ఇంటిల్లపాదినీ ఆకట్టుకునే 'అమ్మోరు తల్లి'

ఇంటిల్లపాదినీ ఆకట్టుకునే అమ్మోరు తల్లి
x
Highlights

అమ్మవారు తన కోర్కెను తీర్చుకోవడానికి భూమి మీదకు వస్తే ఎలా ఉంటుంది? తెలుసుకోవాలని ఉందా.. అయితే, 'అమ్మోరు తల్లి' చూదాల్సిందే. డిస్నీ హాట్ స్టార్ లో స్టీం అవుతున్న సినిమా ఎలా ఉందంటే..

దేవుడు..భక్తి..భక్తి పేరుతొ వ్యాపారం..భక్తుల దోపిడీ ఇలాంటి అంశాలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. వెండితెర..బుల్లితెర తేడా లేకుండా ఈ అంశాల చుట్టూ బోలెడన్ని కథలు చక్కర్లు కొట్టాయి. అయినా సరే.. మళ్ళీ మళ్ళీ వచ్చినా ఈ తరహా కథలకు క్రేజ్ ఉంటుంది. ఈ కథల్ని సినిమాలుగా తీయడానికి కాస్త ధైర్యం ఉంటే చాలు.. మంచి సినిమా తయారవుతుంది. ఈ ఫార్ములాతో వచ్చిన మరో సినిమా 'అమ్మోరు తల్లి'. నయనతార లాంటి టాప్ హీరోయిన్ తో ఆర్.జె.బాలాజీ, ఎన్.జె.శరవణన్ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తమిళంలో తయారైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి డిస్నీ హాట్ స్టార్ లో స్టీం అవుతోంది. మరి ఈ పాత హిట్ ఫార్ములాను నమ్ముకున్న కొత్త దర్శకుడు విజయం అందుకున్నాడా. అసలే ఒటీటీ లలో వట్టి గా మిగిలిపోతున్న సినిమాల్లో చేరిపోయిందా? ఓ లుక్కేద్దాం.

ఇదీ కథ..

కాశీబుగ్గ పట్టణంలో చిన్న చానెల్ లో ఏంగెల్స్‌ రామస్వామి (ఆర్‌.జె.బాలాజీ) రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. తనకు గుర్తింపు రావాలని పరితపిస్తుంటాడు. దాంతో అక్కడే ఉన్న ఓ స్వామీజీ చేసిన భారీ భూ కబ్జా మీద స్టోరీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంటాడు. దానితో ఎప్పటికైనా టాప్ జర్నలిస్ట్ కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇక అతఃని తల్లి బంగారం (ఊర్వశి) రామస్వామికి పెళ్ళిచేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది. ఆమె తిరుపతి వెళ్ళాలని కోరుకున్నా..ఎప్పుడూ ఏవో అవాంతరాలతో అది వాయిదా పడుతూ వస్తుంది. దాంతో ఆమెకు తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంటి దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుంటే మంచిది అని చెబుతారు. అమ్మవారి దర్శనానికి రామస్వామి, ఊర్వశి ఇద్దరూ వెళతారు. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిస్తుంది. తన ఆలయాన్ని తిరుపతి అంత గొప్పగా చేయాలని రామస్వామిని కోరుతుంది. మరి ఈ అమ్మవారి కోరికను తీర్చే పని రామస్వామి చేశాడా? అసలు అమ్మవారు పోయి పోయి ఈ రామస్వామిని గుడి గురించి అడగడం ఏమిటి? మధ్యలో భగవతి బాబా (అజయ్ ఘోష్) ఏం చేశాడు. అసలు రామస్వామి అమ్మవారి కోరిక తీర్చే క్రమంలో ఏమి తెలుసుకున్నాడు? ఇవి డిస్నీ హాట్ స్టార్ లో స్టీం అవుతున్న సినిమా చూడాల్సిందే.

ఇంతకీ ఎలావుంది?

అమ్మవారు భక్తుల కోరికలు తీర్చడం కోసం భూమి మీదకు రావడం చాలా సినిమాల్లో ఉంది. భక్తుల కష్టాలు.. కన్నీళ్ళూ.. వారి పూజలు.. అమ్మవారు ప్రత్యక్షంగా వారిని ఆదుకోవడానికి రావడం ఇలాంటి అంశాలతో ఎక్కువ సినిమాలు వచ్చాయి. అయితే, అమ్మవారు తన సమస్యను తీర్చుకోవడం కోసం తానే స్వయంగా రావడం అనేది చాలా తక్కువగా కనిపించే అంశం. ఇదిగో ఈ అంశంతో వచ్చింది 'అమ్మోరు తల్లి'. ఇక దేవుడి పేరు చెప్పుకుని భూ బకాసురుల్లా భూమిని బొక్కేసే బాబాలు చాలా సినిమాల్లో ఉన్నారు. వారిని ఎదుర్కునే హీరో ఉంటాడు. ఇదిగో ఈ సినిమాలో బాబాను ఎదుర్కునే హీరో.. అమ్మవారి కోరిక తీర్చే హీరో ఒక్కరే అవుతారు. ఈ అంశాలు అన్నీ పాత సినిమాల్లో ఉన్నా.. ఈ సినిమాలో వీటిని కొత్త తరహాలో చూపించాడు దర్శకుడు. వినోదాన్ని మిస్ కానీయకుండా.. కొత్తగా కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడు కొత్తవాడైనా చాలా జాగ్రత్తగా సినిమాని తెసాడని చెప్పొచ్చు. అన్ని అంశాలనూ మేలవిస్తూనే.. అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగాడు.

నటీనటులు ఎలా కనిపించారంటే..

అమ్మవారిగా నయనతారను ఎన్నుకోవడమే ఈ సినిమాకి సగం విజయం అని చెప్పొచ్చు. నిజమైన సూపర్ స్టార్ అంటే ఏమిటో నయనతార చూపించారు. అమ్మవారిగా రౌద్రం పలికించాల్సిన చోట ప్రేక్షకులను కదలకుండా చేసిన నయనతార.. వినోద సన్నివేశాల్లో నవ్వుతో మేలితిరిగేలా చేశారు. హీరోగా బాలాజీ అదరగొట్టేశాడు. ఇక విలన్ గా.. బాబా గా చేసిన అజయ్ ఘోష్ అద్భుత విలనీ ప్రదర్శించారు. ఇక ఊర్వశి కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయారు.

సాంకేతికంగా ఎలా ఉందంటే..

సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ గురించి. అమ్మవారు కనిపించే సన్నివేశాలు, ఏరియల్‌ వ్యూ షాట్స్‌లో దినేష్‌ కృష్ణన్‌ సూపర్ వర్క్ ఇచ్చారు. విజువల్స్ అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఇక సెల్వ ఎడిటింగ్ సినిమాకి ప్లస్. మొదటి సినిమా అయినా బాలాజీ, శరవణన్ అసలు అలా అనిపించేలా సినిమా చేయలేదు. మంచి స్క్రీన్ ప్లే.. ఎక్కడా తడబాటు లేకుండా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా వినోదాత్మకంగా చెబుతూ చక్కని పనితనం కనబరిచారు.

మొత్తమ్మీద సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉండేలా సినిమా ఉంది. సరదాగా ఇంట్లో కుటుంబం మొత్తం కూచుని హాయిగా చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.

చివరగా.. ఓటీటీ లో వరుస వైఫల్యాల తరువాత సూర్య ఆకాశం నీ హద్దురా తో మొదటి విజయం అందుకున్నారు. దాని కొనసాగింపుగా ఈ 'అమ్మోరు తల్లి' విజయంతో ముందుకు దూసుకుపోయింది. ఇవి రెండూ తమిళ డబ్బింగ్ సినిమాలే! మరి మన తెలుగు సినిమా బోణీ ఎప్పుడుకోడుతుందో? అమ్మోరు తల్లే చెప్పాలి!

ఈ రివ్యూ పూర్తిగా రచయిత వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. సినిమా పై అభిప్రాయాలన్నీ రచయిత వ్యక్తిగతమే.

Show Full Article
Print Article
Next Story
More Stories