నాగార్జున రొమాంటిక్ షో: మన్మధుడు 2

నాగార్జున రొమాంటిక్ షో: మన్మధుడు 2
x
Highlights

నాగార్జున మరోసారి తన రొమాంటిక్ లుక్ తో అదరగొట్టారు మన్మధుడు 2 సినిమాలో. ఈరోజు విదుదలైన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమాగా ఆకట్టుకునే విధంగా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాని మరో లెవెల్ లో ఉంచింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడు అంటే కింగ్ నాగార్జునే! అభిమానులు నాగార్జునను అలానే చూస్తారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అప్పటిలానే కనిపిస్తూ తన అభిమానుల్ని మురిపిస్తారు నాగార్జున. అయన చేసిన మన్మధుడు సినిమా ఆయనకు మంచి ఇమేజిని తీసుకువచ్చింది. కామెడీలో కూడా నాగార్జున కింగ్ అనిపించేలా సినిమా హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్ తో ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగార్జున. పేరు అదే కానీ కంటెంట్ మాత్రం కొత్తది. 'ఐ డూ' అనే ఫ్రెంచ్ సినిమాకి ఇది తెలుగు రీమేక్. నటుడు రాహుల్ రవీంద్ర చి.సౌ.ల. సినిమాతో ఆకట్టుకున్నాడు. తన రెండో సినిమా క్రేజీ కాంబినేషన్ తో సెట్ అయింది. నాగార్జున, రాకుల్ కాంబినేషన్లో చేసిన ఈ సినిమా ఈరోజు (ఆగస్టు 9) విడుదలైంది. సినిమా ఎలా వుంది? నాగార్జున మన్మధుడిగా ఈసారి ఏ అల్లరి చేశారు? రకుల్ నాగార్జునతో ఎలా వెగింది? ఇవన్నీ తెలుసుకుందాం...

కథ ఇదే!

సామ్ అనిపిలుచుకునే సాంబశివరావు (నాగార్జున) పోర్చుగల్ లో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన వాడు. కొన్ని కారణాల వల్ల పెళ్లి పై విముఖత పెంచుకుంటాడు. ప్లేబాయ్ లా గడిపేయడానికే ఇష్టపడతాడు తప్పితే పెళ్లి మాటంటే ఒప్పుకోడు. వయసు పెరుగుతున్నా పెళ్లి కాకుండా ఉండిపోయాడని కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. ఒకరోజు అందరూ కలిసి మూడు నెలల్లో ఎలాగైనా సరే బాబుగారికి పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోతారు. దీనితో ఈ బాధ తప్పించుకోవాలని రకుల్ ను తన ప్రియురాలిగా పరిచయం చేస్తాడు. అయితే అసలు కథ వేరే.. రకుల్ తో మూడు నెలల నాటకానికి ఒప్పించి, పెళ్లి రోజు పారిపోవాలని చెప్పి తీసుకువస్తాడు. ఇంకేముంది.. కుటుంబ సభ్యులు పెళ్లి హడావుడిలో ఉంటారు.. మరి మూడు నెలల తరువాత కాంటాక్ట్ ప్రకారం రకుల్ వెళ్లిపోయిందా? సామ్ పెళ్లి చేసుకున్నాడా? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ మిగిలిన కథ.

ఎవరెలా చేశారు..

నాగార్జున గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మన్మధుడు అంతే. కుర్రాడిలా కనిపించారు. నటన కూడా చాలా ఈజ్ తో చేశారు. కామెడీ.. ఎమోషన్స్ రెండిటిలోనూ తన మార్క్ చూపించారు. రకుల్ మంచి క్యారెక్టర్ దక్కింది. దానిని ఆమె నిలబెట్టుకుంది. నాగార్జునతో పోటీపడి నటించింది. నాగార్జున తల్లిగా లక్ష్మి తన శైలిలో చేశారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్, సమంతలు తలుక్కున మెరిసారు. చిన్న పాత్ర అయినా రావూరమేష్ అదరగొట్టారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ గురించి. సినిమా మొత్తం హిరో పక్కన ఉండి తన కామెడీతో సినిమాని పరుగులు తీయించాడు.

ఇక సాంకేతికంగా సినిమా బావుంది. ఎడిటింగ్ బాగా కుదిరింది. రాహుల్ రవీంద్ర సినిమాని పూర్తీ కామెడీ వేవ్ లో నడిపించారు. తనకి వచ్చిన క్రేజీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇక సినిమా చైతన్ భరద్వాజ్ సంగీతం ఫర్వాలేదు.

ఎలా ఉందంటే..

సినిమా పూర్తిగా కామెడీ జోనర్ లోనే ఉంది. కొంచెం రోమాన్స్.. ఎక్కువ కామెడీ.. చాలా తక్కువ ఎమోషన్స్ ఇంతే. కొంచెం రోమాన్స్ కూడా అక్కడక్కడ శృతి మించినట్టనిపిస్తుంది కానీ, సినిమా ఫ్లోలో దానిమీద అంత దృష్టి పడదు. రీమేక్ అయినప్పటికీ ఆ వాసనలు ఎక్కడా కనపడకుండా మేనేజ్ చేశారు. రాహుల్ రవీంద్ర డైలాగులు చాలా బావున్నాయి. సినిమాకి అవి మరో పెద్ద ప్లస్. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అంతా బాగా వచ్చింది. సినిమా మొదటి భాగం కన్నా రెండో భాగం ఆసక్తికరంగా సాగింది.

మొత్తమ్మీద లేటు వయసులో ఘాటు రొమాంటిక్ కామెడీని పండించారు నాగార్జున!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories