SR Kalyana Mandapam Movie Review: " ఎస్ ఆర్ కళ్యాణమండపం " మూవీ రివ్యూ

SR Kalyana Mandapam Telugu Movie Review
x

" ఎస్ ఆర్ కళ్యాణమండపం " మూవీ రివ్యూ

Highlights

" ఎస్ ఆర్ కళ్యాణమండపం " మూవీ రివ్యూ

చిత్రం: ఎస్ ఆర్ కళ్యాణమండపం

నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్, అనిల్ గీలా, రాజ్ శేఖర్ అనింగి తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియల్

ఎడిటింగ్‌: శ్రీధర్ గాదె

నిర్మాతలు: ప్రమోద్, రాజు

దర్శకత్వం: శ్రీధర్ గాదె

బ్యానర్: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్

విడుదల: 06/08/2021

"రాజావారు రాణి గారు" అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన "టాక్సీవాలా" సినిమాతో వెండి తెరకు పరిచయమైన షార్ట్ ఫిలిమ్స్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఇవాళ అనగా ఆగస్టు 6 2021 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రచించింది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

క‌థ:

సినిమా కథ మొత్తం కడప జిల్లాలోని రాయచోటి లో జరుగుతుంది. కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) ఒక కాలేజీ స్టూడెంట్. కళ్యాణ్ కు తన తండ్రికి ధర్మ (సాయికుమార్) కి ఎప్పుడు పడేది కాదు. బోలెడంత ఆస్తి ఉన్నప్పటికీ తన తండ్రి కల్యాణ మండపం బిజినెస్ తో బాగా నష్టాలు వచ్చి ఉన్నదంతా పోవడంతో కళ్యాణ్ కు తండ్రి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ కొన్ని అనివార్య సంఘటనల వలన కళ్యాణ్ కళ్యాణ మండపం బిజినెస్ లోకి దిగాల్సి వస్తుంది. మరి కళ్యాణ్ బిజినెస్ లో విజయం సాధించాడా? సింధు (ప్రియాంక జవాల్కర్) తో తన ప్రేమ కథ కి ఏమైంది? కళ్యాణ్ కు తన తండ్రి పై ఉన్న కోపం తగ్గిందా? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ.

న‌టీన‌టులు :

కిరణ్ అబ్బవరం కు ఇది రెండో సినిమానే అయినప్పటికీ తన మాస్ రోల్ లో చాలా బాగా నటించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కాన్ఫిడెన్స్ సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ కథ లకు దూరంగా ఉంటూ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న కిరణ్ తన నటన విషయంలో కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. ప్రియాంక జవాల్కర్ పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంది. గత వారం విడుదలైన "తిమ్మరసు" సినిమా లో కంటే ఈ సినిమాలో ఇంకా బాగా నటించిందని చెప్పుకోవచ్చు. అందంతో మాత్రమే కాక అభినయంతో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగి పోగలిగిన సాయికుమార్ ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటన తో అందరినీ మెప్పించారు. తులసి మరియు అనిల్ గీల కూడా తమ తమ పాత్రలలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

నటుడిగా మాత్రమే కాక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులు కూడా కిరణ్ కిరణ్ అందించటం విశేషం. రెండవ సినిమా కి ఆల్ రౌండర్ గా మారిపోయిన కిరణ్ ఫ్రెష్ కాన్సెప్ట్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భిన్నమైన కథ అయినప్పటికీ దర్శకుడు శ్రీధర్ గాదె ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎలాంటి లోటు చేయలేదు. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది సినిమా. అటు ప్రేమ కథకు ఇటు ఫ్యామిలీ డ్రామాకు ఒకే విధంగా ప్రాధాన్యతనివ్వడం విశేషం. సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ క్లైమాక్స్లో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ సినిమాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

ఫస్ట్ హాఫ్

ఎంటర్టైన్మెంట్

ఎమోషనల్ క్లైమాక్స్

నటీనటులు

డైలాగులు

బలహీనతలు:

సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే

కథలోని లోపాలు

చివరి మాట:

సినిమా లోని ముఖ్య పాత్రలు అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ నెరేషన్ కొన్ని చోట్ల ఫాస్ట్ గా మరికొన్ని చోట్ల స్లో గా ఉండడంతో సినిమా కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పుకోవచ్చు. అన్నీ పాత్రలు రియాలిటీ కి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య బంధం ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ లో హీరో మరియు తన తండ్రి సాయికుమార్ మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మొదటి హాఫ్ లో కొన్ని సన్నివేశాలు యువతను చాలా బాగా ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. చివరిగా ఎస్ ఆర్ కళ్యాణమండపం కొంతమందికి నచ్చచ్చు కానీ చాలా మందికి నచ్చకపోవచ్చు.

బాటమ్ లైన్:

టైటిల్ కి తగ్గట్టు కళ్యాణమండపం చుట్టూ తిరిగే ఒక మంచి కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories