Nishabdham Movie Review: ష్..నిశ్శబ్దం!

Nishabdham Movie Review: ష్..నిశ్శబ్దం!
x
Highlights

Nishabdham Movie Review: అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమా ఓటీటీ లో ఈరోజు విడుదలైంది. సినిమా రివ్యూ..

అవును సినిమా సాంతం చూశాకా ప్రేక్షకుడి ఫీలింగ్ ఇలానె ఉంటుంది. ఎదో ఉంటుందని..ఎంతో ఉంటుందనీ మొదట్నుంచీ ఆసక్తి తొ చూసిన ప్రేక్షకులు..ముఖ్యంగా అనుష్క అభిమానులు సినిమా పూర్తయ్యాకా ఓ నిట్టూర్పు విడిచి ష్..నిశ్శబ్దం అనుకోకుండా ఉండలేరు. కరోనా కాటేసి సినిమా థియేటర్లు మూత పడ్డాకా.. సినిమా అభిమానులకు టీవీ పెద్ద దిక్కయింది. వచ్చిన ప్రతి పాత సినిమాని కూడా చూసి సరదా పడిపోతున్నారు.

అయితే.. ఓటీటీలో కొన్ని కొత్త సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. చిన్న సినిమాలు ఓటీటీ లో విడుదలవడం మొదట్లో జరిగింది. క్రమేపీ పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. మొన్నీ మధ్య నానీ వి సినిమా ఓటీటీ లో రిలీజై సందడి చేసింది. ఇప్పుడు అనుష్క నిశ్శబ్దం అంటూ ఓటీటీ లో ప్రత్యక్షం అయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది.. కానీ.. సినిమా విడుదల చేద్దామనుకునే సరికి.. కరోనా వచ్చేసింది. దీంతో సినిమా విడుదల ఆగిపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైంలో ఈరోజు విడుదల అయింది. అనుష్క చాలాకాలం తరువాత చేసిన సినిమా కావడం.. మాధవన్...అంజలి..సుబ్బరాజు..శాలినీ పాండే..అవసరాల శ్రీనివాస్ వంటి మంచి నటులు సినిమాలో ఉండడం..అదీ కాకుండా అనుష్క మాటలు రాని అమ్మాయిగా కనిపిస్తుండడం వంటి అంశాలతో సినిమాపై ప్రేక్షకులకు మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా టీజర్లు కూడా సినిమా పై అంచనాని పెంచాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా వుంది? అనుష్క ఎలా కనిపించింది? వంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

సినిమా అంతా అమెరికాలోనే సాగుతుంది. అందుకే సినిమాలో ఎక్కువగా ఇంగ్లీషు సంభాషణలు వినిపించాయి. మంచి పెయింటర్ అయిన సాక్షి (అనుష్క) మాట్లాడలేదు. ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ఆమెకు ఆంటోనీ(మాధవన్) అనే మిలియనియర్ మ్యుజీషియన్ తొ పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ తర్వాత ట్రిప్ కు వెళతారు. ఆ ట్రిప్ లో దెయ్యాల విల్లగా పేరుపొందిన ఒక పాత విల్లాకు చేరుకుంటారు. ఆ విల్లాలో 1972 లో భార్యాభర్తలు హత్యకు గురవుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తరువాత వెంటనే ఆంటోనీ హత్య జరుగుతుంది. సాక్షి తప్పించుకుని బయట పడుతుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. మరి ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అందరూ అనుకున్నట్టు అది దెయ్యాల పనేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానం నిశ్శబ్దం!

ఈ సినిమా కథను దర్శకుడు హేమంత్ మధుకర్ చక్కగానే తీసుకున్నారు. కానీ, కోన వెంకట్ స్క్రీన్ ప్లే మాత్రం ఈ కథను సరిగా ప్రెజెంట్ చేయలేకపోయింది అనిపిస్తుంది. సస్పెన్స్ సినిమాలో ఉండాల్సిన పట్టు తప్పిపోయింది. అనవసరంగా ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ లమీద సినిమా నడిపించారు. మొదటి భాగంలో కొంత వరకూ సస్పెన్స్ లాక్కొచ్చారు. కానీ, తరువాత అంతా తెలిసిపోయేలా కథనం సాగింది. ప్రేక్షకుడి సహనానికి కూడా ఇక్కడే పరీక్ష మొదలవుతుంది. దాంతో చివరికి వచ్చేసరికి ఏం జరగబోతోందో ముందే తెలిసిపోయి థ్రిల్ పోతుంది.

ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది హాలీవుడ్ స్థాయి లుక్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్. సినిమా చూస్తున్నంత సెపూ హాలీవుడ్ సినిమాలా కనిపిస్తుంది. దానికి తోడు సినిమా మొత్తం అమెరికాలోని రెండు నగరాల మధ్య తీయడం.. సినిమాలో ఎక్కువ సంభాషణలు ఇంగ్లీషులో వినబడటంతొ అలా అనిపిస్తుంది.

ఇక సినిమాలో ఎవరు ఎలా చేశారు అని చెప్పుకోవాలంటే, ముందుగా అనుష్క గురించి. ఆమె ముగ అమ్మాయిగా సరిగ్గా సరిపోయారు. కానీ, ఆమెలోని నటిని ఉపయోగించుకునే సన్నివేశం ఒక్కటీ.. సినిమాలో లేదు. పెద్దగా ఆమె చేయాల్సిందీ ఇందులో ఏమీ కనిపించలేదు. లీడ్ రోల్ అని తప్పితే.. అనుష్క స్థాయి నటన ఎలివేట్ చేసే సీన్ ఒక్కటి కూడా లేదు. ఒకటి అరా అలా అనిపించినా అవి పెద్దగా గుర్తుంచుకో తగ్గ సీన్లూ కావు. ఇక మాధవన్.. అంజలి.. శాలినీ పాండే.. సుబ్బరాజు.. మైఖేల్ మ్యాడ్ సన్ ఇలా మంచి తారాగణం ఉన్నా వారెవరికీ ఎలివేట్ అయ్యేంత స్కోప్ ఉన్న సీన్లు పడలేదు. రొటీన్ గా సాగిపోయే పత్రాలు కావడంతో ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుడి మదిలో నిలిచేలా ఉండదు.

టెక్నికల్ గా మాత్రం సినిమా మరో లెవెల్ లో ఉంది. విజువల్స్ అదిరిపోయాయి. శానీల్ డియో కెమెరా చాలా బావుంది. ఇక నేపధ్య సంగీతం అయితే చెప్పక్కర్లేదు. ఈ రెండూ ఎంత బాగా కుదిరాయి అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కచ్చితంగా సినిమా స్క్రీన్ ప్లే లోపాల గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం దొరకడు. లాగ్ అవుతున్న సీన్లు కూడా నేపధ్య సంగీతంతో కవర్ అయిపోయాయి. పాటలు బాగానే ఉన్నాయి. గోపీ సుందర్ సంగీతం హాయిగా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదు.

చివరగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే.. ఓటీటీ లో చూస్తున్నాం కాబట్టి ఓపిగ్గా చూడలేకపోయినా.. బిట్లు బిట్లుగా చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. ఎందుకంటే ఇది సస్పెన్స్ కి ఎక్కువా.. థ్రిల్ కి తక్కువా అనిపించే సినిమా!

ఇది రివ్యూయర్ దృష్టికోణం లోంచి రాసిన రివ్యూ. ఇది విమర్శకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఈరోజు మరో సినిమా రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా!' సినిమా కూడా ఆహా ఓటీటీ లో విడుదలైంది. ఆ సినిమా ఎలా వుందో రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Show Full Article
Print Article
Next Story
More Stories