Mowgli 2025 Review: రోషన్ కనకాల ప్రయత్నం ఫలించిందా? హిట్ కొట్టినట్లేనా ?

Mowgli 2025 Review: రోషన్ కనకాల ప్రయత్నం ఫలించిందా?  హిట్ కొట్టినట్లేనా ?
x
Highlights

Mowgli 2025 Review: రోషన్ కనకాల హీరోగా నటించిన రెండవ చిత్రం మౌగ్లీ 2025.

Mowgli 2025 Review: రోషన్ కనకాల హీరోగా నటించిన రెండవ చిత్రం మౌగ్లీ 2025. జాతీయ అవార్డు గెలుచుకున్న కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వలన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనాథగా పెరిగిన ఒక యువకుడు తన ప్రేమ కోసం ఒక శక్తివంతమైన పోలీస్ అధికారితో ఎలా పోరాడాడు అనే కథాంశంతో మౌగ్లీ తెరకెక్కింది.

కథ

పార్వతీపురం అనే అడవి ప్రాంతంలో అనాథగా పెరిగిన మౌగ్లీ (రోషన్ కనకాల), తన తండ్రిలా పోలీస్ కావాలని కలలు కంటుంటాడు. ఆ ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, డూప్‌గా నటించడం ద్వారా జాస్మిన్ (సాక్షి మడోల్కర్) తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. వినికిడి లోపం ఉన్న డ్యాన్సర్‌గా ఆమె పాత్ర కొత్తగా ఉంటుంది. మౌగ్లీ, జాస్మిన్ ప్రేమలో పడతారు. అయితే, చిత్ర నిర్మాత కారణంగా ఈ ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. అదే సమయంలో, అమ్మాయిలపై మోజు పడే క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) అక్కడ ఎస్ఐగా బాధ్యతలు చేపడతాడు. జాస్మిన్‌పై కన్ను పడిన క్రిస్టోఫర్ నోలన్, ఆమెను ట్రాప్ చేయాలనుకుంటాడు. తన ప్రేమను కాపాడుకోవడానికి, క్రిమినల్‌గా ముద్రపడ్డ మౌగ్లీ, బలమైన పోలీస్ అధికారి అయిన నోలన్‌ను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల పర్ఫామెన్స్

బబుల్‌గమ్ సినిమాలో మంచి నటన కనబరిచిన రోషన్, ఈ సినిమాలో మరింత పరిపక్వత చూపించాడు. అతని ఇంటెన్స్ యాక్షన్, లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి. రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. ముఖ్యంగా సాహసోపేతమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. విలన్‌గా పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. విలన్‌గా అతని క్యారెక్టర్ డిజైన్, డైలాగులు చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమాటిక్ గ్రాండియర్‌ను పెంచడంలో హీరో కంటే కూడా విలన్ పాత్రే ఎక్కువ సీన్లలో ఆధిపత్యం చెలాయించింది. హీరోయిన్ సాక్షి మడోల్కర్ అందంగా కనిపిస్తూ, సంభాషణలు లేకుండా కేవలం కళ్లతోనే నటించి మంచి మార్కులు కొట్టేసింది. వైవా హర్షకు కూడా మంచి పాత్ర లభించింది. అతని కామెడీ, ఎమోషనల్ సీన్లు బాగున్నాయి.

టెక్నికల్ అంశాలు

కలర్ ఫోటో వంటి ప్యూర్ లవ్ స్టోరీ చెప్పిన దర్శకుడు సందీప్ రాజ్, ఈసారి ప్రేమ కథకు యాక్షన్, కమర్షియల్ అంశాలను జోడించారు. ఈ ప్రయత్నం బాగున్నప్పటికీ, సినిమా కథ, కథనంలో కొత్తదనం లోపించింది. కథనం ఊహించిన విధంగా రొటీన్‌గా సాగడం మైనస్ పాయింట్‌గా మారింది. ముఖ్యంగా, బలమైన కథా నేపథ్యం లేకపోవడం, ఫస్టాఫ్‌లో కథ అసలు ముందుకు సాగకపోవడం ప్రేక్షకులకు అసహనం కలిగించవచ్చు. కాల భైరవ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. యాక్షన్ ఘట్టాలకు ఆఫ్రికన్ వార్ డ్రమ్స్ ఉపయోగించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

మైనస్‌లు

కథనం సాగదీసినట్లుగా అనిపించడం, యాక్షన్ సీక్వెన్స్‌లలో నాసిరకమైన షాట్లు, అలాగే క్లైమాక్స్‌లో కథకు సంబంధం లేకుండా హనుమంతుడి ఎలిమెంట్‌లను బలవంతంగా జోడించడం కనెక్ట్ కాలేదు.

ఓవరాల్ గా

మౌగ్లీ 2025 లార్జర్-దన్-లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలబడటానికి ప్రయత్నించింది. రోషన్ కనకాల నటన, లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ , విలన్ బండి సరోజ్ కుమార్ పవర్‌ఫుల్ ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌లు. అయితే, సందీప్ రాజ్ నుంచి కలర్ ఫోటో రేంజ్‌లో నాన్-రొటీన్ కథనాన్ని ఆశించి థియేటర్‌కు వెళ్తే నిరాశ తప్పదు. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories