లాజిక్ లేని ఇస్మార్ట్ మాస్ మసాలా..ఇస్మార్ట్ శంకర్ !

లాజిక్ లేని ఇస్మార్ట్ మాస్ మసాలా..ఇస్మార్ట్ శంకర్ !
x
Highlights

పూరీ జగన్నాద్.. ఈ పేరు చెబితే హీరో తో మ్యాజిక్ చేయించిన మాస్ సినిమాలు గుర్తొస్తాయి. హీరో ఇజాన్ని తెలుగు తెరపై మరో లెవల్ కి తీసుకువెళ్లిన దర్శకుడు...

పూరీ జగన్నాద్.. ఈ పేరు చెబితే హీరో తో మ్యాజిక్ చేయించిన మాస్ సినిమాలు గుర్తొస్తాయి. హీరో ఇజాన్ని తెలుగు తెరపై మరో లెవల్ కి తీసుకువెళ్లిన దర్శకుడు పూరీ. కారణాలేమైనా కానీ, వరుస అపజయాలతో వెనుకపడ్డాడు. ఇక హీరో రామ్ పేరు చెబితే ఎక్కడ లేని ఎనర్జీ గుర్తువస్తుంది. యువ హీరోల్లో అత్యంత ఎనర్జిటిక్ హీరోగా రామ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించాడు. రామ్ కి కూడా ఈ మధ్య కాలంలో సరైన మాస్ హిట్ లేదు. ఇప్పడు పూరీ మాస్ ట్రీట్మెంట్ లో రామ్ ఎనర్జీ ఒదిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. కేవలం మాస్ ప్రేక్షకుల కోసం.. హీరోకు మాస్ ఇమేజ్ ని ఇవ్వడం కోసం తీసిన సినిమాగా చెప్పుకున్న ఇస్మార్ట్ శంకర్ ఈరోజు విడుదలైంది. మరి పూరీ మాస్ టేకింగ్ లో రామ్ ఎనర్జీ సరిగ్గా కుదురుకుందా.. రామ్ ఆశించిన మాస్ ఇమేజి ఈ సినిమాతో దక్కిందా..

కథ ఇదీ..

మాస్ సినిమాలకి కథ ఎలా ఉంటుంది. హీరో.. విలన్.. మధ్యలో హీరోయిన్! ప్రేమ.. పగ.. ప్రతీకారం ఇంతే కదా! ఇదీ దాదాపు అంతే. శంకర్‌ (రామ్‌) ఎవరినీ లెక్కచేయని.. ఎవరి లెక్కలకూ అందని ఓ కిరాయి రౌడీ. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఇతను ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఓ హత్య చేస్తాడు. అదీ ఓ పొలిటికల్ నేతని. పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ సందర్భంగా తాను ప్రేమించిన చాందిని చనిపోతుంది. ఇక సహజంగానే బాబు తన ప్రేయసిని చంపిన వారిని చంపాలని గాలింపు మొదలెడతాడు. దాంతో పోలీసులు శంకర్ ని పట్టుకుని జైల్లో పెడతారు. ఇక్కడ కథ కొత్త మలుపు తిరుగుతుంది. కొన్ని ప్రత్యేక కారణాలతో సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌) ఓ పోలీస్‌ అధికారి (సత్య)కి చెందిన మెమొరీ కార్డుని శంకర్‌ మెదడులో నిక్షిప్తం చేస్తుంది. దీంతో రామ్ పాత్ర రెండు విధాలుగా మారిపోతుంది. అసలు ఈ మెదళ్ల మార్పిడి వ్యవహారం ఏమిటి? రామ్ కు సత్యకు సంబంధం ఏమిటే? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది?

లాజిక్ గురించి ఆలోచించకుండా పక్కా మాస్ సినిమా చూడాలంటే ఇస్మార్ట్ శంకర్ సూపర్ సినిమా. పూరీ మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ తో కొత్తదనాన్ని అందించాలని అనుకున్నట్టు కనిపిస్తుంది. కానీ కొత్తదనం కాన్సెప్ట్ వరకే ఆగిపోయింది. కథా గమనం పూర్తిగా తన పాత పద్ధతిలోనే నడిచింది. దీంతో తాననుకున్న కొత్తదనాన్ని ప్రేక్షకులు ఫీల్ అయ్యే అవకాశం ఏ మాత్రం దక్కలేదనే చెప్పాలి. హీరోలను ఎనర్జిటిక్ గా చూపించే తన ప్రతిభకు రామ్ లాంటి హీరో దొరికాడు. దీంతో హీరో పాత్రను ఎంత మాస్ ఎనర్జీతో చూపించాలో అంతగానూ చూపించాడు. సినిమాకి బలం కూడా అదే. పూరీ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో దానికి డబుల్ డోస్ తో రామ్ కనిపిస్తాడు. ఇక హీరోయిన్ నభాషా క్యారెక్టర్ కూడా అంతే. వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలన్నీ మాస్ కోసమే డిజైన్ చేశారు. (సినిమా విడుదలకు ముందే రామ్ ఈ విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాడు.) ఇంటర్వెల్ వరకూ ఇదీ వరుసలో సాగుతుంది సినిమా. ఆ తరువాత మెదళ్ల మార్పిడి కథ మొదలవుతుంది. ఈ సినిమాలో విలన్ చివరి వారకూ కనిపించడు. దాంతో సినిమా మొత్తం రామ్ తెరమీద కనిపిస్తూ కథనాన్ని మొత్తం నడిపించాడు. ఇక్కడ నుంచి లాజిక్ లు వదిలేసి సినిమాని సినిమాగా చూస్తే మాత్రం ఎవరికైనా కొద్దిగా నచ్చుతుంది. ఇక ఇక్కడ విషయం కొత్తదైనా దాన్ని కూడా పూరీ తన పాత స్టైల్స్ లోనే చెప్పడంతో ఆ రివెంజ్ డ్రామా కొంత బోరు కొట్టిస్తుంది. కొన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేలా ఉండే సినిమా.. కొన్ని వర్గాలకు అసలు చేరువ అవుతుందా అనేది చెప్పలేం. కానీ, మొదటునుంచీ టార్గెట్ ఆడియెన్స్ అని చెబుతూ వస్తున్నందు వాళ్ళ సినిమా వాళ్ల టార్గెట్ రీచ్ కావచ్చు.

ఎవరెలా చేశారు?

ముందునుంచీ చెబుతున్నట్టు ఇది రామ్ సినిమా. పూరీ స్టైల్ లో రామ్ ఎనర్జీ చూపించిన సినిమా. సినిమా మొత్తం రామ్ తన భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్ల గురించి చెప్పడానికేం లేదు. హీరో ఎంత మాసో.. హీరోయిన్లు దానికి డబుల్ మాస్. అందులోనూ నభాషా పాత్ర మరీ మాస్. దానికి తగ్గట్టుగానే చేశారు ఇద్దరు హీరోయిన్లూ. ఇక మిగిలిన వారంతా తమ అవకాశం మేర చేశారు. రామ్ ఒక్కడిదే ఈ సినిమా. రామ్ నటనే ఈ సినిమాకి జీవం. అంతే. సినిమాలో సంగీతం బావుంది. పాటలు పూరీ మార్కులో సాగాయి. దానికి రామ్ స్టెప్పులు అదిరాయి. ఇక నేపథ్య సంగీతం విషయంలో మణిశర్మ మేజిక్ చేశాడు. డైలాగుల గురించి చెప్పక్కర్లేదు. ఎనుడుకంటే, పూరీ మార్క్ డైలాగ్స్ పవర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా సంవత్సరాల పాటు కనిపిస్తుంది. ఇందులోనూ అదేస్థాయిలో డైలాగులు వున్నాయి. పంచ్ లు ఉన్నాయి. ఈ విషయంలో నూటికి నూరు మార్కులు పూరీకి వేయాల్సిందే. అయితే కొన్ని డబుల్ మీనింగ్ మాటలు సెన్సార్ లో కొట్టుకుపోవడంతో డైలాగ్ కంటిన్యుటీ మిస్ అయిన భావన కలుగుతుంది.

మొత్తమ్మీద చెప్పాలంటే.. ఇది పూర్తిగా పూరీ మార్క్.. రామ్ ఎనర్జీ ప్యాక్డ్ సినిమా. లాజిక్ లు వదిలేసి రచ్చ చేసే సినిమా చూడాలంటే.. ఇస్మార్ట్ శంకర్ బెస్ట్ ఛాయిస్.

చివరగా.. కొత్తదనాన్ని ఆశించే వాళ్లకు మాత్రం ఇది ఇస్మార్ట్ గా అనిపించదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories