Gargi Movie Review: `గార్గి` మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Gargi Movie Telugu Review | Tollywood
x

Gargi Movie Review: `గార్గి` మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Gargi Movie Review: `గార్గి` మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Gargi Movie Review:

చిత్రం: గార్గి

నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్.ఎస్.శివాజీ, కళైమామణి శరవణన్, జయప్రకాష్, ప్రతాప్, సుధా, లివింగ్స్టన్, కవితాలయ కృష్ణన్, కలేష్ రామానంద్ తదితరులు

సంగీతం: గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ: శ్రియంటి, ప్రేమ్ కృష్ణ అక్కటు

నిర్మాత: రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, వీ గౌతమ్ రామచంద్రన్

దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్

బ్యానర్లు: బ్లాకీ జీనీ, మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్

విడుదల తేది: 15/07/2022

స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా "గార్గి". తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. తమిళ్ లో స్టార్ హీరో సూర్య మరియు తెలుగులో రానా దగ్గుబాటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా అలరించిన ఈ చిత్రం ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా జూలై 15, 2022న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను చేరుకుందో చూసేద్దామా..

కథ:

గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో చాలా మామూలు జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్ ఎస్ శివాజీ) ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఎంత ఆలస్యం అయినప్పటికీ ఆమె తండ్రి ఇంకా ఇంటికి రాకపోవడంతో గార్గి అతనిని వెతుక్కుంటూ అపార్ట్మెంట్ వద్దకు వెళుతుంది. అక్కడే ఆమె తండ్రిని తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ చేశారని తెలుసుకుంటుంది. కానీ తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మిన గార్గి అతనిని జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం న్యాయపోరాటం మొదలుపెడుతుంది. ఈ పోరాటంలో గార్గి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? ఆమెను, ఆమె కుటుంబాన్ని సమాజం ఏ విధంగా చూసింది? ఆమె తన తండ్రి నిర్దోషి అని నిరూపించిందా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రతిభ ఉన్న సాయి పల్లవి గార్గి పాత్రలో కూడా చాలా బాగా ఒదిగిపోయి తన పాత్రకి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. తన పాత్రకి ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉండటంతో సాయి పల్లవి నటన కూడా చాలా బాగా హైలైట్ అయింది. సినిమాకి సాయి పల్లవి నటన ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ కూడా చాలా బాగా నటించారు. కలైమామని శరవణన్ నటన మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. జడ్జి పాత్రలో ఒక ట్రాన్స్ జెండర్ ను తీసుకొని తన నటీనటుల ఎంపికతో దర్శకుడు ప్రేక్షకులను మెప్పించారు. సాయి పల్లవి తండ్రి పాత్రలో ఆర్ఎస్ శివాజీ కూడా బాగానే నటించారు. జయప్రకాష్, ఐశ్వర్య లక్ష్మి కూడా తమ పాత్రలలో ఒదిగిపోయి మంచి నటనను కనబరిచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల వంటి సెన్సిటివ్ టాపిక్ ని తీసుకున్నప్పటికీ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దారు. ఎటువంటి అశ్లీలత మరియు అసభ్యత లేకుండా సన్నివేశాలను ఎమోషనల్ గా మరియు మనసుకు హత్తుకునే విధంగా రాసుకున్నారు. సినిమా రన్ టైం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అనవసర సన్నివేశాలు ఏవి లేకుండా ఆది ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు. గోవింద్ వసంత సంగీతం ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ముఖ్యంగా తన నేపథ్య సంగీతంతో గోవింద్ వసంత అందరిని కట్టిపడేసారు అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే అనిపించింది. ఎడిటింగ్ కి కూడా మంచి మార్కులు వేయవచ్చు.

బలాలు:

సాయి పల్లవి

క్లైమాక్స్ ట్విస్ట్

ఎమోషనల్ సన్నివేశాలు

బలహీనతలు:

మెలోడ్రామా సన్నివేశాలు

కొన్ని స్లో సన్నివేశాలు

చివరి మాట:

ఒక కేసు విషయంలో ఒకరు నిందితుటగా మారడం చాలా సినిమాల్లో చూసాం కానీ ఆ నిందితుడి వెనకాల ఉండే కుటుంబం గురించి వాళ్ళ పరిస్థితి ఎలా మారుతుంది అని చూపించే సినిమా ఇది. ఒక్క వ్యక్తి చేసిన నేరానికి అతని కుటుంబం సమాజంలో ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటుంది అని సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా మొదటి అరగంటలోనే గార్గి కుటుంబం గురించి వారి పాత్రల గురించి ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ వెంటనే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను కూడా చూపిస్తారు. ఆ తరువాత సినిమా ఆసక్తికరమైన ట్విస్టులతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు ఎమోషనల్ గానే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించినటువంటి విధంగా ఉంటుంది.

బాటమ్ లైన్:

"గార్గి" ప్రేక్షకుల మనసులను హత్తుకునే విధంగా ఉండే హార్డ్ హిట్టింగ్ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories