logo
సినిమా రివ్యూ

ఫర్వాలేదనిపించే సోలో బ్రతుకే సో బెటర్

ఫర్వాలేదనిపించే సోలో బ్రతుకే సో బెటర్
X
Highlights

కరోనా తరువాత ధియేటర్ల లోకి వచ్చిన మొదటి పెద్ద సినిమా ఎలావుందంటే..

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన స్టైల్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వెండి తెరమీద కాలు పెట్టిన వెంటనే వరుస హిట్లతో ప్రామిసింగ్ హీరోగా నిలబడ్డారు. కానీ, తరువాత కొన్ని ఫ్లాపులు పలకరించాయి. ఈ సారి కథలపై మరింత దృష్టి సారించిన ఈ మెగా హీరో చిత్రలహరి.. ప్రతిరోజూ పండగ రోజే అంటూ వరుసగా రెండు హిట్లతో మళ్ళీ ట్రాకులోకి వచ్చేశారు. ఇప్పుడు మూడో హిట్ కోసం సోలో బ్రతుకే సో బెటరూ అంటూ కొత్త దర్శకుడితో కలిసి బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి ఈరోజు వచ్చేశారు సాయి ధరమ్ తేజ్.

కరోనావైరస్ దెబ్బతో ఏడు నెలలకు పైగా థియేటర్లలో సినిమాలు విడుదల కాలేదు. చాలా సినిమాలు షూటింగ్ పూర్తయినా విడుదల కాకుండా ఉండిపోయాయి. కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. సినిమా హాళ్లు ప్రస్తుతం తెరుచుకోవడంతో.. కరోనా బ్రేక్ తరువాత తొలిసారిగా ఈ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ థియేటర్లలో ఈరోజు విడుదలైంది. ఈ సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూసింది. ఈ సినిమా విడుదలైతే.. కరోనా పరిస్థితుల్లో సినిమాలు చూసేందుకు ప్రజలు ఎంత వరకూ సిద్ధం అవుతారనేది తెలుస్తుందని అంచనాలో టాలీవుడ్ ఉంది. ఇక ఈ సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా నిలబడింది. తెలుగు నటీ నటులందరూ తమ సోషల్ మీడియా ఎకౌంట్లలో ఈ సినిమా గురించి ప్రచారం చేశారు. కరోనా నేపథ్యంలో చాలాకాలం తరువాత విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్న ఈ సినిమా ఎలా ఉందొ ఒకసారి చూద్దాం..

కథ ఇదీ..

చదువుకునే సమయంలోనే పెళ్లి అంటేనే విరక్తి పెంచుకున్న విరాట్ (సాయి ధరమ్ తేజ్) విశాఖలో తాను చదువుతున్న కాలేజీలో ఉన్న స్నేహితులకు కూడా సోలో గా బ్రతకడంలోనే సుఖం ఉదని చెబుతూ వస్తాడు. అదే దారిలో సోలో బ్రతుకే సో బెటరూ అంటూ O గ్రూప్ తయారు చేసి అందులో అందరికీ పెళ్లి చేసుకుంటే కష్టాలే అనే ప్రచారం చేస్తుంటాడు. అందుకు ఉదాహరణలుగా అబ్దుల్‌ కలాం, ఆర్‌ నారాయణ మూర్తి, అటల్‌ బిహారి వాజ్‌పేయి వంటి వారిని చెప్పడమే కాకుండా.. వారే తనకు ఆదర్శం అనుకుని బ్రతికేస్తుంటాడు. మనోడి ప్రచారంతో చాలా మంది యువకులు పెళ్లిళ్లు వదిలేసి సోలోగా బ్రతికేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విరాట్ కు వచ్చిన సంబంధాలు అన్నిటినీ చెడగొట్టుకున్నాడు. అందరినీ చులకనగా మాట్లాడుతాడు.

ఇదిలా ఉంటె హైదరాబాద్ లో విరాట్ కి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో చేరిన ట్రూవాత విరాట్ స్నేహితుల్లో మార్పు మొదలవుతుంది. ఒక్కోరు పెళ్లి చేసుకుని సోలో బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో విరాట్ ఆరాధించే నారాయణ మూర్తి కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడం సరికాదని ఒక ఇంటర్వ్యూలో చెబుతారు. దానిని చూసిన తరువాత తన మనసులో భావాలు కూడా మారుతుంతాయి.ఇదిలా ఉండగా ఒక స్నేహితుని పెళ్ళికి వెళతాడు విరాట్. అక్కడ పెళ్లికూతురు అమృత(నాభా నటేష్) విరాట్ ను పెళ్లిచేసుకుంటాను అని అంటుంది. అందరూ షాక్ తిన్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని విరాట్ కూడా ఒప్పుకుంటాడు. అయితే, చివరి నిమిషంలో అమృత విరాట్ కు షాకిస్తుంది. మరి అమృత ఇచ్చిన షాకేమిటి? విరాట్ అమృతాలు పెళ్లి చేసుకున్నారా? అసలు విరాట్ కు పెళ్లి మీద ఇంత విరక్తి కలగటానికి కారణం ఏమిటి? మరి చివరికి ఎం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

సినిమా సరదాగా మొదలై సరదాగా సాగుతూ ఆసక్తి కరమైన మలుపుతో విశ్రాంతి కార్డు వేసుకుంటుంది. తరువాత శుభం కార్డు వైపు వెళ్లే క్రమంలో కొద్దిగా సాగదీత అనిపిస్తుంది. మొదటి సగంలో ఉన్న వేగం రెండో సగంలో ఉండదు. అదేవిధంగా క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. సినిమాలో రెండో భాగంలో వినోదం కూడా తగ్గింది. మొదటి భాగంలో మంచి వినోదంతో సాగిన సినిమా.. రెండో అర్ధ భాగంలో కాస్త కల తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక సినిమాలో సాయి ధరమ్ తేజ్ యాక్షన్ సినిమాకి పెద్ద బలం. ఒక వైపు కామెడీ.. మరోవైపు ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకునేలా చేశారు. ఇక హీరోయిన్ నాభా నటేష్ కూడా సాయి ధరమ్ తేజ్ తో పోటీ పడి చేసింది. వెన్నెల కిశోర్, సత్య కామెడీ బావుంది. కీలకమైన పాత్రలో నటించిన రావు రమేష్ అదరగొట్టారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ తమ స్టయిల్ లో ఆడేసుకున్నారు. విలన్ గా అజయ్ ఫర్వాలేదనిపించాడు.

టెక్నీకల్ గ సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు సుబ్బు మొదటి సినిమా అయినా చక్కగా చేశాడు. సినిమా సెకండ్ హాఫ్ పై మరింత దృష్టిపెడితే బావుణ్ణనిపిస్తుంది. ఇక తమన్ సంగీతం పాటల్లోనూ.. రీరికార్డింగ్ లోనూ కూడా మంచి స్థాయిలో ఉంది. ఎడిటింగ్ బాగానే ఉంది.

మొత్తమ్మీద కరోనా తరువాత ధియేటర్ల లోకి వచ్చిన మొదటి పెద్ద సినిమా ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సాయి ధరమ్ తేజ్ మరో హిట్ కొట్టినట్టే. ఇక ఈ సినిమాని థియేటర్లకు వెళ్లి ఎంత మంది చూస్తారనేది కొన్ని రోజులాగితే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఈ సినిమా పరిస్థితి ని బట్టి వచ్చే పండుగకు ఎన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయో.. లెక్క తేలిపోతుంది.

Web TitleSai Dharam Tej Solo Brathuke so Better movie review
Next Story