Zombie Reddy Review: హర్రర్ లో ఫన్.. జాంబీ రెడ్డి వినోదం!

Zombie Reddy Movie Review
x

జాంబీ రెడ్డి మూవీ రివ్యూ 

Highlights

జాంబీలతో పాటు వినోదాన్ని కొత్తగా అందించింది జాంబీ రెడ్డి

పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభం అయ్యాకా.. ఎక్కువ అంచనాలతో విడుదలవుతున్న సినిమా జాంబీ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో బుడతడు తేజా సజ్జా హీరోగా పరిచయమవుతుండడం.. ఆ..కల్కి వంటి చక్కని సినిమాలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్నా సినిమా కావడం.. టీజర్ నుంచి ట్రైలర్ వరకూ సినిమా పై ప్రేక్షకుల్లో పెంచిన ఆసక్తి అన్నీ కలగలసి జాంబీ రెడ్డి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూసేలా చేశాయి. ఈరోజు ఆ ఎదురుచూపులకు తెరపడింది. జాంబీరెడ్డి సినిమా వెండితెరపై పడింది. మరి ఇంత అంచనాలతో వచ్చిన జాంబీలు ఏం చేశాయి? ప్రేక్షకులకు వినోదాన్నిచ్చాయాలేదా? మరి జంబీలతో రెడ్డి కథ ఏమిటి? సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం.

కథేమిటంటే..

లాక్ డౌన్.. కర్ఫ్యూ.. కరోనా వ్యాక్సిన్.. గేమింగ్ డిజైనర్స్.. జాంబీలు..ఫాక్షన్ అన్నీ కలిస్తే జాంబీ రెడ్డి. కన్ఫ్యూజ్ కావద్దు. సినిమా కథ ఇదే. నలుగురు గేమింగ్ డిజైనర్స్ స్నేహితులు. వారిలో ఒకరి పెల్లి లాక్ డౌన్ టైంలో కర్నూలులో జరుగుతుంది. ఆ పెళ్ళికి స్నేహితులు అందరూ వెళతారు. సరిగ్గా వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ ఊరిలో ఒక అత్యుత్సాహవంతుడు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఊరిలో కొందరు జాంబీలుగా మారిపోయి ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళాకా హీరోతో పాటుగా మరో నలుగురు తప్ప అందరూ జాంబీలు గా మారిపోతారు. ఇది ప్రధమార్ధం. ద్వితీయార్ధంలో ఈ ఐదుగురు కలిసి జాంబీలను ఎలా ఎదుర్కున్నారు. వాటి నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు? ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం దొరికింది? అసలు పరిష్కారం దొరికిందా..లేదా? ఈ ప్రశ్నలకు సమాధానమే జాంబీ రెడ్డి.

ఎవరెలా చేశారంటే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించిన తేజా సజ్జా.. హీరోగా తన మొదటి సినిమాగా ఒక కొత్తదనం ఉన్న సినిమాని ఎన్నుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. ఈ సినిమాకి తేజా సరిగ్గా సరిపోయాడు. చాలా ఈజీగా ఈ క్యారెక్టర్ ని చేశేశాడు. డైలాగ్ డెలివరీ ఎక్కడా తడబాటు లేదు. ఇక దక్ష నాగార్కర్ కూడా పాత్రకు తగ్గట్టుగా చేసింది. సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించిన నందిని అన్ని కోణాల్లోనూ ఆదరగోట్టింది. అందరికంటే ఎక్కువ చెప్పుకోవలసింది గెటప్ శ్రీను గురించి. గెటప్ శ్రీను సెకండ్ హాఫ్ లో సినిమాని నిలబెట్టాడు. అర్జీ హేమంత్ కూడా చెప్పుకోదగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక అన్నపూర్ణ ముసలి జాంబీగా నవ్వులు పూయించారు.

టెక్నికల్ గా ఎలా ఉందంటే..

దెయ్యాలు..భూతాలు కథలు తెలుగు తెరకు కొత్త కాదు. కానీ, జాంబీ కథ మాత్రం కొత్తదే. ఈ తరహా కథలు హాలీవుడ్ లో బోలెడు. ఈ కథలతో హర్రర్ ఎంత క్రియేట్ చేయవచ్చో.. హాస్యాన్నీ అంతగా క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే.. ఎదుటివారి తిప్పలు చూసి నవ్వుకోవడం మానవ సహజం కనుక. సరిగ్గా ఇదే వర్కౌట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న లైన్ పట్టుకుని దానికి జాంబీలను జత చేసి.. చక్కని కామెడీ చక్కర పూసి.. భక్తి మసాలా దట్టించి కమ్మని వంటకంలా తయారు చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధించాడనే చెప్పొచ్చు.

ఇక టెక్నికల్ గా సినిమా చక్కగా వచ్చింది. టెక్నీషియన్స్ అందరూ సినిమాని మరో లెవెల్ లో చూపించడానికి పడిన కష్టం సినిమాలో కనిపించింది. ముఖ్యంగా జాంబీస్ మేకప్ చాలా బావుంది. అనిత్ ఫోటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాకి సంగీతం కూడా ప్లస్ అని చెప్పొచ్చు. మార్క్ కె. రాబిన్ నేపధ్య సంగీతం సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది.

ఎలా ఉందంటే..

జాంబీ రెడ్డి పేరుకు తగ్గట్టుగానే కొత్తగా ఉంది. జాంబీలు చూడటం.. మనకి కొత్త.. పైగా జాంబీలకు ఫ్యాక్షన్ డ్రాప్ అద్దడం మరింత కొత్తదనాన్ని తీసుకువచ్చింది. కానీ, మొదటి సగం సినిమా అంతా చాలా లేజీగా ఎక్కడో చూసిన సినిమా అనే ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా వేగంగా.. వినోదాత్మకంగా కదులుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాని కొత్తదనంతో నింపే ప్రయత్నం చేశారు. దానిలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. మొదటి భాగం సినిమా మీద మరింత శ్రద్ధ చూపించి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది అనడంలో సందేహం లేదు.

మొత్తమ్మీద జాంబీస్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించడంలో జాంబీ రెడ్డి బాగానే వర్కౌట్ చేశాడు.

ఈ సమీక్ష రచయిత అభిప్రాయానుసారం రాసింది. సినిమాని పెద్ద స్క్రీన్ పై చూసి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories