అల్లరి థ్రిల్లర్ బ్రోచేవారెవరురా!

అల్లరి థ్రిల్లర్ బ్రోచేవారెవరురా!
x
Highlights

బ్రోచేవారెవరురా టైటిల్.. చలనమే చిత్రము.. చిత్రమే చలనము అనే ట్యాగ్ లైన్ అందరినీ ఆసక్తిగా ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. మా సినిమా మంచి...

బ్రోచేవారెవరురా టైటిల్.. చలనమే చిత్రము.. చిత్రమే చలనము అనే ట్యాగ్ లైన్ అందరినీ ఆసక్తిగా ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. మా సినిమా మంచి సినిమా.. ఆడపిల్లల కోసమే ఈ సినిమా అంటూ సినిమా బృందం చేసిన ప్రచారం బ్రోచేవారెవరురా పై ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ఈరోజు (28) విడుదలైంది. సినిమా బృందం చెప్పినట్టు సినిమా ఉందో లేదో ఓ లుక్కేద్దాం!

కొన్ని సినిమాలు చూస్తుంటే చందమామ కథలా ఉంటుంది. మరి కొన్ని అల్లరి..అల్లరిగా అనిపిస్తాయి.. ఇంకొన్ని ధ్రిల్ అయ్యేలా చేస్తాయి. ఈ మూడింటినీ కలిపి ఒకేసారి చూస్తే అదే బ్రోచేవారేవరురా! ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. మెంటల్ మదిలో అనే వైవిధ్యభరితమైన సినిమా చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ.. హీరో శ్రీవిష్ణు రెండో సారి కూడా తమ విభిన్న ధోరణి చూపించారు. చిన్న పాయింట్ చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకున్న వివేక్ ఆత్రేయ.. దానిని సెల్యులాయిడ్ పై అంతే చక్కగా చూపించాడు. ఆడపిల్లలు ఎదుర్కుంటున్న ఓ సమస్య.. దాని చుట్టూ ఓ సెల్ఫ్ కిడ్నాప్ నేపథ్యంలో సునిశిత హాస్యంతో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపాడేస్తుంది.

కథ ఇదీ..

రాహుల్‌(శ్రీవిష్ణు), రాకీ(ప్రియ‌ద‌ర్శి), రాంబో(రాహుల్ రామ‌కృష్ణ‌) ముగ్గురూ ఇంటర్ ఫిఫ్త్ ఇయర్ (?) చదువుతుంటారు. అదే కాలేజీ ప్రిన్సిపాల్ కుమార్తె మిత్ర‌(నివేదా థామ‌స్‌) కూడా వాళ్ల క్లాస్‌లో చేరుతుంది. ఆమెకు భారత నాట్యం అంటే ప్రాణం. కనీ ఆమె తండ్రిచదువు.. క్రమశిక్షణ తప్ప మరేదీ ఒప్పుకోడు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నలుగురు స్నేహితులవుతారు. అంతా కలసి ఏం చేశారన్నదే కథ. ఆడపిల్ల కు కష్టాలు చెప్పుకునే స్వేచ్చ ఇవ్వకపోతే ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో.. తల్లిదండ్రులను వదిలి ఇంటిని దాటి బయటకు వెళ్తే ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో చెప్పే కథ ఇది.

ఎవరి నటన ఎలా ఉంది?

నివేదా థామస్ మిత్ర పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ పరంగా.. నటన పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ఇక రాహుల్ పాత్రలో శ్రీవిష్ణు చక్కగా చేశాడు. నివేదా పెతురాజ్, సత్యదేవ్.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వీళ్ళంతా సినిమాకి ప్లస్ అయ్యారు. వారి నటన తోనే సగం సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక చిన్న, చిన్న పాత్రలు చేసిన వారూ సినిమాలో చక్కని ప్రతిభ కనపరిచారు.

ఎలా ఉందంటే..

పూర్తి స్థాయి వినోదాత్మక కథకు.. ఒక సమస్యను జోడించి.. చెప్పిన సినిమా ఇది. సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా సినిమాలు చాలా వచ్చాయి. అవన్నీ మెప్పించాయి. అయితే, అవి ఒకే కోణం లో ఉంటాయి. దొంగాట, మనీ ఇటువంటివి. కానీ, ఈ సినిమాని మాత్రం వివేక్ ఆత్రేయ ఒక ప్రత్యెక పద్ధతిలో తీశాడు. ఒక పక్క వినోదం.. మరో పక్క కథలో మెలికలు.. ఇంకో పక్క చక్కని సందేశం ముప్పేటలా చేసి ప్రేక్షకుడ్ని కదలకుండా చేస్తుందీ సినిమా. సినిమా అంతా చక్కని హాస్యం చక్కిలిగిలి పెడుతూనే ఉంటుంది.

సాంకేతికంగా..

దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా మొత్తం ఒకే పంథాలో సాగేలా చూసుకున్నాడు. అది అంత ఈజీ కాదు. చిక్కని స్క్రీన్ ప్లే సినిమాకి బలం. ఇక నేపథ్య సంగీతం అందించిన విశాల భరద్వాజ్ సినిమాకి ప్రాణం పోసాడు. సాయి శ్రీరామ్‌ ఫోటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. స్క్రీన్ ప్లే ఎక్కడా ఇబ్బందిగా అనిపించకుండా సంగీతం.. ఎడిటింగ్ కుదిరాయి. ఇక పాటలు సినిమాలో కలిసిపోయి వస్తాయి. దాంతో హాయిగా అనిపించింది.

చివరగా.. ఇది దర్శకుడి సినిమా.. ప్రేక్షకుల సినిమా!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories