విజువల్ వండర్ ది లయన్ కింగ్

విజువల్ వండర్ ది లయన్ కింగ్
x
Highlights

అందరికీ తెలిసిన కథను తిరిగి తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చిన్నపిల్లల సినిమా లాంటి సినిమాను మళ్లీ ప్రేక్షకులకు చూపించి...

అందరికీ తెలిసిన కథను తిరిగి తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చిన్నపిల్లల సినిమా లాంటి సినిమాను మళ్లీ ప్రేక్షకులకు చూపించి మెప్పుసాధించాలనే ప్రయత్నం గొప్పది. అటువంటి ప్రయత్నం చేసింది డిస్నీ సంస్థ. 90వ దశకంలో సూపర్ హిట్ అయిన ది లయన్ కింగ్ సినిమాని మళ్లీ అదే పేరుతో అత్యాధునిక హంగులతో తెరకెక్కించింది. ప్రపంచంలోని పలు భాషల్లో ఈ సినిమాని రూపొందించింది. అంతే కాదు మన దేశంలో ఈ సినిమాని తెలుగు తో సహా పలు భాషల్లో విడుదల చేసింది. అయితే, ఈ యానిమేషన్ సినిమాకి ఆయా భాషల్లో పేరున్న నటవర్గం తో డబ్బింగ్ చెప్పించింది డిస్నీ సంస్థ. ఆ ప్రయోగం విజయవంతం అయిందా.. చిన్నపిల్లల సినిమా మళ్లీ మళ్లీ తెస్తే అందులో కొత్తదనం ఏముంది? ఈరోజు విడుదలైన ఈ సినిమా సంగతులు తెలుసుకుందాం పదండి.

ఇదీ కథ..

ఈ సినిమా కథ అందరికీ తెల్సిందే. మామూలు సినిమా భాషలో చెప్పాలంటే.. ఓ రాజ్యం. ఆ రాజ్యానికో రాజు. ఆయనకో కొడుకు. సుభిక్ష పాలన సాగుతున్న దశలో ఓ క్రూరుడు. రాజును చంపేస్తాడు. రాజ్యం స్వాధీనం చేసుకుంటాడు. ఈ క్రమంలో రాజు కొడుకు యువరాజు తప్పించుకోగలుగుతాడు. ఎక్కడో పెరుగుతాడు. తానెవరో తెలీని తనకి, పెద్దవాడయ్యాకా తరువాత విషయం తెలుస్తుంది. తండ్రిని చంపి, రాజ్యాన్ని కాజేసిన వారిపై పగ తీర్చుకుని..రాజ్యాన్ని పొందుతాడు. ఇంతే. ఇప్పుడు ఈ కథ రాజ్యం ఓ అడవి. రాజు ఓ సింహం. రాజు కొడుకు ఓ సింహం పిల్ల.. ఇక ప్రజలు ఇతర జంతువులు. ఇలా కలుపుకుని ఊహించుకోండి అదే ది లయన్ కింగ్! ఇప్పుడు ఈ యానిమేషన్ జంతువుల సినిమాలో పాత్రలు మనకి తెల్సిన ప్రముఖ నటుల గొంతుతో మాట్లాడుతుంటే ఆ నటులే నటిస్తున్నట్టు సినిమా కనిపిస్తే అదే ఈ సినిమా. ఆ థ్రిల్ తోనే తెలిసిన కథను కూడా ప్రేక్షకులు ఉత్సుకతతో చూసేలా చేసింది.


ఎలా ఉంది?

ఇందులో ఎవరెలా చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి..ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా చూస్తున్నాప్పుడు మనం కొద్ది సేపట్లోనే మన నటుల సినిమాని చూస్తున్న ఫీల్ లోకి వెళ్ళిపోతాం. అంత అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు మన నటులు. నానీ సినిమాకి హీరోగా చెప్పుకోవచ్చు. చిన్నప్పటి సింహం పలుకులకూ.. పెద్దయ్యాకా సింహం మాట్లాడే మాటలకి మధ్య అంతరాన్ని చక్కగా చూపించాడు. సింబా పాత్రలో నానీ నటించాడన్నంత బాగా డబ్బింగ్ చెప్పాడు. ఇక విలన్ స్కార్‌ పాత్రకి డబ్బింగ్ చెప్పిన జగపతిబాబు కూడా ప్రతి ఫ్రేం లోనూ జగపతి బాబే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అందరూ జంతువుల ముఖకవళికలు.. జరుగుతున్న సీన్ కు అనుగుణంగా తమ గొంతుల్ని సవరించుకున్న తీరే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఎవరూ ఎక్కడా తడబాటు లేకుండా డబ్బింగ్ చెప్పారు. అంటే..ఆయా నటులు వాళ్ళు నటించిన సినిమాలకి డబ్బింగ్ చెప్పుకోవడం వేరు. ఇలా జంతువులకు మాట అందించడం వేరు. దీనిలో నూటికి నూరు మార్కులు సాధించారు. వాళ్ళే కాకుండా ఆలీ, బ్రహ్మానందం, రవిశంకర్ ఇలా మనకు తెల్సిన నటులే.. అందరూ మంచి డబ్బింగ్ చెప్పి సినిమా లెవెల్ పెంచారని చెప్పాలి.

మొదటి సగం రాజు (ముసఫా), రాజు కొడుకు (సింబ)ల మధ్య సన్నివేశాలు.. ఇతర పాత్రల పరిచయంతో సినిమా సాగిపోతుంది. ఇక్కడ ముసఫాను కాలితో తొక్కి చంపే సీన్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి వేస్తుంది. ఇక ఇది యానిమేషన్ సినిమా అయినా ఆ భావన దాదాపుగా రాదు. అప్పటి సినిమా ఎలా ఉంటుందో మక్కీకి మక్కీ ఇదీ అలానే ఉంటుంది. కానీ.. విజువల్ వండర్స్.. డైలాగ్స్ తో సినిమా కొత్తగా కనిపిస్తుంది. ఇక సినిమాలో ప్రధాన ఆకర్షణ పుంబా, టిమోన్‌ పాత్రలు. వీటికి తెలుగు హాస్యనటులు బ్రహ్మానందం, అలీ వాయిస్‌ ఇచ్చారు. సినిమాలో ఈ రెండు పాత్రల సందడే ఎక్కువ. వాటి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అవి వేసే పంచ్‌ డైలాగ్‌లు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. తెలుగులో కేకే రాసిన సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు జాన్‌ ఫెవరూకు గతంలో 'జంగిల్‌ బుక్‌'ను రీమేక్‌ చేసిన అనుభవం ఉంది. అది అందరికీ తెలిసిన కథే అయినా, దాన్ని లైవ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వెండితెరపైకి తీసుకొచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో వెళ్లి 'ది లయన్‌ కింగ్‌'ను మళ్లీ పునః సృష్టించాడు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచనలకు డిస్నీ అద్భుత సహకారాన్ని అందించింది. ఫెవరూలో ఉన్న మరో కోణం ఎంటంటే ఎమోషనల్‌ సీన్స్‌ను గుండెకు హత్తుకునేలా చూపించడం. 'జంగిల్‌బుక్‌'లో పలు సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఇందులోనూ అంతే. ఇక యానిమేషన్‌ ఫిలింతో పోలిస్తే, స్కార్‌ను మరింత క్రూరంగా చూపించాడు దర్శకుడు. ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం సంగీతం. హ్యాన్స్‌ జిమ్మర్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సంగీతమే సినిమాని సగం నిలబెట్టిందంటే అత్శాయోక్తి కాదు.

మొత్తమ్మీద సినిమా పిల్లలనే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. విజువల్ వండర్స్ చూడతానికైనా సినిమా ఒకసారి థియేటర్లలో చూసి తీరాల్సిందే.

చివరగా.. చందమామ కథలు ఎన్నిసార్లు చదివినా ఆబాల గోపాలానికీ నచ్చుతాయి. ఇటువంటి సినిమాలు అంతే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories