logo
సినిమా రివ్యూ

ఎవరు మూవీ రివ్యూ: థ్రిల్లింగ్ ఎంటర్టైనర్

ఎవరు మూవీ రివ్యూ: థ్రిల్లింగ్ ఎంటర్టైనర్
X
Highlights

అడవి శేషు.. మన సినీ యువతరంలో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న నటుడు. స్క్రీన్ ప్లే రైటర్ గా, నటుడిగా తనకంటూ ఓ దారిని తయారుచేసుకుని దానిలో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. క్షణం, గూఢచారి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఒక ఇమేజిని సృష్టించుకున్నాడు. ఇప్పుడు తాజాగా 'ఎవరు' అంటూ పలకరించాడు

అడవి శేషు.. మన సినీ యువతరంలో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న నటుడు. స్క్రీన్ ప్లే రైటర్ గా, నటుడిగా తనకంటూ ఓ దారిని తయారుచేసుకుని దానిలో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. క్షణం, గూఢచారి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఒక ఇమేజిని సృష్టించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఎవరు అంటూ పలకరించాడు ప్రేక్షకుల్ని. థ్రిల్లర్ సినిమాగా ఎవరు రూపుదిద్దుకుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారి అంచనాలు అందుకుందా? అనుకున్నట్టు వారిని శేషు థ్రిల్ చేశాడా? తెలుసుకుందాం..

ఇదీ కథ..

ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త భార్య సమీర (రేజీనా).. డీఎస్పీ అశోక్ (న‌వీన్‌చంద్ర‌)ని హ‌త్య చేస్తుంది. పోలీస్ డిపార్టమెంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. సమీర ను అరెస్ట్ చేస్తారు. అయితే, తనపై అత్యాచారం చేయబోయినందుకే హత్య చేసినట్టు ఆమె చెబుతుంది. అసలు ఏం జరిగిందో తేల్చుకోవడానికి ప్రత్యేకంగా అవినీతి పరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ విక్రం వాసుదేవ్ (అడివి శేష్‌) ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తుంది డిపార్టమెంట్. దాంతో అతను సమీరా నుంచి కేసు నుంచి బయట పడేస్తానని లంచం తీసుకుంటాడు. అక్కడ నుంచి కేసుకి సంబంధించిన వివరాలు కూపీ లాగడం మొదలు పెడతాడు. అయితే, సమీర చెప్పిన విషయాలకు.. అప్పటికే బయటపడిన విషయాలకు పొంతన కుదరకపోవడం తో ఆమెను ఈ విషయంలో మరింత్ ఒత్తిడి చేస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ విషయం బయటకు వస్తుంది. తనేప్పుడో పరిశోధన చేసిన విన‌య్ వ‌ర్మ (ముర‌ళీశ‌ర్మ‌) మిస్సింగ్‌ కేసుకి ఈ కేసుకి మధ్యలో లింకు బయటకు వస్తుంది. అసలు ఆ లింకేమిటి? సమీర ఆ హత్య చేసిందా.. ఎందుకు చేసింది.. ఇలా ఎన్నో ప్రశ్నలు.. అన్నిటికీ జవాబే ఎవరు సినిమా.

ఇలా ఉంది..

ఒక హత్యతో సినిమా మొదలవుతుంది. డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోతుంది సినిమా.. అక్కడ నుంచి కథనం ఎక్కడా బిగి సడలకుండా ముందుకు సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిందే అది కదా. ప్రశ్న.. జవాబు.. మళ్ళీ ప్రశ్న జవాబు.. ఎవరు ఎందుకు.. ఇదే దోబూచులాట ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేసేస్తుంది. ఒకటి రెండు లాజిక్ లేని సీన్లు ఉన్నా.. అవి సినిమాకి పెద్ద భారం కాలేదు. దర్శకుడు సినిమా థ్రిల్ తో పాటు భావోద్వేగాలు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. అసలు సినిమా మొత్తం ప్రేక్షకుడు ఏం జరగబోతోంది అనే ఆసక్తి తోనే ఉంటాడు. సినిమా మొత్తం మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ఆఖరుకి చివర్లో వచ్చే మలుపు కూడా ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది.

ఇలా చేశారు..

సినిమా మొత్తం అడవిశేషు నడిపించేశాడు. గత సినిమాల్లో లానే స్క్రీన్ ప్లే అద్భుతాన్ని చూపించారు. దర్శకుడు వెంకట్ రాంజీ ఏ మాత్రం తడబడకుండా కథని నడిపించాడు. ప్రేక్షకులని థ్రిల్ చేయడమే కాకుండా భావోద్వేగాలు మిస్ కానీయలేదు. ట్విస్ట్ లు వరుసగా వచ్చి ఏం జరగబోతోందన్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అడివిశేష్ అవినీతి పోలీసు అధికారిగా మెప్పించారు. పతాక స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌నలో మ‌రో కోణం క‌నిపిస్తుంది. ఇక రెజీనా న‌ట‌న‌కి ప్రాధాన్యమున్న పాత్రలో చక్కగా చేసింది. క‌థంతా ఆమె చుట్టూనే న‌డుస్తుంది. అశోక్పాత్రలో న‌వీన్ చంద్ర ఒదిగిపోయిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. ముర‌ళీశ‌ర్మ‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ఆద‌ర్శ్ వ‌ర్మ పాత్రలో న‌టించిన కుర్రాడు కూడా మెప్పిస్తారు. సాంకేతికంగా సినిమా రిచ్ గా ఉంది. ముందే చెప్పినట్టు దర్శకుడు రాంజీ క‌థ‌పై పూర్తి ప‌ట్టుని చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగా వున్నాయి. వంశీ ప‌చ్చిపులుసు కెమెరా ప‌నిత‌నం, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం సినిమాకి ప్రధాన బలం అనడం లో సందేహం లేదు. నిజం, అబ‌ద్ధాల గురించి అబ్బూరి ర‌వి రాసిన మాట‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

మొత్తమ్మీద తెలుగు ప్రేక్షకులకి మరో ఉన్నతస్థాయి థ్రిల్లింగ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు.

గమనిక: ఇది సమీక్షకుడి ఆలోచనలతో ఇచ్చిన విశ్లేషణ. వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్పబడింది


Next Story