
Vishnu Manchu: మంచు విష్ణుకు పోలీసు నోటీసులు.. కిడ్నాప్ కేసులో అరెస్ట్ తప్పదా..?
Vishnu Manchu: టాలీవుడ్ నటుడు, మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు చుట్టూ కిడ్నాప్ కేసు ఉచ్చు బిగుస్తోంది.
Vishnu Manchu: టాలీవుడ్ నటుడు, మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు చుట్టూ కిడ్నాప్ కేసు ఉచ్చు బిగుస్తోంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల వివాదం కాస్తా ఇప్పుడు పోలీసు నోటీసుల వరకు వెళ్లింది. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పెంపును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇప్పటికే పీఆర్వో సతీష్ సమాతో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)లో పీఆర్వో సతీష్ పేరును A1గా, మంచు విష్ణును A2గా, సీనియర్ నటుడు మోహన్ బాబును A3గా చేర్చారు.
విష్ణు స్పందన.. పోలీసుల ఆదేశాలు!
మూడు రోజుల్లోగా విచారణకు రావాలని పోలీసులు ఆదేశించగా, మంచు విష్ణు తన షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఇప్పుడే రాలేనని తెలిపారు. ఫిబ్రవరి 15 తర్వాతే తాను విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, ఈ కేసులో తనపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
యూనివర్సిటీ ప్రోద్భలంతోనేనా?
యాజమాన్యం ప్రోద్భలంతోనే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న నిరసనలు ఇలా క్రిమినల్ కేసుల వరకు వెళ్లడం విద్యా ,సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 15వ తేదీ తర్వాత విష్ణు విచారణకు హాజరైనప్పుడు మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




