యాంటీ-డాట్ వ్యాక్సిన్‌ను కనిపెట్టగా, శత్రువులు ల్యాబ్‌ను నాశనం చేసి శాస్త్రవేత్తలను చంపేస్తారు. వారిలో యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా) ఒక్కరే వ్యాక్సిన్‌తో బయటపడుతుంది. ఆమెను రక్షించడానికి రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. జనని ఆపదలో ఉన్న విషయం అఘోరాకి ఎలా తెలిసింది? ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ (బాలకృష్ణ)కి, జననికీ సంబంధం ఏమిటి? ఆ ఉద్రిక్తతలను అఖండ ఎలా అణచివేశాడు? అనేది తెరపై చూడాలి. ఈసారి కథ సరిహద్దులు దాటి సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా బోయపాటి డిజైన్ చేశారు.

నటీనటుల పర్ఫామెన్స్

బాలయ్య పోషించిన రెండు పాత్రల్లో అఖండ పాత్రే సింహభాగం తీసుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో, మాస్ డైలాగ్‌లలో ఆయన విశ్వరూపం చూపించారు. అఖండ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ పాత్ర మాత్రం అనుకున్నంతగా వర్కవుట్ అవ్వలేదు. సంయుక్త మీనన్ పాత్ర నిడివి చిన్నదే, గ్లామర్ పాత్రకే పరిమితమైంది. ఆమె పాత్రలో ఎమోషనల్ ఎండింగ్ బాగున్నా, పాటల్లో ఆమె ఇమడలేకపోయిందనే విమర్శ ఉంది.

బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా నటన బాగున్నా, లిప్ సింక్ సరిగ్గా సెట్ అవ్వకపోవడం మైనస్‌గా మారింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా, డబ్బింగ్ వాయిస్ సెట్ అవ్వకపోవడం వలన ఓ లోపం కనిపిస్తుంది. ఆది పినిశెట్టి (నేత్ర పాత్ర), కబీర్ దుహాన్ సింగ్ వంటివారు ఉన్నా, సినిమాలో విలన్ పాత్రలకు సరైన బలం లేదు. ఆది పినిశెట్టి పాత్ర సెకండాఫ్‌లో సడెన్‌గా వచ్చి రెండు ఫైట్ల తర్వాత ముగియడంతో.. విలన్ పాత్ర సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదనే అభిప్రాయం ఉంది.

సాంకేతిక విభాగం

అఖండ మొదటి భాగంలో తన సంగీతంతో పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచిన తమన్, ఈసారి అదే స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. అయినప్పటికీ, ట్రాన్స్ బీజీఎం మరియు కొన్ని సీన్లకు ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం థియేటర్‌లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. రాంప్రసాద్ బాలయ్యను బాగా చూపించారు. ముఖ్యంగా కుంభమేళా సన్నివేశాలు మరియు హిమాలయాల నేపథ్యం సినిమా స్థాయిని పెంచాయి. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్‌లు, లాజిక్స్ లేకుండా ఉన్నప్పటికీ.. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లో వచ్చే ఓ రెండు ఫైట్లు మాత్రం గూస్ బంప్స్ ఇస్తాయి.

బోయపాటి మార్క్ మాస్

దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి కథ పరిధిని సరిహద్దులు దాటించారు. మాస్ ఎలివేషన్లలో బోయపాటి శైలి మరోసారి పదునెక్కింది. శివుడు, హనుమంతుడు వంటి డివోషనల్ ఎలిమెంట్స్ ను సినిమా కోసం వినియోగించుకున్న విధానం బాగుంది. అయితే, దర్శకుడు కొన్ని కామెడీ సీన్ల విషయంలో బలహీనతను చూపించారు. కథ-కథనం-ఎమోషన్ తో సంబంధం లేకుండా, బాలయ్య విధ్వంసం ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు బోయపాటి వరుసబెట్టి ఎలివేషన్స్, ఫైట్స్‌తో బోర్ కొట్టకుండా సినిమాను హరి రేంజ్‌లో పరిగెత్తించారు. కోర్ పాయింట్, స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వలన కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ మినహా మిగతా సినిమాని మొదటి భాగం స్థాయిలో ఆస్వాదించలేకపోయాం.

ఫైనల్ తీర్పు

అఖండ 2 ఒక హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ, వైల్డ్ యాక్షన్ సీన్స్, మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపించినా, లాజిక్స్ పట్టించుకోకుండా.. బాలయ్య రేంజ్ ఫైట్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, తమన్ ట్రాన్స్ కోసం ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే. అభిమానులైతే థియేటర్లలో దద్దరిల్లేలా ఎంజాయ్ చేస్తారు, సాధారణ ప్రేక్షకులు అక్కడక్కడా ఇదెక్కడి మాస్ రా అని నోరెళ్లబెడుతూ సినిమాలో లీనమైపోతారు.

రేటింగ్ : 3.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories