Power star movie review: ఇది అర్జీవీ అనే ప్రవన్ కళ్యాణ్ అభిమాని వ్యధ!

Power star movie review
x
Power star movie review
Highlights

Power star movie review: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా పవర్ స్టార్ ఎలా ఉందొ చూద్దామా!

సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది. మన ప్రజల జీవితాల్లో పెనవేసుకుపోయిన అంశాల్లో సినిమా అత్యంత ప్రధానమైంది. కరోనా మన జీవితాల్ని అల్లకల్లోలం చేసినా.. ఎటూ కదలలేని పరిస్థితులు వచ్చినా.. మీడియాలో సినిమా వార్తలు మాత్రం ఆగలేదు. సినిమా షూటింగ్ లు జరగకపోయినా.. సినిమా ఇండస్ట్రీ అంతా అన్నీ మూసుకుని కూచున్నా.. మనకు మన అభిమాన తారాగణం పెసరట్టు వేసినా వార్తయింది. ఆగిపోయిన సినిమాలో హీరోయిన్ మారిపోయిందనే గాసిప్పూ వైరల్ అయింది. సరిగ్గా ఇదే బలహీనత(?) పట్టుకున్నారు ఆర్జీవీ అనే రామ్ గోపాల్ వర్మ. లాక్ డౌన్ లో ఇంటిలో కూచున్న వారికి తన ఆర్జీవీ ఫ్యాక్టరి తో వినోదాన్ని అందిస్తున్నానంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తనకి కావల్సిన మసాలా కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాల్నీ వీధిలోకి లాగి కెలకడానికి సంకోచించలేదు. అందుకే పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ను కెలికారు వర్మ.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సంఘటనలు అంటూ దాదాపుగా పవన్ తో పాటు ఆరుగురిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టి.. నలభై నిమిషాల సినిమా(ఇది ఎ కోవలోకి వస్తుందో తెలీదు) తీసి వదిలాడు. ఒక్కసారి చూడాలంటె మూడొందలు లాగేస్తున్నారు. అందరినీ అత్యంతగా ఆకర్షించిన ఈ సినిమా కోసం వదిలిన ట్రైలర్ లో చూపించిన కంటెంట్ కి కాస్త ముందు వెనుక ల్యాగింగ్ సన్నివేశాల్ని అతికించి సినిమా వదిలేశారు వర్మ.

సినిమాలో ఏమీ లేదు కానీ.. ఎంతో ఉన్నట్టు భ్రమ కల్పించడంలో వర్మ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. ఈ అతి ఖరీదైన నలభై నిమిషాల వర్మ వినోదం ఎందరికి నచ్చుతుంది అనేది పక్కన పెడితే, ఈ బుల్లి మూవీతో వర్మ మరోసారి తానెవరికీ అర్ధం కానని నిరూపించారు.

మొదటి అర్ధభాగంలో పూర్తిగా ట్రైలర్ లో ఉన్న అంశాలే ఉన్నాయి. తరువాతి అర్ధ భాగంలో మాత్రం ఆర్జీవీ తన స్టైల్ కి భిన్నంగా సినిమా నడిపించారు. పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికే అనే విధంగా క్లైమాక్స్ నడిచింది. వోడ్కా బాటిల్ తో ప్రవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్ ముందు కూచుని.. తనని తాను పవన్ ఫ్యాన్ గా చెప్పుకోవడానికి విపరీతంగా తాపత్రయ పడ్డారు.

''మీరు పార్టీ పెడతానన్నప్పుడు మీ ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే.. నీలో ఉన్న సిన్సియారిటీని సెక్స్ కంటే ఎక్కువ ఇష్టపడతాను. సార్... స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మనదేశంలో ఉన్న నాయకుల్లో మీరు చాలా అడ్వాన్స్డ్ అని ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే మిమ్మల్ని అంత చదివాను.. ఫాలో అయ్యాను. మీ ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి మీరు ఎన్నుకున్న కథలు కాని.. చేసిన కథలు కాని... వీటన్నింటినీ అబ్జర్వ్ చేసే ఇది చెప్తున్నా.. నాకు పిచ్చెక్కి మతి చెడి ఇది తీయలేదు. నా ఓడ్కా మీద ఒట్టేసి చెప్పున్నా.. ఆ నాయకులందరికంటే మీరు చాలా గొప్ప.'' అంటూ సాగిపోయింది వర్మ క్లైమాక్స్ ప్రసంగం.

ఇది ఎవరూ ఊహించనిది. నిజానికి వర్మ ఎవరూ ఊహించని విధంగానే ఎప్పుడూ ప్రవర్తిస్తారు. అందుకని ఇది ఆశ్చర్యం కలిగించదు. కానీ, ఆర్జీవీ ఇంత ఇదిగా పవన్ కళ్యాణ్ భజన చేయడం కొంత అయోమయం కలిగించేదే.

పవర్ స్టార్‌ భజన చేస్తున్న అర్జీవీ ముందు పవర్ స్టార్ ఒక్కసారి లేచి కోపంగా కుర్చీలో నుంచి పక్కకు రావడానికి ప్రయత్నించే క్రమంలో వర్మ కు ప్రవన్ కాలు తగులుతుంది. దానికి ''ఓకేసార్.. మీరు నన్ను కావాలని తన్నలేదని తెలుసు.. సారీ చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మీరు పవర్ స్టార్.. మీరు కూడా వేరే వాళ్లకి సారీ చెప్తే.. ఆ పదానికి అర్థం లేదు. నిచ్చెనకు ఉన్న మెట్లని నాలెడ్జ్‌ లాగ వాడుకుని పైకి ఎక్కుతున్న ప్రాసెస్‌లో ఒక మొట్టు ఎక్కగానే ఆ మెట్టుని అక్కడే వదిలేసి ఇంకో మెట్టు ఎక్కాలే తప్ప.. ఎక్కేసిన మెట్టుని కూడా మనం భుజంపై పెట్టుకుని పైకి ఎక్కుతుంటే.. ఆ మెట్టుకు మెట్టు బరువు ఎక్కువై.. ఎప్పుడో కప్పుడు బరువుతో కుదేలైపోతుందని.. మనల్ని మోసేదాన్ని మనం ఎప్పుడూ మోయకూడదు. అంటూ చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ సినిమాకి రివ్యూ అవసరం లేదు. రాయడానికీ ఏమీలేదు. ఎందుకంటే.. నాలుగు ముక్కలు తీసి వాటిని టీజర్..ట్రైలర్ అని వదిలేసి వాటితో జనాల ఎమోషన్ ని డైవర్ట్ చేసి.. వినోదాన్ని పంచుతున్ననంటూ సొమ్ములు చేసుకునే ఇటువంటి చిన్న చిన్న అటూ ఇటూ కాని సినిమాలను తీస్తున్న రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాతో ఏం చెప్పారో.. ఏం చెప్పాలనుకున్నారో అనే ఉత్సాహం ఉన్నవాళ్లు ఓ మూడొందలు పెట్టి దీనిని కాలక్షేపానికి చూసి ఆర్జీవీ తెలివికి నవ్వుకోవాలొ.. ఆయన ట్రైలర్ దెబ్బకు మళ్ళీ మూడొందలు వదుల్చుకున్నామని బాధపడాలో ఎవరికీ వారు తేల్చుకోవాల్సిందే!

చివరగా.. ఈ సినిమా నేను చూసి.. నా అభిప్రాయాన్ని చెప్పాను. అంతే. ఇందులో నేను ప్రస్తావించిన విషయాలన్నీ సినిమాలో నేను చూసి నాకు అర్ధం అయిన విధానంలో రాసిన మాటలే. ఇది కేవలం నా ఆలోచనలను చెప్పడమే. ఎవరికి వారు ఈ సినిమా చూసి మీకు నచ్చిన విధంగా దర్శకుడిని తిట్టుకుంటారో.. సినిమా నచ్చిందని అందరికీ చెప్పి చూడమని చెబుతారో మీ ఇష్టం!

అన్నట్టు ఈ అభిప్రాయంతో హెచ్ఎంటీవీకి ఏ మాత్రం సంబంధం లేదని మనవి.

Show Full Article
Print Article
Next Story
More Stories